ఎక్స్ ప్రెస్ రామ్ నాథ్ గోయెంకా కోడలు సరోజ్ గోయెంకా మృతి

మీడియా దిగ్గజం రామ్ నాథ్ గోయెంకా కోడలు, ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ డైరెక్టర్ సరోజ్ గోయెంకా కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు.

By :  Admin
Update: 2024-05-24 13:37 GMT

సరోజ్ గోయెంకా (సోర్స్- ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్)

మీడియా దిగ్గజం రామ్ నాథ్ గోయెంకా కోడలు, ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ డైరెక్టర్ సరోజ్ గోయెంకా కన్నుమూశారు. ఇందిరా గాంధీతో ఢీ అంటే ఢీ అన్న రామ్ నాథ్ గోయెంకా ఏకైక కుమారుడు దివంగత భగవాన్ దాస్ గోయెంకా భార్య సరోజ్ గోయెంకా. ఎక్స్‌ప్రెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు రామ్‌నాథ్ గోయెంకా ఏకైక కుమారుడు భగవాన్ దాస్ గోయెంకా భార్య అయిన సరోజ శుక్రవారం (మే 24) ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. సరోజ్ గోయెంకా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సొంతాలియాకు స్వయాన అత్త.

జైన్ కుటుంబం నుంచి వచ్చి గోయెంకా కుటుంబంతో కలిసి మెలిసి ఎదిగిన వితరణ శీలి సరోజ 1929 ఆగస్టు 29న జన్మించారు. ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడైన దివంగత శ్రేయాన్స్ ప్రసాద్ జైన్‌ కుమార్తె ఆమె. భారతీయ విద్యాభవన్ కు అనుబంధంగా ఉండే శ్రేయాన్స్ ప్రసాద్ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ పేరు ఆయన పేరిట వెలిసిందే. సరోజ్ గోయెంకా సామాజిక విలువలు, మంచి నడవడితో పెరిగారు. మంచి చదువరి. విద్య, వ్యాపార రంగాలలో అభినివేశం ఉన్నవారు. రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్నవారు. భర్త మరణం తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ మీడియా నిర్వహణను చేపట్టారు.
మంచి వితరణ శీలిగా పేరున్న వారు. 2015 డిసెంబరులో చెన్నై వరదలతో అతలాకుతలమైనప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలితకు కోటి రూపాయల చెక్కును అందజేసి తన ఔదార్యాన్ని చాటారు. అవసరమైన వారిని ఆదుకోవడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుండే వారు. దివ్యాంగుల కోసం స్వామి దయానంద ఏర్పాటు చేసిన కృపా హోమ్ కు ఆమె 1998లో 10 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు. సరోజ్ గోయెంకాకు - ఆరతి అగర్వాల్, రీతూ గోయెంకా, కవితా సింఘానియా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు డైరెక్టర్లు కూడా.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సామ్రాజ్యానికి ఏకైక వారసుడైన భగవాన్ దాస్ గోయెంకా 1979 జూలై 19న ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఈ సంస్థ భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. సంస్థను నడుపుతారా లేక మరెవరికైనా అమ్ముతారా అనే సందేహాలు చుట్టుముట్టాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రభ, కన్నడప్రభ, దినమణి సహా అనేక పత్రికలు ఉండేవి. వందల కోట్ల రూపాయల ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ఏమై పోతుందో అనే బెంగ ఎదురైంది. అటువంటి సమయంలో ఆమె నడుంకట్టారు. ఓవైపు సాంప్రదాయ ధోరణి మరోవైపు తరుముకొస్తున్న కార్పొరేట్ సంస్కృతి మధ్య సంస్థ సతమతం అవుతున్న సంస్థను గాడిన పెట్టి ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నడిపే సారధి అయ్యారు. ఎక్స్‌ప్రెస్ సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఎటువంటి అనుమానాలకు తావులేకుండా, బీడీ గోయెంకా వారసత్వం పోకుండా సంస్థను ముందుకు నడిపించారు.
ఇండియన్ మీడియాను పురుషులు మాత్రమే శాసిస్తున్నసమయంలో ఓ మహిళ ఇండియన్ మీడియా ఇండస్ట్రీ సారధ్యాన్ని చేపట్టి తన దూరదృష్టితో మలుపు తిప్పారు. సరికొత్త జర్నలిజానికి దారులు వేశారు. "సాహసోపేతమైన రిపోర్టులు, మానవాసక్తికర కథనాలు, విశిష్టమైన ఫోటోలతో ఏరోజుకా రోజు పత్రికలను స్పష్టమైన విధివిధానాలతో తీసుకువచ్చేలా చొరవ చూపారు. పాఠకుల అభిరుచికి అనుగుణంగా వార్తా కవరేజీ ఉండేది.పాఠకులు మెచ్చిన వార్తలకు ప్రతీకగా ఉండేది" అని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తన పత్రికలకు తానే తొలిపాఠకురాలుగా నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు.
వార్తాపత్రిక నిర్వహణ కష్టకాలమైన తరుణంలో ప్రత్యేకించి 1970లలో సరోజ్ గోయెంకా చూపిన చొరవ అసామాన్యమనే చెప్పాలి. అస్తవ్యస్థంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అనేక సంస్కరణలు చేపట్టారు. దుబారాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్‌గా సరోజ్ గోయెంకా చెన్నై నగర రూపురేఖల్ని మార్చడంలోనూ కీలకపాత్ర పోషించారు. సరోజ్ గోయెంకా ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ పెట్టిందే చెన్నై మౌంట్ రోడ్‌లోని ప్రసిద్ధ ఎక్స్‌ప్రెస్ మాల్‌. ఎక్స్ ప్రెస్ రెసిడెన్సీస్, ఎక్స్ ప్రెస్ హోటల్, ఈఏ పేరిట పెట్టిన ఛాంబర్స్ కూడా ఎక్స్ ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసినవే. ఆమె ఎక్స్‌ప్రెస్ పబ్లికేషన్స్ (మదురై) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
Tags:    

Similar News