బీహార్ బుద్ధ గయ ఆలయం కింద భారీ పురావస్తు సంపద

గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన నాలుగు పవిత్ర ప్రదేశాలలో మహాబోధి ఆలయ సముదాయం ఒకటి. బుద్ధుడు ఇక్కడే జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

By :  Admin
Update: 2024-07-13 10:56 GMT

బీహార్‌ రాష్ట్రం బోధ గయలోని మహాబోధి ఆలయం కింద, పరిసరాలలో  "భారీ పురావస్తు సంపద" నిక్షిప్తమై ఉందని అధికారులు చెబుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ సహకారంతో బీహార్ హెరిటేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ చేపట్టిన శటిలైట్ ఫోటోల,భూసర్వే నివేదికల   అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన నాలుగు పవిత్ర ప్రదేశాలలో మహాబోధి ఆలయ సముదాయం ఒకటి. బుద్ధుడు ఇక్కడే జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

ప్రస్తుత మహాబోధి ఆలయ సముదాయంలో 50 మీటర్ల ఎత్తైన ఆలయం, వజ్రాసనం, పవిత్ర బోధి వృక్షం, అనేక పురాతన స్థూపాలు ఉన్నాయి.

అధ్యయన సభ్యుల్లో ఒకరైన బెంగుళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఫ్యాకల్టీ మెంబర్ ఎంబి రజనీ.. మహాబోధి ఆలయం, దాని పరిసరాల ఉపగ్రహ చిత్రాలను లోతుగా అధ్యయనం చేశారు.

"ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలించాక రెండు కేంద్రీకృత చతురస్రాలను గుర్తించాం. బయటిది 4.9 ఎకరాలు, రెండోది లోపల 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ రెండు చతురస్రాల మధ్య దాదాపు 15 మీటర్లు ఖాళీ ప్రదేశం ఉంది. బయటి చతురస్రం దక్షిణ సరిహద్దు.. మహాబోధి ఆలయ సముదాయం గోడ నుండి సుమారు 300 అడుగుల దూరంలో ఉంది" అని రజనీ తన నివేదికలో పేర్కొంది.

బీహార్ హెరిటేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజోయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. తమ తాజా అధ్యయనంలో ఆలయ ప్రాంగణం ఉత్తరాన, చుట్టూ ఉన్న కందకంతో గోడతో కప్పబడిన ఒక చదరపు మఠం సముదాయం ఉన్నట్లు వెల్లడయ్యిందని తెలిపారు.

చైనాలో ప్రభావం చూపిన జువాన్‌జాంగ్‌ రచనలు..

జువాన్‌జాంగ్‌గా పిలిచే చైనీస్ బౌద్ధ సన్యాసి, పండితుడు.. హర్షవర్ధన్ రాజు పాలనలో బౌద్ధ గ్రంథాలను పొందేందుకు చైనా నుంచి భారతదేశానికి వచ్చాడు. 629 నుంచి 645 CE మధ్య కాలంలో భారతదేశంలో పర్యటించి 657 భారతీయ గ్రంథాలను చైనాకి తీసుకెళ్లిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. చైనాలో ఆయన రచనలు బౌద్ధమతంపై చాలా ప్రభావాన్ని చూపాయి. 1860 -1870 మధ్యకాలంలో నలంద, వైశాలి వంటి ప్రసిద్ధ ప్రదేశాలను అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్‌ గుర్తించడంలో జువాన్‌జాంగ్ భారతదేశ యాత్ర దోహదపడింది.

Tags:    

Similar News