రాహుల్ మరో సురక్షిత స్థానాన్ని వెతుక్కోవాల్సిందే: మోదీ
కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓడిపోతారని మోదీ పేర్కొన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓడిపోతారని, ఇకపై ఆయన మరో సురక్షిత స్థానం కోసం అన్వేషణ మొదలుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
బీజేపీ నాందేడ్, హింగోలి అభ్యర్థుల ప్రచారం కోసం మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ.. "అమేథీలో ఓడిపోయాక, కాంగ్రెస్ సహబ్జాదే (రాహుల్ గాంధీ) వాయనాడ్‌లో కూడా ఓడిపోతారు. ఏప్రిల్ 26 తర్వాత ఆయన మరో సురక్షిత స్థానాన్ని వెతుక్కోవాలి’’ అని మోడీ అన్నారు. సోనియా గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకనే కొందరు భారత కూటమి నేతలు లోక్‌సభను వదిలి రాజ్యసభకు వెళ్లారని అన్నారు.
రైతులు, పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ అడ్డపడుతోందన్న మోదీ కాంగ్రెస్ హయాంలోని దుష్పరిపాలనను చక్కదిద్దేందుకు తనకు పదేళ్లు సమయం పట్టిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. “వ్యవసాయ సంక్షోభం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ లోపభూయిష్ట విధానాల వల్ల అది జరిగింది” అని అన్నారు.
ఇండియా బ్లాక్‌నుద్దేశించి మాట్లాడుతూ..ప్రతిపక్ష కూటమిని తమ అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి కలిసి వచ్చిన స్వార్థపరుల గుంపుగా అభివర్ణించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన సిక్కుల గతి ఏమై ఉండేదని ప్రశ్నించారు.
మోడీ నేతృత్వంలోని NDA వరుసగా మూడోసారి బలమైన మెజారిటీని కోరుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.