‘అక్కడ భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చలుండవు’

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం ఇస్లామాబాద్‌లో జరగనుంది. ఈ నె 15,16 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు.

Update: 2024-10-05 11:21 GMT

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ)వార్షిక సమావేశం ఇస్లామాబాద్‌లో జరగనుంది. అక్టోబర్‌ 15,16 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. అయితే ఆ దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. "బహుళ పక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నా. భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి చర్చించడానికి కాదు" అని చెప్పారు. 2015 తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

అలాగే సౌత్‌ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్‌ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC)లో ఎలాంటి పురోగతి లేకపోవడం గురించి మాట్లాడుతూ. ‘‘ చిన్న చిన్న కారణాల వల్ల సార్క్ సమావేశాలు జరగడం లేదు. సార్క్‌లోని ఒక సభ్యదేశం.. ఆ గ్రూప్‌నకే చెందిన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది’’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ దేశం చర్యల వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని.. అయితే పూర్తిగా ప్రాంతీయ కార్యకలాపాలు నిలిచిపోయాయని అర్థం చేసుకోకూడదని వెల్లడించారు.

ఈసారి ఎస్‌సీవో సదస్సుకు ఆతిథ్యమిస్తోన్న పాకిస్థాన్‌ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందినట్లు ఆగస్టు 30న కేంద్రం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్‌సీఓ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు.

షాంఘైలో 2001లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఎస్‌సీవో (SCO) ఏర్పాటైంది. తొలుత ఇందులో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్‌, తజికిస్థాన్, ఉబ్జెకిస్థాన్‌లు ఉండగా.. 2017లో భారత్‌, పాకిస్థాన్‌లు శాశ్వత సభ్యత్వం పొందాయి. గతేడాది భారత్‌ ఆతిథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సు సందర్భంగా ఇరాన్‌ శాశ్వత సభ్య దేశంగా చేరింది. 

Tags:    

Similar News