నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి బరిలో దిగబోతున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ వేశారు. ఆయన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన సోదరి ప్రియాంక గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో సహా ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు రాహుల్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఉదయం హెలికాప్టర్‌లో వాయనాడ్‌కు చేరుకున్న రాహుల్, నామినేషన్ దాఖలుకు ముందు కలపేట నుంచి సివిల్ స్టేషన్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యలను దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.
కాగా బీజేపీ తరుపున రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, సీపీఐ నేత రాజా రాహుల్ గాంధీతో తలపడుతున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఓట్లు 10,92,197, రాహుల్ గాంధీ 7,06,367 ఓట్లతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, సిపిఐకి చెందిన పిపి సునీర్ కు కేవలం 2,74,597 ఓట్లు పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలకు కేరళలో ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది