అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రజ్వల్, ఆయన తల్లి దరఖాస్తు

లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్నాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

By :  Admin
Update: 2024-05-29 13:14 GMT

లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జేడీ (ఎస్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం బెంగళూరులోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. లైంగిక దాడులకు సంబంధించి ఆయనపై పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనుమడైన ప్రజ్వల్ ఇటీవలే జేడీ (ఎస్) పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అత్యాచారం కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మే 29న (బుధవారం) బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రజ్వల్ మే 31న బెంగళూరు వస్తారని తెలుస్తోంది.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రజ్వల్ మే 30న మ్యూనిచ్ నుంచి బెంగుళూరుకు రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. మే 31వ తేదీ తెల్లవారుజామున బెంగళూరు వస్తారని భావిస్తున్నారు.
ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టులో ఆయన తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ దరఖాస్తు పిటిషన్ ను దాఖలు చేశారు.
జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్. 47 ఏళ్ల మహిళపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో నిందితునిగా ఉన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఏప్రిల్ 27న జర్మనీలోని మ్యూనిచ్ కి వెళ్లినట్లు సమచారం. కర్నాటకలోని హసన్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు ముగిసిన మర్నాడు జర్మనీకి పరారయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సిట్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు ప్రతినిధుల ప్రత్యేక కోర్టు మే 18న ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదే సందర్భంలో ఓ మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేసింది.
మే 31న ప్రజ్వల్ వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు అందరి చూపూ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై పడింది. ఆయన దిగిన వెంటనే సిట్ అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇదిలావుండగా, ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త హెచ్ డీ రేవణ్ణ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తనను కూడా అరెస్ట్ చేయవచ్చుననే భయంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిట్ వాదించింది. మందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని సిట్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇదే కేసులో హెచ్ డీ రేవణ్ణకు జారీ చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరింది.
భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ ఆర్డర్ పై ప్రత్యేక కోర్టు తన తీర్పును మే 31వ తేదీకి రిజర్వ్ చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.


Tags:    

Similar News