పాకిస్తాన్ లో 23 మంది ఊచకోత.. ప్రయాణీకులను టార్గెట్ చేసిన మిలిటెంట్లు

నిత్యం అశాంతితో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరొసారి చెలరేగిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఓ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను..

By :  491
Update: 2024-08-26 07:43 GMT

కొన్నాళ్లుగా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సు ప్రజలు, చైనీయులు లక్ష్యంగా తీవ్రంగా దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి బస్సులో వెళ్తున్న 23 మంది ప్రయాణీకులను దింపి వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేసి మరీ కాల్చి చంపారు. ఈ ఘటన బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో చోటుచేసుకుంది.

అసిస్టెంట్ కమిషనర్ ముసాఖైల్ నజీబ్ కాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ముసాఖేల్‌లోని రరాషమ్ జిల్లాలో ప్రాంతీయ రహదారిలో ఆయుధాలు అడ్డం పెట్టుకుని ప్రయాణికులను బస్సుల నుంచి దింపారని డాన్ వార్తాపత్రిక నివేదించింది. మృతులు పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
వాహనాలను తగులబెట్టారు
ప్రయాణీకులను దింపి కాల్చి చంపిన తరువాత సాయుధులు 10 వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాద ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మిలిటెంట్ల ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆయన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
"ఉగ్రవాదులు, వారి సహాయకులు ఇక మా నుంచి నుంచి తప్పించుకోలేరు," అని అతను హెచ్చరించారు. బలూచిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను వేటాడి తగిన సమాధానం చెబుతుందని అన్నారు.
పంజాబ్‌కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇదే విధమైన దాడి నాలుగు నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ముసాఖేల్ లో మారణకాండ జరిగింది. ఏప్రిల్‌లో, నోష్కి సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుంచి దింపారు. ముష్కరులు వారి ID కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు.
పంజాబీలే లక్ష్యం..
గతేడాది అక్టోబర్‌లో బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలోని టర్బత్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఇవన్నీ టార్గెటేడ్ హత్యలు అని పోలీసులు తెలిపారు. బాధితులందరూ దక్షిణ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు.
2015లో తుర్బాత్ సమీపంలోని కార్మికుల శిబిరంపై తెల్లవారుజామున జరిగిన దాడిలో ముష్కరులు 20 మంది నిర్మాణ కార్మికులను చంపారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.


Tags:    

Similar News