బైడెన్ తప్పుకోవడంతో అమెరికా విదేశాంగ విధానాల దారెటూ?

అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని ఇన్ని రోజులు భావించిన బైడెన్, సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పుకున్నారు. కానీ..

Update: 2024-07-22 09:21 GMT

ఆసియాలో రోజురోజుకి తన బలం పెంచుకుంటున్న చైనా, ఒకవైపు గాజాలో జరుగుతున్న తీవ్ర యుద్ధం, ఇంకో వైపు ఉక్రెయిన్ కి అందిస్తున్న ఆయుధ సాయం... ఈ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నిక రేసు నుంచి తాను తప్పుకుంటున్న జో బైడెన్ ప్రకటించడం ప్రపంచాన్ని మరింత అనిశ్చితిలోకి నెట్టింది.

బైడెన్ ఉన్న విస్తృత రాజకీయ పరిచయాలు ప్రపంచంలో ఉన్న మరో నాయకుడికి లేవనే చెప్పాలి. ఆయన సుమారుగా 50 సంవత్సరాలుగా అమెరికా, ప్రపంచ రాజకీయంలో తన ప్రభావం చూపారు. కానీ రెండో సారి కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను ఉన్నానని ప్రకటించారు. ట్రంప్ తో జరిగిన తొలి డిబెట్ లో ఆయన చాలాసార్లు తడబడ్డారు. దీంతో సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి అధ్యక్షుడు విదేశాంగ విధానంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇజ్రాయెల్
జో బైడెన్ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అయితే కమలా అభ్యర్థిత్వంపై జ్యూయిష్ లాబీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ఉగ్రవాద సంస్థ హమాస్ పై ఐడీఎఫ్ చేస్తున్న పోరాటంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు.
ఇజ్రాయెల్ వామపక్ష దినపత్రిక హారెట్జ్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా హారిస్ రికార్డును పరిశీలిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. గాజాలో కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ, రఫాపై ఐడీఎఫ్ దాడిని ఖండించింది. గాజాలోని పౌరుల మరణాల సంఖ్యపై చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
"బైడెన్ నిష్క్రమణతో, ఇజ్రాయెల్ చివరి జియోనిస్ట్ అధ్యక్షుడిని కోల్పోయింది" అని న్యూయార్క్‌లోని మాజీ ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ అలోన్ పింకాస్ అన్నారు. అక్టోబరు 7 నాటి హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌కు బైడెన్ గట్టి మద్ధతుదారుడిగా నిలిచారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ.. " అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌కు తిరుగులేని మద్దతు" ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "మీ దృఢమైన మద్దతు, ముఖ్యంగా యుద్ధ సమయంలోఇచ్చిన సపోర్టు అమూల్యమైనది," గాల్లంట్ ఎక్స్ లో రాశాడు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మాట్లాడుతూ.. మా రెండు దేశాల ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలకు నిజమైన మిత్రుడు జో బైడెన్ అని పేర్కొన్నారు. యూదు ప్రజలకు నిజమైన మిత్రుడు అని ప్రశంసించారు.
ఉక్రెయిన్
ఉక్రెయిన్ విషయంలో బైడెన్ బలమైన సాయంగా నిలిచారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ను ఒప్పిస్తూ ఆధునిక ఆయుధాలు ఉక్రెయిన్ కు అందించారు. అలాగే పాశ్చాత్య కూటమిని కూడా ఇందుకు ఒప్పించగలిగాడు కూడా. కానీ కొంతకాలంగా అమెరికా, బ్రిటన్ నుంచి ఆ దేశాలకు సరైన సమయంలో ఆయుధాలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది యూరోపియన్లు ఉక్రెయిన్ భారం తమపై పడుతుందని గ్రహించారు. ఇది ఆయా దేశాల పాలకులపై పడింది.
జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ స్పందించారు. తమ దేశానికి సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పుతిన్ నియంతృత్వాన్ని అంతం చేయడానికి తన శాయశక్తుల ప్రయత్నించారని కొనియాడారు. కానీ ట్రంప్ ఎన్నికల్లో గెలిస్తే ఒక్కరోజులోనే యుద్దాన్ని ఆపేస్తానని ప్రకటించడం ఆ దేశానికి ఖంగారు పుట్టిస్తోంది. రష్యా ఆక్రమించిన భూభాగాలను అలాగే ఉంచి సెటిల్ మెంట్ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని కీవ్ అంచనా.
ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే కీవ్ కు అందుతున్న సైనిక సాయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాబట్టి విదేశాంగ విధానంపై ట్రంప్, వాన్స్ మధ్య స్పష్టమైన ఏకభిప్రాయంతో ఉన్నారని చెప్పవచ్చు.
రష్యా
బైడెన్ తప్పుకోవడంపై క్రిమ్లిన్ కూడా స్పందించింది. ఎవరు ఉన్నా లేకపోయినా ఉక్రెయిన్ పై మా వైఖరి మారదని వ్యాఖ్యానించింది. మా విషయంలో అమెరికా వైఖరిలో మార్పు ఉంటుందనే విషయంలో నమ్మకం లేనట్లుగా పేర్కొంది. "మేము శ్రద్ధ వహించాలి" అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నట్లు రష్యన్ అనుకూల టాబ్లాయిడ్ పేర్కొంది. "ఏమి జరుగుతుందో వేచి చూడాలి. మా స్వంత పనిని పూర్తి చేయాలి." అని వ్యాఖ్యానించారు.
చైనా
