రష్యా- చైనా నేవీల సంయుక్త విన్యాసాలు.. ఆ దేశానికి హెచ్చరికగానేనా?

నాటో కూటమి దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో వాటికి ధీటుగా రష్యా- చైనా నేవీలు పసిఫిక్ మహా సముద్రంలో సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాయి.

Update: 2024-07-15 12:20 GMT

నాటో సదస్సులో చైనాను ఉద్దేశించి ‘నిర్ణయాత్మక ఎనేబుల్’ అని వ్యాఖ్య వెలువడిన కొన్ని రోజుల్లోనే బీజింగ్- మాస్కో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. రెండు దేశాలు కలిసి డ్రిల్స్ ను ప్రారంభించాయని చైనా అధికారిక సంస్థ జిన్హువా నివేదించింది.

చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో.. రెండు వైపుల బలగాలు ఇటీవల పశ్చిమ - ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో గస్తీ చేశాయని ఈ ఆపరేషన్‌కు అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులతో సంబంధం లేదని, ఏ మూడవ పక్షాన్ని లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది.
ఆదివారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ప్రారంభమైన ఈ సైనిక డ్రిల్ జూలై మధ్య వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. మా దేశాలకు ఎదురవుతున్న బెదిరింపులను పరిష్కరించడం, ప్రపంచ వ్యాప్తంగా అలాగే ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలో నావికా దళాల సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాయని సీసీటీవీ నివేదించింది. ఇందులో క్షిపణి ప్రయోగాలు, సముద్ర దాడులు, వైమానిక రక్షణ ఉపకరణాలను పరీక్షించినట్లు వార్తలను ప్రసారం చేసింది.
ఝాన్‌జియాంగ్ నగరంలో ప్రారంభోత్సవం తర్వాత చైనా - రష్యా నావికా దళాలు ఆన్-మ్యాప్ మిలిటరీ సిమ్యులేషన్, వ్యూహాత్మక సమన్వయ డ్రిల్స్ నిర్వహించినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. నాటో దేశాలు చైనాను ఉక్రెయిన్ యుద్ధం విషయంలో టార్గెట్ చేయడంతో ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిగినట్లు తెలుస్తోంది.
నాటో వార్షిక శిఖరాగ్ర సమావేశం వాష్టింగ్టన్ కేంద్రంగా జరిగింది. ఈ సమావేశంలో కూటమి దేశాలు ఉక్రెయిన్ యుద్ధంలో తమ సాయాన్ని పెంచాలని తీర్మానించాయి. అనంతరం 32 సభ్య దేశాలన్నీ కూడా కఠినమైన పదాలతో చైనాను హెచ్చరించాయి.
రష్యాకు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేయడం వల్ల సైనిక కూటమిలకు కేంద్రం మారిందని హెచ్చరించారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చైనా నుంచే ఎక్కువగా భద్రతా సమస్యలు వస్తున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చైనా సైతం ఘాటుగానే స్పందించింది. ఆసియాకు నాటోనే గందరగోళంగా మారిందని ఆక్షేపించింది. నాటో తన ఖర్చుతో పక్క దేశాలకు భద్రత కోసం పరితపిస్తుందని ఎత్తి పొడిచింది. ఉక్రెయిన్ యుద్ద విషయంలో చైనా న్యాయమైన పక్షాన్ని కలిగి ఉందని తనను తాను సమర్ధించుకుంది.
కొన్ని రోజుల క్రితం చైనా నౌకలు అలస్కా తీరంలో కనిపించాయి. ఇవన్నీ కూడా అమెరికా ప్రత్యేక జోన్ లో కనిపించడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్జాతీయ నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు తైవాన్ విషయంలోనే అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు  కొనసాగుతున్నాయి. 
Tags:    

Similar News