మరో 4 గంటల్లో అమెరికా ఎన్నికలు, హారిస్ కే జైకొట్టిన న్యూయార్క్ టైమ్స్
భారతీయ కాలమానం ప్రకారం నవంబర్ 5 మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అమెరికాలో పోలింగ్ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ప్రారంభం అవుతాయి.
By : The Federal
Update: 2024-11-05 06:49 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరుగనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం నవంబర్ 5 మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అమెరికాలో పోలింగ్ ప్రారంభమవుతుంది. అమెరికా సమయం ప్రకారమైతే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య పోలింగ్ కేంద్రాలను తెరుస్తారు. అమెరికాలో టైమ్ జోన్లు ఉండడం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైం ఉంటుంది. అందువల్ల దేశమంతటా ఒకేసారి పోలింగ్ ప్రారంభం కాగదు. పోలింగ్ ముగిసే సమయంలో కూడా తేడాలు ఉంటాయి. ఇండియన్ టైం ప్రకారమైతే బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రారంభం అవుతాయి. నవంబర్ 6న తెల్లవారుజామున 2.30 గంటల నుంచే ఈ సర్వే ఫలితాలు మొదలవుతాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తుది ఫలితం ప్రకటించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. గట్టి పోటీ ఉన్న ప్రాంతాలలో ఒకటికి రెండుసార్లు కూడా ఓట్లను లెక్కించాల్సి రావచ్చు.ముందు ఇ-మెయిల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఫలితం తేలడానికి నాలుగైదు రోజులు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2020లో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగితే నవంబర్ 7 వరకు ఫలితాలు తేలలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వార్తలను ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా నెట్‌వర్క్‌లు కవర్ చేస్తున్నాయి. తాజా అప్‌డేట్‌లను "ది ఫెడరల్" వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా చూడవచ్చు.
ఇప్పటి వరకు అందుతున్న సర్వేల ప్రకారం పోటీ తీవ్రంగానే ఉంది. న్యూయార్క్ టైమ్స్ పోల్స్ ప్రకారం కమలా హారిస్ కి 57 శాతం మంది, ట్రంప్ కి 40 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. 538 ఛానల్ ప్రకారం హారిస్ కి 47.9 శాతం, ట్రంప్ కి 47 శాతం మంది మద్దతు పలికారు.
పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎవరికి వచ్చినా స్వల్ప మెజారిటీయే కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలలో వచ్చే ఫలితాలే భావి అధ్యక్షుణ్ణి నిర్ణయిస్తాయని భావిస్తున్నారు.
సమస్యల ప్రాతిపదికగా ఈసారి ఓటింగ్ జరుగుతోంది. మహిళలకు గర్భస్రావం హక్కు ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది.
అమెరికా 47వ అధ్యక ఎన్నికల్లో సుమారు 25 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి పోటీ చేస్తుండగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తలపడుతున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరుగుతుంది.
ఎన్నికల తేదీలో మార్పు ఉండదు...
అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలో అధ్యక్ష పాలనా విధానం. కేంద్ర స్థాయిలో అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నిజమైన అధికారాలు కలిగి ఉంటారు. అధ్యక్షుని పదవీ కాలం 4 ఏళ్లు. ప్రతి లీపు సంవత్సరంలో నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఎన్నిక జరుగుతుంది. ఎన్నికైన అభ్యర్ధి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అధ్యక్షుడిగా పోటీ చేయటానికి 35 ఏళ్ల వయసు, అమెరికాలో జన్మించిన పౌరుడై, కనీసం 14 ఏళ్ల పాటు అమెరికాలో నివశించి వుండాలి.
పార్టీ అభ్యర్థుల ఎన్నిక ఎలా ఉంటుందంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ నవంబర్ నెలకి 8 నెలలు ముందే ప్రారంభం అవుతుంది. రిపబ్లికన్ లేదా డెమొక్రటిక్ పార్టీల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే కోరిక అనేక మందికి ఉండవచ్చు. కాని చివరకు ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కరే రంగంలో ఉంటారు. అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ దాదాపు 6 నెలల పాటు కొనసాగుతుంది.
ఈసారి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వానికి బైడెన్ తిరిగి పోటీ చేయడానికే నిర్ణయించుకున్నప్పటికీ వయసు మీద పడడంతో సొంత పార్టీ నుంచే తప్పుకోమని డిమాండ్ వచ్చింది. దీంతో ఆయన తప్పుకుని ఉపాధ్యక్షురాలు హారిస్‌ను డెమొక్రటిక్ అభ్యర్థిగా ప్రకటించారు. హారిస్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోడానికి 1976 డెలిగేట్ల మద్దతు అవసరం కాగా, ఆమెకు కాకసస్, ప్రైమరీస్‌లో 4,567 మంది డెలిగేట్ల మద్దతు లభించింది. అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం చేజిక్కించుకోడానికి ట్రంప్‌కు 1215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా, 2,243 మంది డెలిగేట్ల మద్దతు లభించింది.
కాకసస్ అంటే ఏమిటీ?
తొలిదశలో జరిగే సమావేశం కాకసస్. (కాకసస్ అంటే ఓ ముఠా అని). ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులు తమ పార్టీ తరపున ఏ అభ్యర్ధిని బలపరుద్దామనే విషయాన్ని చర్చించటానికి ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని ”కాకసస్” అంటారు. కొన్ని కాకసస్‌లు కలిసి ‘కౌంటీ’గాను, కొన్ని కౌంటీలు కలసి స్టేట్ గ్రూప్ గాను ఏర్పడతాయి.
