అమెరికాలో ఎవరు గెల్చినా మనోళ్లే సెకండ్ సిటిజన్, ఉషపై ఎందుకింత ఆసక్తీ?

అగ్రరాజ్యమైన అమెరికాలో ఏ పార్టీ గెలిచినా ఇండియన్ అమెరికనే సెకండ్ సిటిజన్. అటు కమలా హారిస్ అయినా ఇటు ఉషా చిలుకూరి భర్త వాన్స్ గెలిచినా మనమే వైట్ హౌస్ లో ఉంటాం..

Update: 2024-07-19 01:40 GMT

తరాల మార్పు, పార్టీ శ్రేణులలో పెరుగుతున్న వైవిధ్యానికి గుర్తు భారతీయ మూలాలున్న జంటల్ని అగ్రరాజ్యమైన అమెరికా రాజకీయ పార్టీల గుర్తింపు. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ డెమోక్రాట్లు కమలాహారిస్ ను వైస్ ప్రెసిడెంట్ గా చేయగా తాజాగా రిపబ్లికన్లు మరో భారతీయ మూలాలున్న మహిళను వివాహమాడిన ఒహాయో సెనేటర్ ను వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ చేశారు. అమెరికన్ అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది. ఆయన తన సెకండ్ ఇన్ కమాండ్ గా జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు ట్రంప్. వచ్చే నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎక్కువ మంది సెనేటర్లను గెలిస్తే అంటే 270 మంది గెలువగలిగితే అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్ కి దక్కుతుంది. జేడీవాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీ అవుతుంది. చిత్రమేమంటే అటు రిపబ్లికన్స్ గెలిచినా ఇటు డెమోక్రాట్లు విజయం సాధించినా ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి శ్వేత సౌధంలో కాలు మోపడం ఖాయం. కారణాలు ఏవైనా.. రెండు పార్టీల తరఫునా భారతీయ మూలాలతో అనుబంధం ఉన్న వారినే వైస్ ప్రెసిడెంట్లుగా ఎంచుకోవడం ముదావహం అంటున్నారు భారతీయులు ప్రత్యేకించి అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు.


కృష్ణా జిల్లా పామర్రు నుంచి..

ఉషా చిలుకూరి ఇండియన్ అమెరికన్. కాలిఫోర్నియాలో పుట్టారు. వయసు 38, ఒకప్పటి డెమొక్రాట్‌. కార్పొరేట్ లాయరు. తల్లిదండ్రులు తెలుగువాళ్లు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని సాయిపురం వాళ్ల ఊరు. హిందూ మతం. బ్రాహ్మణులు. 1980ల ప్రాంతంలో ఈ ఊరి నుంచి వలస వెళ్లారు. ఇప్పటికీ వాళ్ల పూర్వీకులు అటు విశాఖపట్నంలో ఇటు మచిలీపట్నంలో ఉన్నారు. అయితే వాళ్లకీ వీళ్లకీ పెద్దగా సంబంధాలు ఉన్నట్టు తెలియడం లేదు. ఉష పెళ్లికి హాజరైన ఆమె మేనత్త ఇప్పటికీ చెన్నైలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణది సాయి పురం. తల్లి లక్ష్మీది పామర్రు. వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి ఉష. వీళ్ల కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రొఫెసర్ విక్రమరావు కథనం ప్రకారం ఉష కుటుంబం చాలా సంప్రదాయక ఫ్యామిలీ. భక్తి ఎక్కువ.
ఉషా వివరాల కోసం ఆసక్తి...
ఉష కాలిఫోర్నియా వాసి అని తెలిసిన తర్వాత ఆమె గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు చాలా మంది తెలుగువాళ్లు ఆసక్తి చూపుతున్నారని కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రభాకరరావు చెప్పారు. ఉష తల్లిదండ్రుల్ని కలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేసినా వాళ్లు ప్రస్తుతం కాలిఫోర్నియాలో లేరని, ఓహాయో వెళ్లారేమోనన్నది ప్రభాకరరావు కథనం. నిజానికి కాలిఫోర్నియా రాష్ట్రంలో తెలుగువాళ్ల సంఖ్య ఎక్కువే. ఐటీ కంపెనీలలో చాలా మంది తెలుగువాళ్లు పని చేస్తున్నారు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కె.వెంకట్ చెప్పిన వివరాల ప్రకారం ఉషకు విశాఖపట్నంలో ఇప్పటికీ బంధువులున్నారు. కురువృద్ధురాలైన ప్రొఫెసర్ శాంతమ్మ ఉషకు జేజమ్మ అవుతుంది. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఆమె ప్రొఫెసర్ గా పని చేశారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ శాస్త్రి .ఆయన కూతురే ఈ ఉష. ప్రొఫెసర్ శాంతమ్మ చెప్పిన కథనం ప్రకారం ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. చెన్నైలో ఉష మేనత్త శారద ఉంటున్నారు. ఆమె డాక్టరు. వాన్స్- ఉషల పెళ్లికి ఈ శారద హాజరయ్యారు.
తెలుగింటమ్మాయని సంబరపడ్డా...

