ENEMY PROPERTY | సైఫ్ అలీఖాన్ ఆస్తులు 15వేల కోట్లా! ఎలా వచ్చాయి?
15వేల కోట్ల ఆస్తులా? డబ్బులా, చిల్లపెంకులా అనేగా మీ అనుమానం.. మీరు చదివింది కరెక్టే. సైఫ్ అలీఖాన్ ఆస్తి ఎంతో తెలిస్తే మీకు దిమ్మదిరిగి కింద పడిపోవాల్సిందే.;
By : The Federal
Update: 2025-01-24 05:08 GMT
15వేల కోట్ల ఆస్తులా? డబ్బులా, చిల్లపెంకులా అనేగా మీ అనుమానం.. మీరు చదివింది కరెక్టే. కత్తిపోట్లకు గురై కోలుకుని ఇంటికొచ్చిన ప్రముఖ సినీనటుడు సైఫ్ అలీఖాన్ ఆస్తి ఎంతో తెలిస్తే మీకు దిమ్మదిరిగి కింద పడిపోవాల్సిందే. ప్రస్తుత అంచనా ప్రకారం సైఫ్ అలీఖాన్ సుమారు 15వేల కోట్లని తేల్చారు.
పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి రూ.15 వేల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడు వాటి యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(శత్రు ఆస్తి) పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు 2024 డిసెంబరు 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందో లేదో తెలియలేదు. ఒకవేళ ఆ ఉత్తర్వును సవాలు చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయంటున్నారు. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆస్తుల కోసమే కత్తిపోట్ల నాటకమని కొందరు, నిజంగానే కత్తిపోట్లు తగిలాయని ఇంకొందరు, సానుభూతి ప్రక్రియలో భాగంగానే ఆస్పత్రులు, చికిత్సలని మరికొందరు.. ఇలా నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా రెండు శిబిరాలుగా విడివడి సైఫ్ అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలీ వివాదం ఏమిటో, ఈ ఆస్తుల గొడవలేమిటో ఓసారి చూద్దాం.
అసలేమిటీ వివాదం, ఎక్కడివీ ఆస్తులు?
సైఫ్ అలీ కుటుంబానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ వారసత్వం ఆయనది. ఈ హమీదుల్లా సైఫ్ అలీఖాన్ కి ముత్తాత. ఆయనకు ఇద్దరు కుమార్తెలు- పెద్దామె అబీదా సుల్తాన్, రెండో ఆమె సాజిదా సుల్తాన్ . సాజిదా సైఫ్ అలీకి నాయనమ్మ. సాజిదా సుల్తాన్ పటౌడీ నవాబు అయిన ఇఫ్తికర్ అలీఖాన్ (సైఫ్ తాత)ను పెళ్లి చేసుకుంది. దేశ విభజన నేపథ్యంలో అబీదా పాకిస్థాన్‌కు 1950లో వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే ఉండిపోయారు. దీంతో హమీదుల్లా ఖాన్ కి చెందిన విలాసవంతమైన భవంతులు సాజిదాకు వారసత్వంగా వచ్చాయి.
సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్‌కు వలస వెళ్లినందున ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2014లో ప్రకటించింది.
దీన్ని సవాలు చేస్తూ సైఫ్ తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగోర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు వచ్చాయి. దీనిపై సైఫ్ అలీ కుటుంబం న్యాయపోరాటం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
సైఫ్ అలీ ఖాన్ శత్రు ఆస్తి కేసు
భోపాల్‌లోని పటౌడి కుటుంబ చారిత్రాత్మక ఆస్తుల విలువ సుమారు ₹15,000 కోట్లు. ఈ ఆస్తుల్ని "శత్రు ఆస్తి"గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుపై నటుడు సైఫ్ అలీ ఖాన్ అప్పీల్ అథారిటీని ఆశ్రయించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది.
ఈ వివాదాస్పద ఆస్తులలో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ఒకటి. అక్కడే సైఫ్ తన బాల్యం గడిపాడు. లగ్జరీ హోటల్ నూర్-ఉస్-సబా ప్యాలెస్, దర్-ఉస్-సలామ్, హబీబి బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్యాలెస్ లాంటి ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
కోర్టు 2015 నుంచి సైఫ్ పిటిషన్ ను విచారిస్తోంది. 2024 డిసెంబర్ 13న, "శత్రు ఆస్తుల పరస్పర వివాదాల పరిష్కారానికి అప్పీల్ అథారిటీ ఏర్పాటు అయింది" అని ప్రభుత్వం కోర్టుకు తెలియజేయడంతో, జస్టిస్ వివేక్ అగర్వాల్ ఇరు పక్షాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువులోగా కేంద్ర ప్రభుత్వం, సైఫ్ అలీఖాన్ పిటీషన్లను దాఖలు చేయాల్సి ఉంది. ఆ గడువు 2025 జనవరి 12తో ముగియనున్న నేపథ్యంలో జనవరి 16న దాడి జరిగింది. కత్తి దాడి నుంచి బయటపడి కోలుకుంటుండగా, జనవరి 12లోపు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారా లేదా అనేది తెలియరాలేదు.
