ఆర్యులెవరు? మూలవాసులెవరు? అంతా ఒక్కరేనా: తేల్చాలనుకుంటున్న కేంద్రం

భారతీయుల పూర్వీకులు ఎవరనేది మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా అధ్యయనం చేపట్టింది.

Update: 2024-10-17 09:23 GMT

ఇమేజ్ కర్టసీ- ఫేస్ బుక్

ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన ప్రజాసమూహాలలో దక్షిణాసియా ఒకటి. అందులో ఇండియా మరింత భిన్నమైంది. విభిన్న జాతులు, భాషలు, మతాలు, కులాలు, ఆచారాల కలయిక ఇండియన్లది. శాస్త్రవేత్తలు చాలాకాలంగా భారతీయ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు? వారి జన్యుమూలాలేమిటనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. సంపూర్ణ-జన్యు విశ్లేషణ సాగిస్తున్నారు. భారతీయుల మూలాలు ఇరానియన్ పూర్వీకుల నుంచి వచ్చినవారని కొందరంటుంటే ఆఫ్రికా నుంచి వచ్చి ఉండవచ్చుననే వారు ఇంకొందరు. "మనకు అంతగా తెలియని జనాభా గురించి మేము చాలా నేర్చుకుంటున్నాం" అని ఆమధ్య క్లెమ్సన్ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా జన్యు శాస్త్రవేత్త కెల్సే విట్ చెప్పారు.

చాలా మంది భారతీయుల జన్యుమూలాలు ప్రధానంగా మూడు ప్రాంతాల నుంచి వచ్చిన వారి మిశ్రమంగా భావించేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పదివేల ఏళ్లుగా ఈ భూమిపై నివసించిన వేటగాళ్ళు- 4700- 3000ల నాటి బీసీకాలంలో ఇరానియన్ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని, వాళ్లే ఆ తర్వాత రైతులుగా మారి ఉంటారన్న వాదన ఉంది.

మధ్య యురేషియన్ స్టెప్పీ ప్రాంతానికి చెందిన పశువుల కాపరులు ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చి దక్షిణ ఆసియా తీరం వెంబడి పయనించి ఉంటారనేది ఓ అంచనా. అలాంటిదేమీ లేదని సరస్వతీ నది తీరంలో స్థిరపడిన వారే భారతీయ మూలవాసులనే వారు ఉన్నారు. అందువల్ల 'స్వచ్ఛమైన భారతీయులు' ఉనికిలో ఉన్నారా లేదా అనేది చాలా కాలంగా వివాదాస్పదంగానే ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎన్ఎస్ఐ) తాజాగా ఈ అధ్యయనం చేపట్టింది. మొదటగా, ప్రాచీన భారతీయ సమాజాల మూలం గురించి విరుద్ధమైన సిద్ధాంతాల మధ్య దక్షిణాసియా జనాభా చరిత్రను "నికరంగా" కనుగొనడానికి పురాతన, ఆధునిక జన్యుశాస్త్రాలను ఉపయోగించి సమగ్రమైన శాస్త్రీయ అధ్యయనాన్ని చేపట్టింది.
"పురాతన, ఆధునిక జన్యుశాస్త్రాన్ని ఉపయోగించి దక్షిణాసియా జనాభా చరిత్ర పునర్నిర్మాణం" పేరిట ఈ కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఆంత్రపాలజిస్టులు ఇండియా, పాకిస్తాన్‌లోని వివిధ పురావస్తు ప్రాంతాల నుంచి సేకరించిన 300 పురాతన అస్థిపంజర అవశేషాలను విశ్లేషిస్తారు. ఈ అస్థిపంజరాలలోనూ ప్రత్యేకించి కపాలాలు, నోటిలోని పళ్లను, ఎముకలను పరీక్షించి భారతీయుల మూలాలను కనిపెడతారు.
"ది ఇండియన్ ఎక్స్ ప్రెస్"లో వచ్చిన కథనం ప్రకారం ఆంత్రపాలజిస్టులు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న హరప్పా, మొహెంజో-దారో, జమ్మూ కాశ్మీర్ లోని బుర్జాహోమ్, ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునకొండ, కర్నాటకలోని మాస్కీ, పంజాబ్ లోని రోపర్, గుజరాత్ లోని లోథల్ ప్రాంతాల్లో ఇంతకు ముందు తొవ్వకాల్లో సేకరించిన అవశేషాలను విశ్లేషిస్తారు. 1922, 1958 మధ్యకాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొవ్వకాల్లో బయటపడిన అవశేషాలను ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎన్ఎస్ఐ) అప్పగించింది.
డీఎన్ఏ ప్రాధాన్యత ఏమిటీ?
డీఎన్ఏ అంటే డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. జన్యు పరీక్ష అని పిలుస్తారు. ఇది జన్యువులు, క్రోమోజోమ్‌లు లేదా ప్రోటీన్‌లలో మార్పులను గుర్తించే వైద్య పరీక్ష. మనిషి మూలాలు చెప్పడంతో పాటు జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల గురించి కూడా చెబుతోంది. డీఎన్ఏ పరీక్ష ఒక నిర్దిష్ట సమస్యను గుర్తించడానికి ఉన్న అవకాశాలను నిర్దారిస్తుంది. రక్తం, చర్మం, జుట్టు, కణజాలం, ఎముకలు, పుర్రె ఎముకల ఆధారంగా ఈ పరీక్ష చేస్తుంటారు. ఇప్పుడీ పరీక్షల ఆధారంగా భారతీయుల మూలాలు కనిపెట్టాలనుకుంటోంది ఆంత్రోపోలాజికల్ విభాగం. శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. భారతీయ పురాతన జనాభా కదలికలపై లోతైన విశ్లేషణ చేస్తుంది. మున్ముందు పురాతన భారతీయ సమాజం విస్తరణను తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ తోడ్పడుతుందని భావిస్తున్నారు.