ఉష చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచని తెలిసి చాలా సంతోషమేసిందన్నారు ఫిలడెల్ఫియాలో ఉంటున్న మచిలీపట్నం వాసి ప్రసాద్ సమ్మెట. ఇప్పటికీ ఆమె కుటుంబీకులు చిలుకూరి రామ్మోహనరావు అక్కడే ఉంటున్నారు. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారని, సాయిపురంలో చిలుకూరి వారిది పెద్ద కుటుంబమన్నారు ప్రసాద్. ఉష ముత్తాత వీరావధాన్లు. ఆయనకు ఐదుగురు పిల్లలు. వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే స్థిరపడ్డారు. అందరూ విద్యావంతులే. వీరావధాన్లు పెద్ద కొడుకు రామశాస్త్రి. ఈయన మూడో కుమారుడు రాధాకృష్ణ. ఆయన కుమార్తె ఉషా. రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చేశారు. శాన్‌డియేగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఉష బంధువుల్లో ఒకరైన రామ్మోహన్ ఇప్పటికీ సాయిపురంలో
ఉంటున్నారని డల్లాస్ కి చెందిన సందీప్ ఎన్. హర్షం వ్యక్తం చేశారు. తొలితరంలో వచ్చిన వారిలో ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే స్థిరపడ్డారని, అటువంటి వారిలో వీరి కుటుంబం ఒకటై ఉంటుందన్నారు.
2019 నుంచే వైవిధ్యం ప్రారంభం..
అమెరికాకు వైస్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయడంలో రెండు ప్రధాన పార్టీలు వైవిధ్యం చూపించడం 2019 నుంచే ప్రారంభమైందన్నారు 18 ఏళ్ల కిందట టెక్సాస్ వచ్చి స్థిరపడిన అల్యూష్ వి. "తమిళనాడు మూలాలున్న కమలాహారిస్ ను డెమోక్రాట్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసినప్పుడే భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యత వెల్లడైంది. ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా అదే బాట పట్టారు. నిజానికి రిపబ్లికన్లలోనే ఇండియన్స్ ఎక్కువ" అంటున్నారు అల్యూష్. ఉషకు చాలా భిన్నమైన నేపథ్యం, మంచి భవిష్యత్ ఉందన్నారు ఆయన. ఉష తల్లిదండ్రులైన క్రిష్ ఎలియాస్ రాధాకృష్ణ, లక్ష్మి చిలుకూరి ఉంటున్న ప్రాంతం చాలామంది విద్యావేత్తలకు నిలయం. లక్ష్మి జీవశాస్త్రవేత్త. కళాశాల బయోటెక్నాలజీ విభాగం ప్రధాధిపతి (ప్రొవోస్ట్) వాళ్లుండే శాన్ డియాగోలో భారతీయ అమెరికన్ విద్యావేత్తలు ఎక్కువగా ఉంటారు. ఉష ఇటీవలి ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో "నేను రెలిజియస్ కుటుంబంలో పెరిగాను. నా తల్లిదండ్రులు హిందువులు. నేను చేసుకున్న వ్యక్తి హిస్పానియన్. క్రిస్టియన్ నేపథ్యం. వారిని మంచి తల్లిదండ్రులుగా చేసిన వాటిలో ఒకటి మతం" అన్నారు.
చిన్నప్పటి నుంచే ఉష ఆత్మవిశ్వాసంతో ఉండేదని, ఇన్ఫీరియారిటీ (ఆత్మన్యూనత) అంటే ఆమెకు తెలియదన్నారు సిలికాన్ వ్యాలీలో పనిచేసే కుటుంబ స్నేహితుడు విక్రమ్ రావు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. “ఐదు లేదా ఆరేళ్ల వయస్సులోనే ఆమె లీడర్ షిప్ పాత్ర పోషించింది. ఆమె భవిష్యత్ కు ఆమే బాటలు వేసుకుంది. ఏ తరహా ప్రణాళిక ఉండాలో, అందుకు తానేమి చేయాలో ఉషకు బాగా తెలుసు. ఆమె ఎప్పుడూ పైమెట్టు మీదే ఉందే తప్ప కింద ఎప్పుడూ లేదు" అన్నారు.
పుస్తకాల పురుగు ఉష...

అదే టైమ్స్ కథనం ప్రకారం ఆమె పుస్తకాల పురుగు. 2007, 2010 మధ్య కాలంలో ఉష 65 పుస్తకాలను చదివినట్టు పోస్ట్ చేశారు. ఇందులో జాడీ స్మిత్, జోనాథన్ సఫ్రాన్ ఫోయర్, వ్లాదిమిర్ నబోకోవ్ నవలలు, నినా బర్లీ, నికోలస్ క్రిస్టోఫ్ రాసిన నాన్ ఫిక్షన్ కూడా ఉన్నాయి. యేల్ లా స్కూల్‌లో JD వాన్స్‌ను కలిసిన తర్వాత వారిద్దరూ కలిసి "అమెరికాలో శ్వేత జాతీయుల సామాజిక క్షీణత" అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు. దాని పర్యావసానమే జేడీ వాన్స్ రాసిన పుస్తకం హిల్‌బిల్లీ ఎలిజీ. అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఇదొకటి. ఆమె గురించి ఆమె భర్త జేడీ వాన్స్ చాలా అసాధారణంగానే పొగిడారు. తన జీవితాన్ని మార్చిన "యేల్ స్పిరిట్ గైడ్" అంటారు జేడీ వాన్స్. "నేను అడగడానికి కూడా తెలియని ప్రశ్నలను ఆమె చాలా మామూలుగా అర్థం చేసుకునేది. అటువంటివి ఉనికిలో ఉంటాయని నాకు తెలియదు. కాని ఆమె ఉహించేది. వెతకమని చెప్పేది" అంటూ తను రాసుకొచ్చారు. ఉష కూడా అదేస్థాయిలో వాన్స్ ను పొగిడారు. “మొదట్లో మేము స్నేహితులం. తర్వాతే ప్రేమికులం. ఏదైనా చేపడితే మనసు పెట్టి సాధిస్తాడని, శ్రద్ధగలవాడని నేను ఇష్టపడ్డా. ఉదయం 9 గంటలకు అపాయింట్‌మెంట్‌ అనుకుంటే కచ్చితంగా ఆ టైమ్ కి అక్కడ ఉండేవాడు అంటుంది ఉష. ట్రంప్ తోపాటు పోటీ పడిన మరో ఇండియన్ అమెరికన్, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి యేల్ యూనివర్శిటీలో ఈ జంట క్లాస్ మెట్. చిత్రంగా ఈజంటకు పుట్టిన రెండో కొడుకు పేరు కూడా వివేక్ కావడం యాధృశ్చికం.

