AMBEDKAR ROW | అంబేడ్కర్ ని అమిత్ షా ఎందుకు అవమానించారు?
డాక్టర్ అంబేడ్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ I.N.D.I.A. కూటమి సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. విపక్షాలు అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి
By : The Federal
Update: 2024-12-19 06:12 GMT
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కేంద్రంగా పార్లమెంటులో వివాదం రాజుకుంది. డాక్టర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ I.N.D.I.A. కూటమి సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగగా అంబేడ్కర్ ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ సభ్యులు తిప్పికొట్టారు. దీంతో రెండు రోజులుగా పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోపక్క, బీజేపీయేతర పార్టీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
అసలింతకీ ఏమి జరిగిందంటే...
డిసెంబర్ 17 (మంగళవారం) రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయ దుమారం రేపాయి. రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని కాంగ్రెస్ ఆరోపించగా, ప్రతిపక్ష పార్టీలు తలాతోకా లేని వీడియో క్లిప్ లను సర్క్యులేట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది.
అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని, ఇందుకు బిఆర్ అంబేద్కర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ I.N.D.I.A. కూటమికి చెందిన పలువురు ఎంపీలు డిసెంబర్ 18న పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ఈ నిరసనను బీజేపీ పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేసింది.
కొందరు పదే పదే అంబేడ్కర్ పేరు జపిస్తున్నారు, దానికి బదులు ఏ దేవుడి పేరో తలిస్తే నేరుగా స్వర్గానికైనా పోతారని అమిత్ షా అన్నట్టు మీడియలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలు తాను అనలేదని, కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని అమిత్ షా డిసెంబర్ 18న రాజ్యసభలో చెప్పారు. తన ప్రసంగాన్ని ప్రతిపక్ష పార్టీ వక్రీకరించి ప్రదర్శిస్తోందని అన్నారు.
ఆ తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలోనూ అమిత్ షా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 150 ఏళ్ల రాజ్యాంగంపై పార్లమెంటులో జరిగిన చర్చ "బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎలా వ్యతిరేకిస్తుందో రుజువు చేసింది" అని అన్నారు.
‘‘నిన్నటి నుంచి కాంగ్రెస్ వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ అంబేద్కర్ వ్యతిరేకి. రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది. ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించింది. విలువల్ని తుంగలో తొక్కింది" అని అన్నారు అమిత్ షా. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ సమర్థించారు.
కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బట్టబయలు చేశారని, దీంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడుతోందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సాధికారత కోసం ఏమీ చేయలేదని మోదీ ఆరోపించారు.
"డాక్టర్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ అనేక పాపాలు చేసింది. పండిట్ నెహ్రూ అంబేడ్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేసింది. ఆయనకు భారతరత్న నిరాకరించింది" అని మోదీ ఆరోపించారు.
మల్లికార్జున్ ఖర్గే ప్రతివిమర్శ..
రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల నిజంగా గౌరవం ఉంటే ప్రధాని మోదీ ఈ పాటికే అమిత్ షాను బర్తరఫ్ చేసేవారని, దానికి బదులు కాంగ్రెస్ పై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
అమిత్ షా క్షమాపణ చెప్పకుండా కేబినెట్‌లో కొనసాగే హక్కు లేదన్నారు. ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు ప్రజలు మౌనంగా ఉండరని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, పూజించాల్సిన దళితుడిని అవమానించడం దురదృష్టకరమని ఖర్గే అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను ఖర్గే మరింత హైలైట్ చేస్తూ, "వారు స్నేహితులు, ఒకరి పాపాలకి మరొకరు మద్దతు ఇస్తారు" అని అన్నారు.
"అమిత్ షాను సమర్థించేందుకు ప్రధాని మోదీ 6-7 ట్వీట్లు చేశారు. దీని అవసరం ఏముంది? బీఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కేబినెట్ నుంచి తొలగించాలి. కానీ వారిద్దరూ స్నేహితులు, ఒకరి పాపాలకు మరొకరు మద్దతు ఇస్తున్నారు" అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.
అంబేడ్కర్ మనుమడు ఏమన్నారంటే..
బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కూడా రాజ్యాంగ పితామహుడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ అధ్యక్షులు విజయ్ (Vijay) గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేడ్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
సీపీఐ, సీపీఎం ఖండన...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కించపరుస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీపీఐ,సీపీఎం నాయకులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు ఖండించారు. "పదేపదే అంబేడ్కర్ పేరు ఎందుకుతలుస్తారు, అంబేడ్కర్ కి బదులు ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళతారు" అని వ్యాఖ్యానించడం దుర్మార్గం. అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కించపరుసతూ మాట్లాడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.