బంగ్లాదేశ్ కొత్త క్యాబినెట్‌లో విద్యార్థి సంఘాల నాయకులకు చోటు..

నహిద్ టెలికమ్యూనికేషన్స్, IT మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారని, ఆసిఫ్ యువత, క్రీడల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తారని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-08-09 12:17 GMT

నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భుయైన్

షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన దేశవ్యాప్త విద్యార్థి నిరసనల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులుగా ఉండే అవకాశం లభించింది.

26 ఏళ్ల నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మద్ షోజిబ్ భుయైన్ రాష్ట్ర సంస్థలను సంస్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని, భారతదేశంలో తలదాచుకున్న మాజీ ప్రధాని హసీనా "ఫాసిజాన్ని" అంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో అతి పిన్న వయసులో మంత్రులయిన విద్యార్థులు..

నహిద్ టెలికమ్యూనికేషన్స్, IT మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారని, ఆసిఫ్ యువత, క్రీడల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తారని అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా మధ్యంతర ప్రభుత్వంలో యువకులతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉన్నారని నహిద్ పేర్కొన్నారు.

నహిద్ ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ మాస్టర్స్ విద్యార్థి. ఛత్ర ఓధికార్ పరిషత్ నుంచి బయటకు వచ్చని సభ్యులు ఏర్పాటు చేసిన గణోతంత్రిక్ ఛత్ర శక్తికి కార్యదర్శి కూడా. కాగా ఆసిఫ్ అదే విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో మాస్టర్స్ విద్యార్థి.గణో తంత్రిక్ ఛత్ర శక్తి కన్వీనర్.

'ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం'

"వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమంలో పాల్గొనేవారు ప్రభుత్వంలో పనిచేయడమే కాదు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వీధుల్లో ఉంటారు. దేశాన్ని సుభిక్షంగా ఉంచేందుకు అందరం కలిసి పనిచేయాలని" అని ఆసిఫ్ విలేకరులతో అన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు చాలా కాలంగా ఓటు హక్కుకు దూరం అయ్యారని, ఓటు హక్కును కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి అత్యంత పిన్న వయస్కుడైన సలహాదారులుగా సేవలందించేందుకు తాము సవాలును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ చెప్పారు. "ఫాసిస్ట్ అవామీ లీగ్ ప్రభుత్వంలో అన్ని రాష్ట్ర సంస్థలు పనికిరాకుండా పోయాయి. ఈ సంస్థలను సంస్కరించడం ద్వారా ఫాసిజాన్ని నిర్మూలించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అన్నారు.

అరెస్టు చేశారు.. హింసించారు

నిరసనల సమయంలో ప్రభుత్వ అణచివేతతో వందలాది మంది చనిపోయారు. నహిద్, ఆసిఫ్‌ను ఢాకాలో పోలీసులు నిర్బంధించారు. నహిద్ గురించి అతని తమ్ముడు నకిబ్ ఇస్లాం ఇలా అన్నాడు.. " మా అన్న దేశం మారాలని ఎప్పుడూ చెబుతుంటాడు. పోలీసులు పట్టుకుని, అపస్మారక స్థితికి చేరుకునే స్థాయిలో చిత్రహింసలు పెట్టి, రోడ్డుపై పడేశారు." అని చెప్పాడు.

Tags:    

Similar News