ఢిల్లీకి కాబోయే సీఎం అతిషీ ఎవరో తెలుసా? పేరులోని మర్లేనా మర్మమేంటీ!

కేజ్రీవాల్ రాజకీయ వారసులు ఎవరనేది తేలిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఆయన స్థానాన్ని అతిషీ భర్తీ చేస్తారు.

By :  491
Update: 2024-09-17 07:51 GMT

కేజ్రీవాల్ రాజకీయ వారసులు ఎవరనేది తేలిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఆయన స్థానాన్ని అతిషీ భర్తీ చేస్తారు. దీంతో గత 24 గంటలుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైల్లో ఉండి బయటికొచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజకీయ ప్రముఖులందరూ ఈ అంశాన్నే చర్చిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యవర్గం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అతిషీ పేరును ఖరారు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈవేళ (సెప్టెంబర్ 17వ తేదీ) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీగే సక్సేనాను కలిసి రాజీనామా సమర్పిస్తారని భావిస్తున్నారు.

హరియాణా రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ తన రాజీనామా సమర్పించనున్నారు. అవినీతి మరక తనకు అంటకూడదన్న ఒకే ఒక కారణంతో కేజ్రీవాల్ తన పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీ గడవు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉంది. అప్పటి దాకా ఆయన పదవిలో ఉండవచ్చు. అయినప్పటికీ ఆయన పదవిని వదులుకునేందుకే సిద్ధమయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి జైలు పాల్జేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేజ్రీవాల్ తన నిజాయితీని ప్రజల్లోనే నిరూపించుకోవాలని భావించి జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రత్యర్థి రాజకీయ పార్టీ బీజేపీకి సవాల్ విసిరారు.
ఈనేపథ్యంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ మంగవారం సమావేశమైంది. రాజకీయ పరిణామాల చర్చ అనంతరం కేజ్రీవాల్ తన స్థానంలో అతిషి పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా కేజ్రీవాల్ ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ నాయకులతో వేర్వేరుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ఒక్కొక్కర్ని పిలిచి భావినాయకునిపై మంతనాలు సాగించారు. నిన్న సాయంత్రానికి ఓ కొలిక్కి తీసుకువచ్చిన తర్వాత ఈవేళటి సమావేశంలో అతిషీ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అతిషీ ప్రస్తుతం ఢిల్లీ విద్య, ఆర్ధిక, పబ్లిక్ వర్క్స్ తో పాటు వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కాకుండా ఢిల్లీ రాజకీయవర్గాల్లోనూ పేరున్న వ్యక్తి.
అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసినపుడు అతిషీ కీలకంగా వ్యవహరించారు. ఓదశలో ఆమె కన్నీరు కూడా పెట్టుకున్నారు. కేజ్రీవాల్ వంటి నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుణ్ణి ఇంతవరకు చూడలేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్ట్ కి నిరసనగా ఆమె వీధుల్లోకి వచ్చి ఉద్యమం కూడా నిర్వహించారు. అందువల్లనే ఏమో ఆప్ నాయకుల్లో ఎక్కువ మంది ఆమె పట్ల సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.
కేజ్రీవాల్ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించిన తర్వాత నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే ఇంకా తేలలేదు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26,26 తేదీలలో జరుగునున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆమె తొలిసారి అసెంబ్లీని ఎదుర్కోబోతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పోస్టుకు మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేరు వినిపించినా అతిషీ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపారు. అరవింద్ కేజ్రీవాల్ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారనేది ముఖ్యం కాదని, తిరిగి ఆ ఫ్లేస్ లో కేజ్రీవాల్ ను చూడాలన్నదే తమ ధ్యేయమని భరద్వాజ్ చెప్పారు.
ఇంతకీ ఈ అతిషీ ఎవరు..

ఈమె తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. విజయ్ సింగ్, త్రిప్తా సింగ్ దంపతులకు 1981 జూన్ 8న అతిషి జన్మించారు. ఈమె పేరు కూడా విచిత్రమే. ఆమె తండ్రి ఆమెకు పెట్టిన పేరు "అతిషి మర్లెనా". ఇదేం పేరని తన కుటుంబ సభ్యులు విస్తుపోతుంటే అప్పుడాయన "మార్క్స్, లెనిన్"ను కలిపితే ఆ పేరు వస్తుందన్నారట. ఆ విధంగా వచ్చిందే "మార్లెనా". అయితే ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె తన పేరు నుంచి మార్లేనా ను తొలగించి అతిషి అని మాత్రమే ఉంచుకున్నారు. తన మతమేమిటనే దానిపై గొడవ జరుగుతున్నప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ఆమె క్రిస్టియన్ అని అనుకున్నారు. పంజాబీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన అతిషి ఇప్పుడు సోషల్ మీడియాలో "అతిషి ఆప్" అనే పేరును ఉపయోగిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఆమెకు ఉన్న బలమైన అనుబంధాన్ని ఆమె పేరు ప్రతిబింబిస్తుంది.
పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ, ఉర్దూ అనర్ఘళంగా మాట్లాడగలరు. 2019 లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేశారు. ఆప్ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించినా మొదటి జాబితాలో ఆమె పేరు ఉంటుంది. పార్లీలో ఆమె మొదటి నుంచి ఉండడం వల్ల పార్టీలోని నేతలందరితో పాటు కార్యకర్తల్లోనూ మంచి గుర్తింపు ఉంది. కష్టపడి పని చేస్తారన్న నమ్మకం ఆమె సొంతం.
ఢిల్లీ లోని కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అతిషీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను సంస్కరించడంలో ఆమె బాగా పనిచేశారన్న పేరుంది. విద్య శాఖ మంత్రి హోదాలో ఆమె విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యతో పాటు సంస్కృతి, పర్యాటక శాఖ, పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె 2015 జూలై నుండి 2018 ఏప్రిల్ 17 వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ప్రాథమిక విద్యా సలహాదారుగా కూడా పనిచేశారు.ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి.
దేశ రాజధానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షీలా దీక్షిత్, బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మరో మహిళ ముఖ్యమంత్రి కానున్నారు. అతిషీ మూడో మహిళా ముఖ్యమంత్రి అవుతారు.


Tags:    

Similar News