రెండో దశలో- పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్ధి పార్టీకి చెందిన రిజిస్టర్ ఓటర్లు పాల్గొనే సమావేశాన్ని ”ప్రైమరీలు” అంటారు. ఈ సమావేశాలలో ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు, ఇతర అంశాలు వివరిస్తారు. రహస్య ఓటింగ్ జరుగుతుంది. ప్రైమరీలలో తమకు వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులు పోటీలో కొనసాగడమో, విరమించుకోవడమో చేస్తారు. మూడవ దశలో ఆ పార్టీ జాతీయ సదస్సు జరిగి ఎక్కువ మంది డెలిగేట్లు మద్దతు పొందిన వారికి పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేస్తారు.
అమెరికన్ కాంగ్రెస్ ఎలా ఉంటుందంటే...
1. అమెరికాలో పార్లమెంట్‌ను కాంగ్రెస్ అంటారు. దీనిలో ఎగువసభ పేరు సెనేట్. ఆ సభలో 100 మంది సభ్యులు వుంటారు. 50 రాష్ట్రాల నుంచి సమానంగా రాష్ట్రానికి ఇద్దరు చొప్పున సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి పదవీ కాలం 6 ఏళ్లు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు చొప్పున పదవీ విరమణ చేసి ఎన్నికలు జరగుతాయి.
2.దిగువసభ పేరు ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్). దీనిలో 438 మంది సభ్యులుంటారు. వీరి ఎన్నిక అధ్యక్ష ఎన్నికలతో పాటే జరుగుతాయి. 50 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వుంటుంది. ఉదాహరణకు పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా నుండి ప్రతినిధుల సభలో 52 మంది ఉండగా టెక్సాస్ నుండి 36 మంది, చిన్న రాష్ట్రాలైన వెర్మాంట్, నెవడా, నార్త్ డకోటా నుండి ఒక స్థానం మాత్రమే ఉంది.
అధ్యక్ష ఎన్నికలో ఎలక్టొరల్ కాలేజీ పాత్ర...
చాలా దేశాలలో అధ్యక్ష పాలన ఉన్నప్పటికీ వాళ్లందరూ ప్రజలు వేసిన ”పాపులర్ ఓటు” ఆధారంగా గెలుపొందుతారు. అంటే మెజారిటీ ఓట్లు పొందినవారు గెలుస్తారు. కాని అమెరికా అధ్యక్ష ఎన్నిక భిన్నంగాను, సంక్షిష్టంగాను ఉంటుంది. అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఒక "ఎలక్టొరల్ కాలేజి” ఏర్పడుతుంది. ఈ కాలేజీలో 538 మంది ఎలక్టొరేట్లు ఉంటారు. ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్‌లో సభ్యుల సంఖ్యకు సరిపడా ఎలక్టొరల్ కాలేజీలో ప్రాతినిధ్యం వుంటుంది.
ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 52, సెనేట్‌లో 2, మొత్తం 54 మంది సభ్యులుంటారు. ఆ రాష్ట్రానికి ఎలక్టొరల్ కాలేజీలో 54 మంది ఉంటారు. నార్త్ కరోలినా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 12 మంది, సెనేట్‌లో 2, మొత్తం 14 మంది ఉంటే, ఎలక్టొరల్ కాలేజీలో 14 మంది ప్రాతినిధ్యం పొందుతారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన తరువాత ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు ఏ అభ్యర్థికి ఎక్కువగా వస్తే, ఆ రాష్ట్రంలోని ఎలక్టొరల్ ఓట్లన్నీ అతనికే చెందుతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో నవంబర్ 5న జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిస్‌కు మెజారిటీ పాపులర్ ఓట్లు వస్తే ఎలక్టొరల్ కాలేజి లోని 54 ఓట్లు ఆమెకే లభిస్తాయి. అనగా 50 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు పొందిన అభ్యర్థి ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టొరల్ ఓట్లన్నీ పొందుతాడు.
ఆ విధంగా 538 ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో మెజారిటీ (270కి పైగా) పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు. నవంబరు 5న ఎన్నికలు జరిగినా అధ్యక్షుడి ఎన్నిక లాంఛనంగా జరిగేది డిసెంబరు17, వచ్చే ఏడాది జనవరి 6 తేదీల్లో. ఆ రెండు రోజుల్లో ఎలక్టొరల్ కాలేజి ఓటు చేస్తుంది. అధ్యక్ష పదవికి ఎన్నికైనవారు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.
పై విధానంలో కొన్నిసార్లు పాపులర్ ఓట్లు మెజారిటీ పొంది కూడా… ఎలక్టొరల్ కాలేజీలో మెజారిటీ పొందలేక ఓడిపోయిన సందర్భాలున్నాయి. 2016 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పాపులర్ ఓటు మెజారిటీ పొంది కూడా, ఎలక్టొరల్ కాలేజీలో తగినంత మెజారిటీ రాక ఓటమి పాలయ్యారు. 2000 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్‌గొరేకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జి బుష్ కంటే పాపులర్ ఓట్లు 5 లక్షల 40 వేలు అధికంగా వచ్చినప్పటికీ, ఎలక్టొరల్ కాలేజి ఓట్లు జార్జ్ బుష్‌కు 271, అల్‌గొరేకు 267 వచ్చి బుష్ గెలుపొందాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైనదని రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.