కార్గిల్ నుంచి సింధూర్ దాకా: సరిహద్దుల్లో మళ్లీ మంటలు

ఆవేళ ఆపరేషన్ విజయ్ (కార్గిల్ వార్).. ఈవేళ ఆపరేషన్ సింధూర్.. ఈ రెండు ఆపరేషన్లకు కొన్ని పోలికలు ఉన్నాయి.;

Update: 2025-05-10 12:03 GMT
కార్గిల్ యుద్ధం తర్వాత ఇండియన్ ఆర్మీ విజయోత్సవం (ఫైల్ ఫోటో)
ఆవేళ ఆపరేషన్ విజయ్ (కార్గిల్ వార్).. ఈవేళ ఆపరేషన్ సింధూర్.. ఈ రెండు ఆపరేషన్లకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఆవేళ పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రధాని. అప్పటి ఇండియా ప్రధాని వాజపేయి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ. వీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారే. ఈ రెండు ఆపరేషన్లు మే నెలలో ప్రారంభం అయ్యాయి. ఆవేళ అమెరికా జోక్యానికి అంగీరిస్తూనే పాక్ కి కొన్ని షరతులు పెట్టగా ఈసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.
కార్గిల్ వార్ ఎలా జరిగిందంటే...
సరిగ్గా 29 ఏళ్ల కిందట ఇదే నెలలో ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. మళ్లీ అదే మే నెల 7న ఆపరేషన్ సింధూర్ ను భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ సేనల్ని హడలెత్తిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకున్న తరుణంలో ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. 2025 మే7 న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ను ఇంకా యుద్ధంగా ప్రకటించకపోయినా దాదాపు యుద్ధంగానే పరిగణించాలి.

1947లో దేశ విభజన జరగడానికి ముందు విభిన్న భాషలు, జాతులు, మతాల ప్రజలుండే గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో అంతర్భాగంగా ఉండేది. పలు లోయలు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల కారణంగా విసిరేసినట్టు ఏకాకిగా ఉండేవి. 1947-48లో జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధం ఎక్కువగా భారత్ లో భాగంగా ఉన్న కార్గిల్ ప్రాంతంలోనే జరిగింది.
ఆ తర్వాత 1971లో జరిగిన బారత్-పాక్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఓటమి చెందిన తర్వాత కార్గిల్ ప్రాంతంలోని కొన్ని భూభాగాలు భారత్ లో చేరాయి. కార్గిల్ పట్టణం వాస్తవాధీన రేఖ నుంచి శ్రీనగర్ కి 120 కిలోమీటర్ల దూరం. శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
1999 మే నెలలో పాకిస్తాన్ సైనికులు కార్గిల్ ను ఆక్రమించారు. భారత్ పాకిస్తాన్ ను జూలై 26న తరిమికొట్టి కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్. 1996 జూలై 26న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ని పూర్తి చేసి కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. టీవీలు ఈ యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అనేక మంది జర్నలిస్టులు కార్గిల్ నుంచి కథనాలు అందించారు.
ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అశువులు బాశారు. 1367 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అసాధారణమైన త్యాగాలకు ప్రతిరూపం ఆ విజయం. ఇక, ఆ యుద్ధంలో 453 మంది వరకు పాక్ సైనికులు మరణించారని అధికారికంగా ప్రకటించినా ఓ సందర్భంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సుమారు 4వేల మంది సైనికులను కోల్పోయినట్టు పేర్కొన్నారు.
పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాద మూకలు వ్యూహాత్మకంగా ఆవేళ ఎత్తైన పర్వత శిఖరాలను స్థావరాలుగా మార్చుకుని కార్గిల్ ను ఆక్రమించే దుస్సాహసం చేశాయి. అనధికార సరిహద్దుగా భావిచే నియంత్రణ రేఖను దాటి పాక్ సైనికులు భారత భూ భాగంలోకి చొచ్చుకు రావడమే కార్గిల్ యుద్ధానికి కారణం. ఎత్తైన పర్వతాలపై పాక్ సైనికులు ఉండి కింద ఉన్న భారతీయ సైనికులపై కాల్పులు జరిపి కొంతకాలం పాటు ఎదురునిలిచారు. ఇండియన్ ఆర్మీ రెండు ఫైటర్ జెట్ విమానాలను కూడా కోల్పోయింది. దీన్నుంచి తిప్పుకుని ఒక్కసారిగా వైమానిక దళం దాడుల్ని ఉద్రుతం చేయడంతో పాక్ బెంబేలెత్తింది. అమెరికా సాయాన్ని కోరింది. అయితే ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ కు ఓ షరతు పెట్టారు.
నియంత్రణ రేఖ లోపలకు అంటే పాక్ భూభాగంలోకి పాకిస్తాన్ సైన్యాలు తిరిగివస్తే అప్పుడు జోక్యం చేసుకునే విషయాన్ని ఆలోచిస్తామని అమెరికా స్పష్టం చేయడంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం గత్యంతరం లేక తమ సేనల్ని వెనక్కి రప్పించింది. ఇదే అదునుగా భారతీయ సైన్యం అన్ని ఔట్ పోస్టుల్ని స్వాధీనం చేసుకుంది. ప్రతిఘటించాలని చూసిన పాక్ సైనికుల్ని, ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. 1999 జూలై 26న ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయినట్టు ప్రకటించింది.

కార్గిల్ యుద్ధం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించింది. కార్గిల్ అనుభవంతో భారత్ పలు సంస్కరణలు చేపట్టగా పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. 1999 అక్టోబర్ 12న జరిగిన సైనిక తిరుగుబాటులో ఆనాటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేపట్టారు.
సరిగ్గా మళ్లీ 29 ఏళ్లకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 27 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తయ్యిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌, పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై మే 10నాటికి 3వ రోజుకి చేరింది.
ప్రపంచ దేశాలు భారత్ కి మద్దతు పలికాయి. అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం ఈ యుద్ధంలో తాము తలదూర్చబోమని స్పష్టం చేసింది. అమెరికా మారిన వైఖరి, పాక్ లో అంతర్గత రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ మద్దతుతో కలిపి చూస్తే—ఇది 1999కు మించిన పర్యవసానాల దిశగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
ఆపరేషన్ సింధూర్ ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News