చైనా విషయంలో ట్రంప్, బైడెన్ ది ఒకే వైఖరి. బీజింగ్ సైనిక బలం పెరుగుతుండటం, అమెరికా వ్యాపారాలు, కార్మికులు, తక్కువ ధర కలిగిన చైనా వస్తువుల దిగుమతి విషయంలో అమెరికా ఓటర్లను ఒప్పించే పనిని చేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను బైడెన్ సర్కార్ పెంచింది. ట్రంప్ ఎన్నికైతే చైనా వస్తువులపై 60 శాతం సుంకాలను అమలు చేస్తామని హమీ ఇచ్చారు.
ట్రంప్ అనుసరిస్తున్న "అమెరికా ఫస్ట్" సిద్ధాంతం బీజింగ్‌తో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. యుద్ధాలు, వాణిజ్యం, సాంకేతికత, భద్రతపై భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి, ఆర్థిక కోలోసస్‌తో విభేదాలు బిడెన్ పదవీకాలం వరకు కొనసాగాయి.
అమెరికా అధ్యక్ష రేసుపై చైనా అధికారికంగా స్పందించింది. అధికారిక జిన్హువా వార్తా సంస్థ బైడెన్ నిర్ణయం ఎటువంటి ప్రభావం లేనిదిగా చాలా చిన్న సైజు వార్తలో ప్రచురించింది. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎవరు వచ్చిన ఇలానే ఉంటారని చెబుతూ ఓటర్లు ట్రంప్ అనుకూలురు, ట్రంప్ ద్వేషులుగా విభజించారు.
ఇరాన్
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్దంలో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా తమ ప్రాంతంలో ఉండకూడదనే లక్ష్యంతో టెహరాన్ పని చేస్తోంది. తన ప్రాక్సీలను మాటీమాటికి ఉసిగొల్పుతూ అక్కడ అశాంతిని రగిలిస్తోంది. అమెరికా ఇక్కడ గందరగోళ వైఖరిని అవలంబిస్తోంది.
యెమెన్ లో ఇరాన్-మద్దతుగల హౌతీలు గత వారం మొదటిసారిగా టెల్ అవీవ్‌పై భారీ క్షిపణి దాడికి పాల్పడటంతో ఒక యూదు పౌరుడు మరణించాడు. దీనిపై ఇజ్రాయెల్ గట్టిగానే స్పందించింది. 1800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హౌతీ పోర్టులపై బాంబుల వర్షం కురిపించారు. దీనితో ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం పశ్చిమాసియా మొత్తం విస్తరించే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి.
యుఎస్ దాని మిత్రదేశాలు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విస్తరించిందని, యురేనియంను 60 శాతం దాకా విస్తరించిందని ఆరోపించాయి. ప్రపంచ శక్తులతో టెహ్రాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి ట్రంప్ 2018 లో బైటకి వచ్చారు. అయితే తరువాత అధ్యక్షుడు అయిన బైడెన్ ఇరాన్ వ్యతిరేక వైఖరిని విడనాడతానని చెప్పాడు కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ అది కనిపించలేదు. తిరిగి ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ ఆకస్మిక మరణం - ఇరాన్ అధ్యక్ష పదవికి కొత్త అవకాశాలు, నష్టాలను సృష్టించింది. మసౌద్ పెజెష్కియాన్ ఇరాన్ ప్రపంచానికి తెరవడానికి సాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతూనే.. అమెరికాకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం కొనసాగించాడు.
యూరప్- NATO
నాటో ఖర్చు మొత్తం అమెరికానే భరిస్తోందని, అయితే లాభాలు మొత్తం సభ్య దేశాలు తీసుకుంటున్నాయని ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయా దేశాలను విమర్శించారు. దీంతో చాలా యూరప్ దేశాలు ట్రంప్ ఓడిపోగానే సంతోషం వ్యక్తం చేశాయి. బైడెన్ రాగనే తమ మిత్ర దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ ఆయన కూడా ఇప్పుడు రేసు నుంచి తప్పుకోవడంతో నాటో పరిస్థితి గందరగోళంలో పడిందని చెప్పుకోవచ్చు.
పోలిష్ ప్రధాన మంత్రి డోనాల్డ్ ఎంపికను "మీ జీవితంలో అత్యంత కష్టతరమైనది" అని పేర్కొన్నాడు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉత్తమంగా కృషి చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాగే ఐర్లాండ్ ప్రధాని కూడా బైడెన్ సేవలను గుర్తు చేసుకున్నారు.
"వారు డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా చూడాలని యూరప్ అనుకోవట్లేదు. కాబట్టి బిడెన్ నిష్క్రమించాలనే నిర్ణయం గురించి కొంచెం ఆందోళనగానే ఉంది, అని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ రీసెర్చ్ డైరెక్టర్ జెరెమీ షాపిరో అన్నారు.
మెక్సికో
మెక్సికో - US మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పులపై సమగ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారం చేపట్టినప్పటి నుంచి, రెండు దేశాలు వలసల సమస్యపై ఉమ్మడి సూత్రాన్ని కనుగొన్నాయి. అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను మెక్సికోలోనే ఆపడం ఇందులో ముఖ్య అంశం.
శుక్రవారం, మెక్సికో అధ్యక్షుడు ట్రంప్‌ను "స్నేహితుడు" అని పిలిచారు. "వలసదారులు యునైటెడ్ స్టేట్స్ కు మాదకద్రవ్యాలను తీసుకువెళ్లరని నేను అతనికి నిరూపించబోతున్నాను," అని లోపేజ్ చెప్పారు. "సరిహద్దును మూసివేయడం దేనినీ పరిష్కరించదు. అలాగే సరిహద్దులు మూసివేయడం ఎప్పటికీ జరగదని పేర్కొన్నారు.
Tags:    

Similar News