భారతదేశానికి ముందు వచ్చిన వారు ఆర్యులా, అనార్యులా, ద్రావిడులా వంటి వాదనలు, వివాదాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తమది మేలైన జాతి అంటే తమదనే గొడవలూ జరుగుతున్నాయి. అసలు స్వచ్ఛమైన జాతి అంటూ ఉందా? ఉంటే దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఇవన్నీ ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రాత్మక దృక్కోణంలో శాస్త్రసాంకేతిక ఆధునిక పరిజ్ఞానంతో భారతీయ మూలాలు కనిపెట్టే పని చేస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది. అస్థిపంజరాల నుంచి సేకరించిన డీఎన్ఏలను అధ్యయనం చేయడం, తద్వార పురాతన భారతీయ సమాజాల మూలాలను అన్వేషించడం లక్ష్యం. "పురాతన కాలంలో ఆహార పద్ధతులు, జీవన స్థితిగతులు, వ్యాధులు వంటి వాటిని గుర్తిస్తుంది. మన పూర్వీకులు పర్యావరణానికి అనుగుణంగా వలసలు పోయారా?, లేక ఒక చోట స్థిరపడి అక్కడి నుంచి వలసలు పోయారా?, వలసలు పోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ? వంటి వాటి గురించి సాధికారికంగా విశ్లేషిస్తుంది. కాలానుగుణంగా వచ్చిన మార్పులేమిటో గుర్తించి జన్యు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తుంది" అని ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎన్ఎస్ఐ) అధికారి శర్మ చెప్పారు.
ఒక్కమాటలో చెప్పాలంటే మన పూర్వీకులు ఎక్కడ నుండి వచ్చారు, ఎలా జీవించారు, పర్యావరణ పరిస్థితులు వాళ్ల గతిని మార్చాయా, వారి చరిత్ ఏమిటీ, వారసత్వం ఏమిటీ వంటి వాటిని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన సహాయపడుతుంది.
19వ శతాబ్దంలో పాశ్చాత్య పండితులు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం క్రీస్తు పూర్వం 2000-1,500 మధ్య కాలంలో సింధు నాగరికత విరాజిల్లిన తర్వాత మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వలసలు ప్రారంభమయ్యాయి. వాళ్ల శరీర రంగు చాలా చూడచక్కగా ఉండేదని (ఫెయిర్), వ్యవసాయమే ముఖ్య జీవనాధారంగా బతికారన్నది ఓ వాదన. భారతీయ ఉపఖండం నాగరికతలో సింధు నాగరికతకు అత్యధిక ప్రాధాన్యత ఉందన్నది ఇప్పటి వరకు ఉన్న చరిత్ర.
