రాహుల్ సీట్ల బేరాల కోసమే పాట్నాకు వస్తున్నారా?
మూడు నెలల్లో మూడో సారి పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత;
By : Praveen Chepyala
Update: 2025-04-10 11:58 GMT
ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్షనేత వరసగా అక్కడ పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ నేతృత్వంలో ‘‘పలాయన్ రోకో, నౌక్రీ దో’’ అనే పాదయాత్ర బెగుసరాయ్ లో చేస్తున్నారు.
ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తోంది. ‘ది ఫెడరల్’ నిర్వహించే ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో బీహార్ లో కాంగ్రెస్ పార్టీ అంశం, రాహుల్ గాంధీపై వ్యాఖ్యాత నీలు వ్యాస్ తో కలిసి, రాజకీయ విశ్లేషకులు సతీష్ కే. సింగ్, అశోక్ మిశ్రా చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బీహర్ లో ఫుంజుకుంటుందా? ఆర్జేడీతో కుదిరే కూటమిలో ఎక్కువ సీట్ల కోసం బేరసారాలు చేయడం లక్ష్యంగా ఉందా అని విశ్లేషించారు.
తాజాగా బెగుసరాయ్ ప్రాంతంలో జరుగుతున్న పాదయాత్రకు ఆయన స్వయంగా విచ్చేశారు. గాంధీ గత మూడు నెలల్లో ఆయన మూడోసారి బీహార్ కు వచ్చాడు. ఇది రాజకీయ సంకేతమే అని ప్యానెల్ అభిప్రాయపడింది.
రాహుల్ ఉనికి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగిందని, అలాగే ఆర్జేడీతో సీట్ల పంపకాల ఒప్పందాల విషయంలో కీలకపాత్ర పోషించడానికి ఈ రాజకీయ ఎత్తు వేసినట్లు స్పష్టమవుతుందని సింగ్ అభిప్రాయపడ్డారు.
‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి కేవలం 19 స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడూ ముఖ్యమైనది సీట్ల సంఖ్య కాదు. గెలుపు గుర్రాలు, సామర్థ్యం మాత్రమే’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచిన సీట్ల ఆధారంగా మాత్రమే పొత్తులను కుదుర్చుకోవాలని సింగ్ సూచించారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ మాత్రం అవసరమైన దూకుడుగా రాజకీయాలు చేయడం లేదని, ఎన్డీఏకి కళ్లెం వేయడంలో వరుసగా విఫలం అవుతున్నారని ఆయన విమర్శించారు.
కులం బలం..
బెగుసరాయ్ యాత్రలో కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆయన కొనసాగారు. అయితే యువత మాత్రం గణనీయ స్థాయిలో అక్కడికి వచ్చారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు అయిన అగ్రకులాలు, దళితులు, ముస్లింలతో తిరిగి కనెక్ట్ అయ్యే ప్రయత్నంగా ఈ ప్రచారం ఉందని ప్యానెల్ లోని వారు విశ్లేషించారు.
‘‘పొగొట్టుకున్న పట్టును తిరిగి పొందే లక్ష్యంతో దళిత నాయకుడు రాజేశ్ రామ్ ను బిహార్ కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. కానీ అగ్ర కులాలు ఇప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ తో జతకట్టే పార్టీకి ఓటు వేయడానికి వెనుకాడుతున్నాయి.’’ అని మిశ్రా అన్నారు.
కాంగ్రెస్ తన పాత పునాదిని పునరుద్దరించడంలో, విశ్వసనీయతను తిరిగి నెలకొల్పడంలో కఠినమైన సవాల్ ఎదుర్కొంటుందని సింగ్ అన్నారు.
ముస్లిం ఓటర్లు ప్రస్తుతం కాంగ్రెస్, ఆర్జేడీతో ఎక్కువగా పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీ ఓటర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కూటమిని విచ్చిన్నం చేసే అవకాశం ఉందని మిశ్రా హెచ్చరించారు.
