బంగ్లాదేశ్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్‌ మండిపాటు

‘భారతదేశంతో ఎలాంటి సంబంధం కొనసాగించాలనుకుంటుందో నిర్ణయించుకోండి’- భారత విదేశాంగ మంత్రి;

Update: 2025-02-25 09:11 GMT

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ (S Jaishankar)బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ గురించి "అసంబద్ధ ఆరోపణలు" చేయడం సరికాదని హెచ్చరించారు. “ప్రతి రోజు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఇండియానే అన్నింటికీ కారణమని నోరుజారుతున్నారు. వారి మాటలు పూర్తి అసంబద్ధంగా ఉంటున్నాయి. మేం మీతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటుం. మీ వైఖరి ఏమిటో చెప్పాలి,” అని జైశంకర్‌ న్యూఢిల్లీలోని ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇటీవలే జైశంకర్‌ ఒమాన్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ మంత్రి తౌహిద్ హసన్‌తో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ బంగ్లాదేశ్‌తో ప్రత్యేక సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ..ఆ దేశం తమ సంబంధాన్ని ఏ రూపంలో కొనసాగించాలనుకుంటుందో స్పష్టత ఇచ్చుకోవాలని జైశంకర్‌ కోరారు. 1971లో భారత సైన్యం అప్పటి తూర్పు పాకిస్తాన్‌ను పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్) నుంచి విముక్తి చేయడంలో సహకరించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో రెండు ముఖ్యమైన అంశాలను జైశంకర్ వివరించారు. మొదటి అంశంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న మతకలహాల దాడులను ప్రస్తావించారు. ఈ పరిస్థితి భారతదేశానికి ఆందోళన కలిగించే అంశమని, ఇది తమ ఆలోచనాపద్ధతిపై ప్రభావం చూపుతోందని, అందుకే భారత్ దీనిపై స్పందించాల్సి వచ్చిందని చెప్పారు.


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వం అక్కడ పాలన సాగిస్తోంది. ఈనేపథ్యంలో సామాజిక మాధ్యమం వేదికగా షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చారిత్రక నివాసానికి కొందరు నిప్పంటించడంతో పాటు అవామీ లీగ్‌ పార్టీ నేతల ఇళ్లపైనా దాడులు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె తాత్కాలిక ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వీటిని ఢాకా అధికారులు ఖండిస్తూ.. ఆమె చేస్తున్న తప్పుడు ప్రకటనలను నిరోధించాలని అక్కడి భారత తాత్కాలిక హైకమిషనర్‌ను కోరారు.

Tags:    

Similar News