అయితే ఈ వాదనను అనేకమంది ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. భారతీయులు ఇక్కడి వారేనని, ఆర్యులు ప్రధానంగా సరస్వతీ నది వెంబడి నివసించే స్థానిక ప్రజలని చెప్పారు. సరస్వతీ నది ఎండిపోయిన తర్వాత, వారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, సింధు లోయలో కూడా స్థిరపడ్డారని చెబుతున్నారు. ఇందుకు కొన్ని సాక్ష్యాలను కూడా చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సినౌలీలో పురావస్తు శాఖ జరిపిన తొవ్వకాలలో 4 వేల ఏళ్ల నాటి స్వదేశీ యోధుల శకలాల నమూనాలు, ఆయుధాలు, రథాలు దొరికాయని, అందువల్ల ఆర్యులే పురాతన భారతీయులని చెబుతున్నారు.
ఈ పరిశోధనల ఆధారంగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఎన్సీఇఆర్టీ చరిత్ర పాఠ్యపుస్తకాలలో మార్పులు కూడా చేసింది. 5 వేల ఏళ్లుగా భారతీయ నాగరికత విరాజిల్లుతోందని, ఆర్యుల వలసలపై సందేహాలు అవసరం లేదని ఏఎన్ఎస్ఐ చెబుతోంది. దీన్ని నిర్దారించేందుకు ఇప్పుడు డీఎన్ఏ పరీక్షకు పూనుకుంది.
ఆర్యులు వలస వచ్చిన వారా లేక స్వదేశీయులా అనే అంశాన్ని నిర్ధారించేందుకు కూడా ఈ పరీక్ష ఉపయోగపడుతుందని ఏఎన్ఎస్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశ పురాతన చరిత్రను నిర్ధారించేందుకు ఈ విశ్లేషణ ఖచ్చితంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు.
ఈ విశ్లేషణకు బీర్బల్ సాహ్నీ ఇనిస్టిట్యూట్ సహకరిస్తుంది. ఏఎన్ఎస్ఐ ఆ సంస్థతో గత జూలైలో ఒప్పందం కుదుర్చుకుంది. 2025 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారు. భారతీయ వలసల చరిత్రను సాధికారికంగా విశ్లేషించేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్‌లో ప్రాచీన డీఎన్ఏ ల్యాబ్ అధిపతి నిరజ్ రాయ్ చెబుతున్నారు. “భారతదేశంలోని ఆధునిక డీఎన్ఏ, ప్రాచీన డీఎన్ఏ ను తులనాత్మకంగా అధ్యయనం చేసి వలసల సంక్లిష్టతలను బయటపెట్టేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది. అదే సమయంలో ప్రాచీన నాగరికతల మూలాలనూ బయటపెట్టవచ్చు. ప్రస్తుతం అందిన అవశేషాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం, ఇది సంక్లిష్టమైన ప్రక్రియ," అన్నారు నిరజ్ రాయ్.
మరోపక్క, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌తో కూడా ఏఎన్ఎస్ఐ ఒప్పందం చేసుకుంది. జన్యుపరమైన చిత్రపటాలను తయారు చేయడంలో లండన్ యూనివర్శిటీ కాలేజీకి ప్రత్యేకత ఉంది. మానవ చరిత్రలో జన్యు, సాంస్కృతిక పరిణామ క్రమాన్ని ఈ ప్రాజెక్ట్ బయటపెడితే చాలా అపోహలు తొలగిపోతాయి.
భారతీయుల పూర్వీకులు ఆర్యులా, అనార్యులా అనేది తేలితే దేశంలో పరిణామాలు కూడా మారిపోవచ్చు. ఇప్పటికే చరిత్ర పాఠ్య పుస్తకాలు మారిన నేపథ్యంలో ఈ డీఎన్ఏ పరీక్షకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది.
Tags:    

Similar News