‘ గాజాలో యుద్ధాన్ని రేపే ముగిస్తాం.. కానీ’ : నెతన్యాహు ప్రతిపాదన

గాజాలో హమాస్ చేస్తున్న యుద్ధాన్ని రేపే ఆపేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు ప్రతిపాదించారు. కానీ తమ షరతులు కొన్ని ఉన్నాయన్న ఆయన..

By :  491
Update: 2024-10-18 13:38 GMT

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉగ్రవాద సంస్థ హమాస్ ముందు కీలక ప్రతిపాదన పెట్టారు. తమ బందీలను విడిచిపెట్టడంతో పాటు ఆయుధాలను కూడా పక్కనపెడితే రేపే గాజాలో యుద్ధం ఆపేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 7, 2023 నాటి పాశవిక దాడుల సూత్రధారి, ప్రస్తుత హమాస్ చీఫ్ అయిన యాహ్యా సిన్వార్ ను వేటాడి వెంటాడి హతమార్చిన తరువాత ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

సిన్వార్ ను హతం చేశామని ఇజ్రాయెల్ ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత, నెతన్యాహు మాట్లాడుతూ.. "గాజా ప్రజలకు, నా నుంచి ఒక సాధారణ సందేశం ఉంది. ఈ యుద్ధం రేపటితో ముగుస్తుంది. హమాస్ తన ఆయుధాలను వదిలి మన బందీలను తిరిగి ఇస్తే అది అంతం అవుతుంది." అని చెప్పారు.
హమాస్ నాయకుడు..
ఎక్స్ లో మాట్లాడుతూ "యాహ్యా సిన్వార్ చనిపోయాడు. అతను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధైర్య సైనికులచే రఫాలో చంపబడ్డాడు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కానప్పటికీ, ఇది ప్రారంభం ముగింపు." అని చెప్పాడు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సూత్రధారి అయిన సిన్వార్‌తో పాటు మరో ఇద్దరు హమాస్‌ ఉగ్రవాదులు హతమైనట్లు IDF గురువారం తెలిపింది.
బందీల గురించి హెచ్చరిక
ఇజ్రాయెల్‌తో సహా 23 దేశాల పౌరులను గాజాలో బంధించిందని ప్రస్తుతం హమాస్ దగ్గర ఇప్పటికి కూడా 101 మంది బందీలు ఉన్నారని నెతన్యాహు చెప్పారు. వారందరినీ స్వదేశానికి తీసుకురావడానికి ఇజ్రాయెల్ మా శక్తి మేరకు ప్రతిదీ చేయడానికి కట్టుబడి ఉంది. మన బందీలను తిరిగి ఇచ్చే వారందరికీ ఇజ్రాయెల్ హామీ ఇస్తుంది," అని నెతన్యాహు అభయమిచ్చారు. బందీలకు హాని జరిగితే, ఇజ్రాయెల్ నిర్ధాక్షిణ్యంగా విరుచుపడుతుందని హెచ్చరించాడు. దాడికి కారణమైన ప్రతి ఒక్కరిని వేటాడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌పై ఆగ్రహం..
ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద సౌధం తన కళ్ల ముందే కూలిపోతోందని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. హసన్ నస్రల్లాతో సహా కీలకమైన హిజ్బుల్లా నాయకులను ఐడీఎఫ్ ఏరివేయడం గురించి నెతన్యాహు మాట్లాడారు. ఇరాన్ పాలన దాని స్వంత ప్రజలపై అలాగే ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్‌లలో సృష్టించిన ఉగ్రవాద భూతాన్ని అంతం చేస్తున్నామని అన్నారు. అనంతరం ఈ ప్రాంతానికి స్నేహ హస్తం అందిస్తామన్నారు.
"మధ్యప్రాచ్యంలో ప్రజల శ్రేయస్సు, శాంతి, మంచి భవిష్యత్తును కోరుకునే వారందరూ ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఏకం కావాలి. మనమంతా కలిసి, మనలను వేధిస్తున్న చీకటి శక్తులను వెనక్కి నెట్టవచ్చు. మనందరికీ మంచి భవిష్యత్ ను అందించడానికి చేతులు కలపడానికి సిద్ధపడాలన్నారు."
అంతా యువ సైనికులే..
యాహ్వా సిన్వార్ ను అంతం చేసిన వారిలో అంతా యువ సైనికుల బృందం ఉందని ఐడీఎఫ్ తెలియజేసింది. వీరంతా గత తొమ్మిది నెలల కాలంలోనే శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఇజ్రాయెల్ పై దాడి చేసిన సమయానికి వీరంతా ఇంకా సైన్యంలో చేరలేదని తెలిపారు. తమ దేశంపై దాడి జరిగిందని తెలియగానే సైన్యంలో చేరినట్లు వెల్లడించింది. రఫాలో సాధారణంగా వెళ్తున్న క్రమంలో ముగ్గురు హమాస్ ఉగ్రవాదులు ఎదురయ్యారని, తమపై దాడి చేయడంతో ఎదురు కాల్పులు జరిపామని, అందులో వారు చనిపోయారని తెలిపారు. అయితే అందులో ఉంది సిన్వార్ అని తమకు తెలియదని వెల్లడించింది. ప్రస్తుతం సిన్వార్ కు సంబంధించి ఐడీఎఫ్ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Tags:    

Similar News