సజ్జలపై డొక్కా కి ఇంత కోపం ఉందా? అరెస్ట్ చేయమంటాడేమిటీ?
సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటికొస్తాయా... జగన్ ప్రభుత్వ తప్పిదాలకు సజ్జలే బాధ్యుడని డొక్కా మాణిక్య వరప్రసాద్ అనడం వెనుక ఉద్దేశమేమిటీ?
By : 491
Update: 2024-09-16 12:15 GMT
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. సజ్జల మూలంగానే జగన్ ప్రభుత్వంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయంటున్నారు. అందుకు ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసే పెద్ద ఉదాహరణ అంటున్నారు.
సజ్జల చెప్పబట్టే ఆ ముగ్గురు పోలీసు అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించారన్నది డొక్కా ఆరోపణ. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఆ ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం చాలా మంచి పని. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారురు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి వలనే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని కూడా ఆ ముగ్గురు ఐపీఎస్ లు చెప్పాలి. అలా చేస్తే వాళ్ల గౌరవం కూడా పెరుగుతుంది అన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని తప్పులకు సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని ఆరోపించారు.
"ఓ మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన తమ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమించలేదు. ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. అధికారుల చేత నటి జెత్వానీని అరెస్టు చేయించిన సజ్జలను అరెస్ట్ చేయాలి. ట్రిబ్యునల్‌కు వెళ్తామనటం సమర్థనీయం కాదు. ముగ్గురిని వైసీపీలో చేర్చుకొని జిల్లా అధ్యక్షులుగా చేయాలి.. లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలి" అని ఎద్దేవా చేశారు. కేంద్రానికి లేఖ రాసి ముగ్గురుని ఐపీఎస్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు."
పూర్వ రంగం ఇదీ...
ముంబై నటి కాదంబరి వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీ ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జెత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది. మాజీ సీఎం జగన్ కి సన్నిహితుడైన సజ్జన్ జిందాల్-ను కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించారన్నది ఆరోపణ. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకించి సజ్జల ఆదేశాల మేరకు ఈ ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని వేధించడం, ప్రశ్నించేవాళ్లను జైళ్లలో పెట్టడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి పనులు చేసినట్టు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం వెనుక కాంతిరాణాపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ కోసం రాజధాని రైతుల్ని హింసించడం వంటి ఆరోపణలు గుంటూరు ఎస్పీగా విశాల్ గున్నీ పై ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే వీళ్లపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ఇచ్చిన నివేదిక ఇంకా దారుణంగా ఉంది. వీళ్లెవ్వరూ నిబంధనలను పాటించరన్నది పెద్ద అభియోగం. వీటన్నింటిని డొక్కా ప్రస్తావించకపోయినా సజ్జలపైన్నే ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో ఒక ప్రెస్ మీట్ కూడా సజ్జలపై విరుచుకుపడ్డారు.