డమాస్కస్ కు వంద కిలోమీటర్ల దూరంలో తిరుగుబాటుదారులు
సిరియాలో రెబెల్స్ తమ పట్టును పెంచుకుంటున్నారు. తాజాగా దారా ప్రావిన్సును తమ హస్తగతం చేసుకున్నారు. ఇది రాజధాని డమాస్కస్ కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే..
By : Praveen Chepyala
Update: 2024-12-07 10:12 GMT
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు మరో గండం ఎదురైంది. అతని పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు దేశంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ముందుకు సాగుతున్నారు. 2011 లో తిరుగుబాటు ప్రారంభమైన దారా ప్రాంతాన్ని ప్రస్తుత రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో సాగుతున్న అంతర్యుద్దం నాటకీయ పరిణామాలతో ముందుకు సాగుతోంది. దారా ప్రావిన్సులో ఉన్న ప్రజలు అసద్ పాలనకు వ్యతిరేకంగా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. వీరికి ప్రస్తుతం రెబెల్స్ తోడయ్యారు.
సిరియాలోని పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లకూడదని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్న భారతీయులు వెంటనే అందుబాటులో ఉన్న ఫ్లైట్ లు పట్టుకుని దేశం దాటాలని అర్థరాత్రి సూచనలు జారీ చేసింది.
రెబెల్స్ దాడులు ప్రారంభించిన వారం రోజులలోపే సిరియా ప్రభుత్వం ఆధీనంలో నుంచి నాలుగు ప్రధాన నగరాలు చేజారి పోయాయి.ప్రస్తుతం తిరుగుబాటు దారులు రాజధానికి ఉత్తరాన కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. దారా చేజారిన తరువాత సైనిక అధికారులు అక్కడి నుంచి క్రమబద్దంగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తిరుగుబాటు దారులు అంగీకరించారు.
అలెప్పో, హమా నగరాలు ఇటీవలి రోజుల్లో ప్రభుత్వ నియంత్రణ ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమికి చిక్కాయి, దారాను స్థానిక సాయుధ సమూహాలు స్వాధీనం చేసుకున్నాయని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సైతం తెలిపింది.
"దారా నగరంతో సహా దారా ప్రావిన్స్‌లోని మరిన్ని ప్రాంతాలను స్థానిక వర్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి... పాలనా బలగాలు వరుసగా వైదొలగడంతో ఇప్పుడు వారు ప్రావిన్స్‌లో 90 శాతానికి పైగా నియంత్రణ సాధించారు" అని బ్రిటన్‌కు చెందిన అబ్జర్వేటరీ నెట్‌వర్క్ తెలిపింది.
ఒకప్పుడు లక్ష కంటే ఎక్కువ మంది ప్రజలు నివసించిన దారా, అసద్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపింది. తిరుగుబాటుదారుల వేగం బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేసింది, వ్యూహాత్మక నగరం హోంస్‌తో సహా కీలక ప్రాంతాలపై దాని పట్టు పెరుగుతుండటంపై ప్రభుత్వ యంత్రాంగం కలవరపడుతోంది.
ప్రజాస్వామ్య నిరసనలపై అస్సాద్ అణిచివేతతో ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మంది ప్రజలు హతమయ్యారు. మరో 2.5 లక్షల మంది దేశం నుంచి విడిచిపెట్టారు.