పెరుగుతున్న మృతులు.. కేరళలో కొండచరియల భీభత్సం
మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపుగా..
By : Praveen Chepyala
Update: 2024-07-30 05:33 GMT
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో కేరళ అతలాకుతలమైంది. ముఖ్యంగా వాయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వలన చాలా గ్రామాలపై నేరుగా ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 31 మృతదేహాలను వెలికి తీశారు. ఎక్కడిక్కడ నేలకొరిగిన భారీ వృక్షాలు, పైకి ఉబ్బిన నీటి వనరులతో ఈ ప్రాంతం భీభత్సంగా మారింది. ప్రకృతి అందాలతో సుందరంగా పేరుపొందిన గ్రామాలు ఇప్పుడు మాత్రం శవాల దిబ్బగా మారాయి. వాయనాడ్ లోని ముండక్కై, చూరల్‌మల, అట్టమల, నూల్‌పుజా ప్రాంతాలకు ఇప్పుడు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.
వరద నీటిలో కొట్టుకుపోయిన వాహానాలు అక్కడక్కడ చెట్లకొమ్మలకు చిక్కుకుని కనిపిస్తున్నాయి. నీరు పైకి ఉబికిరావడంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాడానికి ఆటంకంగా మారింది. పైకి ఉబ్బిన నీరు మొత్తం జనావాస ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా విధ్వంసం తీవ్రత పెరిగింది. కొండలపై నుంచి భారీ స్థాయిలో రాళ్లు పడడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో దాదాపు 500 మంది చిక్కుకునిపోయారు. గాయపడిన క్షతగాత్రులను సహాయక సిబ్బంది అంబులెన్స్ లలో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పెద్దఎత్తున చెట్లు నేలకొరిగాయి, వరద నీరు పచ్చని పంటలను తుడిచిపెట్టడంతో ప్రభావిత గ్రామాలు చాలా చోట్ల ఎడారిని తలపిస్తున్నాయి.
ఇప్పటివరకూ మరణించిన వారిలో, జిల్లాలోని చూరల్‌మల పట్టణంలో ఒక చిన్నారితో సహా నలుగురు వ్యక్తులను గుర్తించినట్లు అలాగే నేపాల్‌కు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఒక చిన్నారి తొండర్‌నాడ్ గ్రామంలో మరణించినట్లు అధికారులు ప్రకటించారు.