ఆమె ఏ కోటాలోనో రాలేదు...
ఇండియాలో మాదిరి అమెరికన్ పాలిటిక్స్ లో కోటాలు ఉండవు. అంతమాత్రాన అమెరికాలో మహిళలకేదో పెద్ద పీట వేశారని కాదు గాని ఎటువంటి కోటాలు, నిర్ణయాత్మక శక్తిసామర్థ్యాలు లేని ఓ వలస సముహాన్ని గుర్తించడమే ఇక్కడ ప్రధానమైన అంశం అన్నారు రాజా మామిడి. భారతీయ-అమెరికన్లు గత 40,50 ఏళ్లలో సముచిత స్థానాన్నే సాధించారంటున్నారు ఆయన. అమెరికన్ లైఫ్ స్టైల్ వేరు, ఇండియాది వేరు. ఇక్కడ విజయం సాధించిన వారందరూ పూర్తిగా వారి స్వశక్తితో పైకి వచ్చిన వారే. కమలా హారిస్, వివేక్ రామస్వామి, నికీ హేలీ మొదలు ప్రస్తుత ఉషా వరకు అందరూ ఎంతో కష్టపడి జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా ఎదిగిన వారే. ఇవాళ వాళ్ల రక్తంలో ఉన్నది అమెరికా. ఒక ఇండియన్ అమెరికన్ గా మారడానికి ఇంత కాలం పట్టింది. వైట్ ప్రివిలైజ్ అనే దానికి భిన్నంగా ఇండియన్ అమెరికన్లు ఎదుగుతున్నారు. ఆ వరుసలో ఉషా చిలుకూరి నిలబడినందుకు ఓ తెలుగువాడిగా సంతోషంగా ఉంది అన్నారు రాజా మామిడి.
దేశ జనాభాలో భారతీయులు కేవలం 1.5% లోపే ఉన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ఇద్దరు భారతీయ అమెరికన్లు- నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీ పడ్డారు. భారతీయ మూలాలున్న తల్లి ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి పోటీ పడబోతున్నారంటే అందుకు కారణం ఆ దేశంలోని వైవిధ్యం, రాజ్యాంగమే కారణమన్నారు గుంటూరుకు చెందిన రత్నబాబు. ఏ. అమెరికాలో మిడిల్ మిడిల్ క్లాస్ గా ఉన్న భారతీయ అమెరికన్లు కళాశాల డిగ్రీల వ్యవహారంలో పోటీ పడుతున్నారు. తక్కువ విడాకుల రేట్లు కలిగి ఉన్నారు. మంచి వ్యాపార వేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రతి 20 మంది వైద్యుల్లో ఒకరు ఇండియన్లుగా ఉండడం సంతోషం అంటున్నారు రత్న. సుమారు 2.7 మిలియన్ల భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్న అమెరికాలో భారతీయ మూలాలున్న ఓ వ్యక్తి రెండో పౌరునిగా నిలవబోవడం ముదావహం అంటున్నారు తెలుగువాళ్లు.

జేడీ వాన్స్, ఉష వివాహం 2014లో కెంటుకీలో జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ఆరేళ్ల ఇవాన్, నాలుగేళ్ల వివేక్, రెండేళ్ల కుమార్తె మిరాబెల్. రిపబ్లికన్ల జాతీయ సదస్సు ప్రస్తుతం జరుగుతోంది. అందులో మాట్లాడిన ఇల్లినాయిస్‌ రాష్ట్ర వాసి వర్జీనియా జెమెల్.. “వ్యక్తి చర్మం రంగు, జాతిని రిపబ్లికన్లు చూడరు. ఆ వ్యక్తి పాత్ర, వారు దేని కోసం నిలబడతారనేదే ప్రధానం. ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్, ఆయన భార్య, వారి కుటుంబాన్ని ఎంపిక చేయడం అమెరికాని ఓ బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఓ సందేశంగా ఉంటుంది" అన్నారు. ఇండియన్ అమెరికన్ల ఎంపికపై పోల్‌స్టర్, రచయిత జాన్ జోగ్బీ ఏమంటారంటే.. "అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతోంది. వారు అత్యధిక ప్రజాస్వామ్యవాదులు. భారతీయ మూలాలున్న మహిళకు భర్తగా ఉన్న వాన్స్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసి ఓ జాతికి గుర్తింపు ఇచ్చారు. ఆమె తెలివైన మహిళ. ఓటర్లను కదిలించే శక్తి ఉంది. ఎన్నికలలో ఓ ఉరుములాంటి వ్యక్తి" అని అభివర్ణించడమ ఉషకి ఉన్న ప్రతిభా పాటవాలకు గుర్తింపు అని చెప్పవచ్చు.


Tags:    

Similar News