సీట్ల పొత్తు.. గెలుపు సాధ్యం..
కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్ల కోసం బేరాలు చేయడం కంటే గెలవగల సీట్లకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇద్దరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చారిత్రాత్మక సీట్ల పంపకాల విధానాన్ని మిశ్రా వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కు అనేకసార్లు తనకు కష్టంగా ఉన్నసీట్లు లేదా బీజేపీకి ఎక్కువ బలం ఉన్న సీట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘ఈ సారి రాహుల్ గాంధీ కుల గణాంకాలు, అట్టడుగు వర్గాల బలాల ఆధారంగా సీట్లను అడగాలి’’ అని ఆయన చెప్పారు. తూర్పు, దక్షిణ బీహర్ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు పొందాలన్నారు.
అయితే కాంగ్రెస్ తన దీర్ఘకాలిక లక్ష్యాలను పరిశీలిస్తే ఆందోళనగా ఉందని సింగ్ పేర్కొన్నారు. ‘‘వారు(కాంగ్రెస్) ఆర్జేడీకి బలమైన మిత్రపక్షంగా ఉండాలని మాత్రమే చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున ఎందుకు సమీకరణం చేస్తారు? వారు ఇక్కడ ఒంటరిగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది బీహర్ లో కఠినమైన ప్రారంభ స్థానం’’ అని ఆయన అన్నారు.
బేరసారాలా.. పునర్నిర్మాణామా?
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత క్రియాశీలకంగా వ్యవహరించడం అంటే పాదయాత్రలు, సమ్మేళనాలు, యువత కేంద్రంగా రాజకీయాలు చేయడం చూస్తుంటే కూటమిలో తానే పెద్దన్నగా వ్యవహరించడం లేదా సింగిల్ గా నిలబడటానికి ప్రయత్నామా? అనే సందేహాన్ని వ్యాస్ లేవనెత్తారు.
ఇది కేవలం బీహార్ కు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రస్తుతం ఈ వ్యూహం పనిచేయదని, అయితే దీర్ఘకాలిక వ్యూహాలకు పనికి వస్తుందని అన్నారు. ఈ ప్రయత్నానికి బీహార్ ను లాంచ్ ప్యాడ్ అవడం శుభపరిణామం అన్నారు.
పార్టీ తన గత తప్పులను అంగీకరించడం ప్రారంభించిందని, ముఖ్యంగా 1990 లలో సామాజిక న్యాయాన్ని పార్టీ విస్మరించిందని అన్నారు. ఆ వైఫల్యాల నుంచి ఇప్పుడు ఓబీసీ, ఎంబీసీ, దళితులు, ముస్లింలపై దృష్టి సారించడం ద్వారా తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
తేజస్వీ వర్సెస్ రాహుల్..
రాహుల్ దృఢమైన ప్రచారం ఆర్జేడీ నాయకత్వంలో ముఖ్యంగా తేజస్వీ యాదవ్ లో ఏదైన అభద్రతభావం సృష్టించడం గలదా? అనే ప్రశ్నను కూడా ప్యానెల్ లెవనెత్తింది. అయితే సింగ్ దీనిని తోసిపుచ్చారు. అలాంటి విశ్లేషణ కేవలం ఎన్డీఏ మాత్రం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ పెరుగుదల ప్రశాంత్ కిషోర్ తటస్థీకరించడం ద్వారా మహా ఘట్ బంధన్ ఓట్లను ఏకీకృతం చేయడంలో సాయపడుతుందని ఆయన వాదించారు.
ప్రస్తుతం కన్హయ్యకుమార్ చేస్తున్న పాదయాత్ర ద్వారా నేరుగా సీట్లు గెలవకపోవచ్చని, కానీ అది ప్రశాంత్ కిషోర్ బలాన్ని వీక్ చేస్తుందని ఈ అంశం మాత్రమే బీహార్ లో ప్రతిపక్ష ఫ్రంట్ ను బలోపేతం చేయగలదు’’ అని సింగ్ అన్నారు.