రైతులు, యువత కోసం ఏం చేశారు? ర్యాలీలో మోదీని ప్రశ్నించిన రాహుల్

బడా పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేయడం తప్ప రైతులు, యువత, మహిళల కోసం ప్రధాని మోదీ చేసిందేమీ లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

By :  Admin
Update: 2024-04-11 12:18 GMT

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించకపోగా, వారు పన్నులు చెల్లిస్తుండడం బాధాకరమన్నారు.

రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి గోవింద్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, గాంధీనగర్ నుంచి కుల్‌దీప్‌ ఇండోరా కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.

యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని, మహిళలు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటుంటే అవేమీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు అతిపెద్ద సమస్యలు - నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మీడియా ఫోకస్ చేయడం లేదన్నారు.

కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బడా పారిశ్రామికవేత్తల నుండి డబ్బు తీసుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ 15-20 మంది పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేశారని, మాఫీ చేసిన సొమ్ము 24 సంవత్సరాల పాటు ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

తమ మేనిఫెస్టోను హైలైట్ చేస్తూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు దేశంలోని పేద ప్రజలకు, బిలియనీర్లకు మధ్య పోరుగా అభివర్ణించారు రాహుల్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా రైతులు పన్నులు చెల్లిస్తుండడం దురదృష్ణకరమన్నారు. ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవని, ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ కోరారు.


Tags:    

Similar News