ఆరు మంత్రిత్వ శాఖలు, లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలను పాకిస్తాన్...

ఆర్థిక సంక్షోభానికి కారణమైన రంగాలను సంస్కరించాలని ఐఎంఎఫ్ విధించిన షరతులను పాకిస్తాన్ అంగీకరించినట్లు ప్రకటించింది.

By :  491
Update: 2024-09-30 07:00 GMT

దేశ ఆవిర్భావం తరువాత ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్, ఆర్ధిక అవసరాల కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది. కానీ అంతర్జాతీయ రుణ సంస్థ పాకిస్తాన్ కు అనేక షరతులు విధించింది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన వ్యయాలను పూర్తిగా తగ్గించాలని సూచించిన షరతులకు అనుగుణంగా దాదాపు 1.50 ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేసింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరు 26న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చివరకు తన సాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఖర్చులను తగ్గించడం, పన్ను-జిడిపి నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి సాంప్రదాయేతర రంగాలపై పన్ను విధించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉన్న తర్వాత మొదటి విడతగా 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులను విడుదల చేసింది. షరతుల్లో భాగంగా సబ్సిడీలను పరిమితం చేయడం, కొన్ని ఆర్థిక బాధ్యతలను ప్రావిన్సులకు బదిలీ చేయటం లాంటివి ఉన్నాయి.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మాట్లాడుతూ, IMFతో ఒక కార్యక్రమాన్ని ఖరారు చేశామని, ఇది పాకిస్థాన్‌కు చివరి కార్యక్రమం అని అన్నారు. "ఇది చివరి కార్యక్రమం అని నిరూపించడానికి మేము మా విధానాలను అమలు చేయాలి," అని అతను వివరించాడు. G20లో చేరడానికి, ఆర్థిక వ్యవస్థను అధికారికంగా రూపొందించాలని ఉద్ఘాటించారు.
మంత్రిత్వ శాఖల్లో రైట్ సైజింగ్ జరుగుతోందని, ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేయాలనే నిర్ణయం అమలులోకి రానుందని, రెండు మంత్రిత్వ శాఖలు విలీనం కానున్నాయని మంత్రి చెప్పారు. "అదనంగా, వివిధ మంత్రిత్వ శాఖలలో 150,000 పోస్టులు తొలగించబడతాయి" అని ఔరంగజేబ్ చెప్పారు.
పన్ను రాబడిని పెంచడంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. గత సంవత్సరం దాదాపు 300,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు ఉన్నారని, ఈ సంవత్సరం ఇప్పటివరకు 7,32,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని తెలిపారు. దేశంలో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుంచి 3.2 మిలియన్లకు పెరిగిందన్నారు.
నాన్-ఫైలర్స్ కేటగిరీని రద్దు చేస్తామని, పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తి లేదా వాహనాలను కొనుగోలు చేయలేరు అని ఔరంగజేబ్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందని, దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. జాతీయ ఎగుమతులు, IT ఎగుమతులు రెండింటిలోనూ గణనీయమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ శక్తికి సంబంధించి పెట్టుబడిదారుల విశ్వాసం ఒక ప్రధాన విజయమని పేర్కొన్నాడు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ రేటును 4.5 శాతం తగ్గించిందని ఔరంగజేబ్ పేర్కొన్నారు. మార్పిడి రేటు, పాలసీ రేటు ఆశించిన విధంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గినందున ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న మా వాదన బూటకపు వాదన కాదు. ద్రవ్యోల్బణం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది' అని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవడానికి కష్టపడుతోంది. 2023లో డిఫాల్ట్‌కు దగ్గరగా వచ్చింది. అయితే IMF ద్వారా సకాలంలో 3 బిలియన్ల రుణం మంజూరు చేయడంతో అది ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కింది.
పాకిస్తాన్ ప్రపంచ రుణదాతతో దీర్ఘకాలిక రుణం కోసం చర్చలు జరిపింది. అదే చివరి రుణం అనే ఆశ, నిబద్ధతతో ఇందులో పాల్గొంది. అయితే, దేశం ఇప్పటికే ఫండ్ నుంచి దాదాపు రెండు డజన్ల రుణాలను పొందింది. అయితే ఆర్థిక వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడంలో విఫలమైంది. ఇంతకుముందు పాకిస్తాన్ కు ఉదారంగా రుణాలు మంజూరు చేసిన అరబ్ దేశాలయిన సౌదీ, యూఏఈలు గత కొంతకాలంగా దాన్ని పక్కన పెడుతున్నాయి. దానితో దాయాదీ దేశం ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొంటుంది.
Tags:    

Similar News