మధ్యప్రదేశ్ హైకోర్టులోనే ఎందుకు?
1947లో భోపాల్ స్వతంత్ర రాష్ట్రం. దాన్ని నవాబ్ హమీదుల్లా ఖాన్ పాలించారు. ఆయనకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. రెండవ కుమార్తె సజీదా సుల్తాన్ భారత్‌లోనే ఉండిపోయారు. ఇంగ్లాండ్, భారత్ తరఫున క్రికెట్ ఆడిన నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడిని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు మాన్సూర్ అలీ ఖాన్ ‘టైగర్’ పటౌడి ప్రఖ్యాత క్రికెటర్.
సాజీదా సుల్తాన్ కుమారుడి కుమారుడు – టైగర్ పటౌడి కుమారుడు – సైఫ్ అలీ ఖాన్. భోపాల్‌లోని ఆస్తులలో తన వాటాను స్వీకరించారు. అయితే, అబిదా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల ప్రభుత్వం ఈ ఆస్తులను “శత్రు ఆస్తి”గా ప్రకటించింది. దాంతో వివాదం తెరపైకి వచ్చింది.
2014లో భోపాల్‌లోని పటౌడి కుటుంబ ఆస్తులను “శత్రు ఆస్తి”గా ప్రకటించింది. సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రకటనను సవాల్ చేశారు. 2016లో కేంద్రం మరో ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం వారసులకు ఈ ఆస్తులపై హక్కులు ఉండవని స్పష్టంగా పేర్కొంది.
శత్రు ఆస్తి అంటే ఏమిటి?
యుద్ధ సమయాల్లో “శత్రు దేశాలు”గా పరిగణించే దేశాలకు వలస వెళ్ళిన వ్యక్తులు- భారతదేశంలో విడిచిపెట్టిన చరాస్తి, స్థిరాస్తి.
1965, 1971లో భారతదేశం, పాకిస్థాన్ మధ్య, 1962లో చైనా-భారత యుద్ధాల తరువాత, పాకిస్థాన్ లేదా చైనా పౌరసత్వం స్వీకరించిన వారి ఆస్తులు, వ్యాపారాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
1962లో అమలులోకి వచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులను శత్రు ఆస్తి కస్టోడియన్ కి అప్పగించారు. అంటే ఈ ఆస్తులను భారత ప్రభుత్వం తరపున కస్టోడియన్ నిర్వహిస్తారు.
శత్రు ఆస్తిని వలస వెళ్లిన వారి వారసులు పొందగలరా?
1968నాటి శత్రు ఆస్తి చట్టం ప్రకారం, శత్రు ఆస్తిగా ప్రకటించిన ఆస్తులు శాశ్వతంగా -శత్రు ఆస్తి కస్టోడియన్- కి చెందుతాయి. వాటి వారసత్వ హక్కులు లేదా బదిలీకి ఎలాంటి అవకాశం ఉండదు.
ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల్లోని శత్రు ఆస్తులను నిర్వహించడానికి, నియంత్రించడానికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తోంది. 2017లో తీసుకువచ్చిన- శత్రు ఆస్తి (సవరణ, ధృవీకరణ) చట్టం మరింత పకడ్బందీగా ఉంది. “శత్రు సబ్జెక్ట్”, “శత్రు సంస్థ” నిర్వచనాన్ని విస్తరించారు. వారసులు, వారసుల వారసులు ఎవరైనప్పటికీ పౌరసత్వంతో సంబంధం లేకుండా వాళ్లందర్నీ ఈ జాబితాలో చేర్చారు.
శత్రు ఆస్తి ఏదైనా కస్టోడియన్ ఆధీనంలోనే ఉంటుంది. వారసుడు ఏ దేశ పౌరుడనే దాంతో నిమిత్తం లేకుండా ఇది వర్తిస్తుంది. ఈ సవరణలు వారసత్వ హక్కులను పూర్తిగా రద్దు చేసి, ఆ ఆస్తులు ప్రభుత్వం నియంత్రణలోనే శాశ్వతంగా ఉండేలా చేశాయి.
చట్టంపై విమర్శలు...
ఈ చట్టం వ్యక్తిగత ఆస్తి హక్కులను కాలరాస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతుంటే, జాతీయ భద్రత దృష్ట్యా ఇది అవసరమని అనుకూలురు వాదిస్తున్నారు.
శత్రు ఆస్తుల కేసులను కోర్టులు ఎలా నిర్వహించాయి?
ఈ సందర్భంలో ఉత్తర ప్రదేశ్‌లో మహ్మదాబాద్ రాజా ఆస్తుల వివాదం కేసు చెప్పుకోదగింది. హజ్రత్‌గంజ్ (లక్నో), సీతాపూర్, నైనిటాల్‌లలో విస్తృత ఆస్తులను కలిగిన రాజా 1957లో పాకిస్థాన్‌కు వలస వెళ్లి పాకిస్థానీ పౌరసత్వం పొందారు. అయితే ఆయన భార్య, కుమారుడు భారత్‌లో పౌరులుగా ఉన్నారు.
1968 చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, రాజా ఆస్తులను శత్రు ఆస్తిగా ప్రకటించారు. రాజా మరణం తర్వాత, ఆయన కుమారుడు మొహమ్మద్ ఆమిర్ మొహమ్మద్ ఖాన్ ఈ ప్రకటనను సవాల్ చేసి ఆస్తులపై హక్కు కోరారు. 2005లో సుప్రీం కోర్టు కుమారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు కారణంగా, అనేక మంది వ్యక్తులు, దూరమైన బంధువులు సహా, శత్రు ఆస్తులపై క్లెయిమ్‌లు చేయడం ప్రారంభించారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను నిర్వహించడంలో పెద్ద తలనొప్పిగా మారింది.
2016లో, శత్రు ఆస్తి (సవరణ, ధృవీకరణ) ఆర్డినెన్స్ను తీసుకురావడం జరిగింది. ఇది తర్వాత చట్టంగా మారింది. ఈ చట్టం గత కోర్టు తీర్పులను రద్దు చేసి, వారసత్వ హక్కుల ద్వారా లేదా శత్రు వ్యక్తి పౌరసత్వం మారినా ఆస్తులు కస్టోడియన్ ఆధీనంలోనే ఉండేలా స్పష్టతనిచ్చింది.
శత్రు ఆస్తి స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఏమవుతుంది?
2018 నాటి శత్రు ఆస్తి నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, భారత శత్రు ఆస్తి కస్టోడియన్ ఆధీనంలో ఉన్న ఆస్తులను విక్రయించే విధానాన్ని నిర్దేశించారు.
ఆస్తుల జాబితా, వాటి విలువతో కూడిన వివరాలు కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించిన సమయాల్లో సమర్పించబడతాయి. జిల్లా మేజిస్ట్రేట్‌లు, విలువ నిర్దారించే కమిటీలు, మార్కెట్ రేట్లు, ఇతర పరామితుల ఆధారంగా ఆస్తులను ఖరారు చేస్తారు. శత్రు ఆస్తి విక్రయ కమిటీ ఆస్తులను విక్రయించాలా, బదిలీ చేయాలా లేదా యథాస్థితిలో ఉంచాలా అనే అంశంపై సిఫారసులు చేస్తుంది.
ఖాళీగా ఉన్న ఆస్తుల్ని వేలం వేసి అత్యధిక బిడ్డర్‌కు అప్పగిస్తారు. ఆక్రమణలో ఉన్న ఆస్తులు, కమిటీ నిర్ణయించిన విలువ ఆధారంగా అక్కడున్న వారికి ఇస్తారు.
షేర్లు వంటి చరాస్తులను వేలం, టెండర్లు లేదా ఇతర అనుమతించిన పద్ధతుల ద్వారా విక్రయిస్తారు. లావాదేవీలు పూర్తయ్యాక, కస్టోడియన్ చట్టబద్ధతను నిర్ధారించి విక్రయ ధృవపత్రాలు జారీ చేస్తారు. ఈ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే డబ్బును భారత సమీకృత నిధిలో జమ చేస్తారు. ఎన్ని శత్రు ఆస్తులు ఉన్నాయి?
2018 జనవరి 2న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ లోక్‌సభలో చెప్పిన దాని ప్రకారం 9,280 శత్రు ఆస్తులు పాకిస్థాన్ పౌరులు విడిచిపెట్టారని, 126 ఆస్తులు చైనా పౌరులు విడిచిపెట్టారు.
2018 నవంబరులో, కేంద్ర క్యాబినెట్ 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన శత్రు షేర్ల విక్రయానికి ఆమోదం తెలిపింది.
2020లో, కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం 9,400కి పైగా శత్రు ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. ఈ ఆస్తుల విలువ సుమారు 1 లక్ష కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.
ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఎవరికి దక్కుతాయి, ఆయనకు వారసత్వంగా రావాల్సినవి వస్తాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.