కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, 65 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు

15,20 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందవచ్చు. అయితే నిరుద్యోగ యువత మాత్రం నిప్పులు కక్కుతోంది. దీని వల్ల లాభనష్టాలేమిటో చూద్దాం;

Update: 2025-01-24 13:12 GMT
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు తమ ప్రత్యేకత ఉన్న రంగాల్లో ఇంకొన్ని సంవత్సరాలు సేవలందించడానికి అవకాశం కలుగుతుంది. 2025 ఆర్ధిక సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించవచ్చు.
ఇప్పుడెందుకీ ఈ నిర్ణయం?
పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచడం వెనుక ప్రధాన కారణం ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు 60 ఏళ్లు వయసు దాటినా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, మరింత కాలం పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఈ నిర్ణయంతో జూనియర్లకు సీనియర్లు తమ అనుభవాన్నీ, జ్ఞానాన్నీ పంచే అవకాశం లభిస్తుంది.
అత్యంత కీలకమైన విద్య, వైద్య, ఆరోగ్య, ప్రజాసేవ రంగాలలో అనుభవజ్ఞులైన ఉద్యోగుల అవసరం ఉంది. కొత్త తరానికి పాలనాపరమైన అనుభవాన్ని నేర్పడానికి రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం పనికి వస్తుంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 60 శాతం మందిని కొనసాగించవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు..
ఈ పొడిగింపు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక, వృత్తి సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. వారు తమ పదవీ విరమణ తర్వాత శేష జీవితం సౌకర్యంగా సాగేలా మరింత ఆదాయాన్ని పొందుతారు. కొత్త నియామకాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవసరం తప్పుతుంది. రిటైర్మెంట్ పేమెంట్లను మరో ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. తద్వారా ప్రభుత్వం మరికొన్ని రంగాల అభివృద్ధికి రిటైర్మెంట్ అనంతర పేమెంట్లను వినియోగించవచ్చు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలామంది ఉద్యోగులు తమ వృత్తిలో క్రియాశీలంగా ఉండడానికి ఈ నిర్ణయం పనికి వస్తుందని స్వాగతించగా మరికొందరు పెదవి విరిచారు. యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కొత్త నియామకాలు ఆగబోవని కేంద్రం ప్రకటించింది. నియామకాలు యథావిధిగా కొనసాగుతాయని, జనరేషన్ గ్యాప్ లేకుండా చూస్తామని, సమతుల్యత ఉండేలా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
ఎంతమందికి మేలు చేస్తుంది...
కేంద్ర ప్రభుత్వ పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధి పొందే ఉద్యోగుల సంఖ్య ఎంతన్నది ఇంకా కచ్చితంగా తేలలేదు. ప్రయోజనం పొందే వారి సంఖ్య కొన్ని ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో పదవీ విరమణ వయసుకు దగ్గరగా ఉన్నవారి సంఖ్య ఎంత అనేది ఇంకా లెక్కకట్టలేదు. ఈ నిర్ణయం అన్ని శాఖలకు వర్తిస్తుందా లేక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు మాత్రమే అంటే విద్య, ఆరోగ్యం, ప్రజాసేవ వంటి కీలక రంగాలకే పరిమితం చేస్తారా అనేది కూడా ఇంకా నిర్ణయం కాలేదు.
జాతీయ స్థాయిలో గణాంకాలు ఇలా..
అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి సుమారు 1.5 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రతి ఏడాది పదవీ విరమణ చేసేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ప్రస్తుత నిర్ణయం వల్ల ఈ ఉద్యోగులు మరో 5 ఏళ్లు పని చేయగలుగుతారు. ప్రతి ఏటా సాధారణంగా, సుమారు 3-4 లక్షల మంది పదవీ విరమణ చేస్తారని అంచనా.
65 ఏళ్ల పెంపు ప్రభావం...
ఈ నిర్ణయం వల్ల 60 నుంచి 65 ఏళ్ల మధ్యలో పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు కొత్తగా ఈ 5 ఏళ్లు సర్వీసు పొందగలరు. దాంతో, సుమారు 15-20 లక్షల మంది ఉద్యోగులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇవి సాధారణ అంచనాలు మాత్రమే. నిజమైన లెక్కలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
ఈ నిర్ణయం వల్ల నష్టాలేమిటీ?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు లేదా నష్టాలు లేకపోలేదు. అవి..1. యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. కొత్తగా నియామకాలు ఆలస్యమవుతాయి. ఉద్యోగాల కోసం పోటీపడే ప్రత్యేకించి నిరుద్యోగ యువతపై ప్రభావం చూపవచ్చు.
2. ఉద్యోగ ప్రోత్సాహకాలు తగ్గుతాయి. పదవీ విరమణ వయసు పెరగడంతో వివిధ దశల్లో ఉన్న అనుభవజ్ఞుల ప్రమోషన్లు ఆలస్యమవుతాయి.
ఇది ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపుతుంది. మరింత బాగా పని చేయాలనుకునే ఉద్యోగుల ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. ప్రమోషన్లు తగ్గుతాయి. .
3. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించే అవకాశం సన్నగిల్లుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల పనితీరు, సాంకేతిక నైపుణ్యం కొంతవరకు తగ్గుతుందనే భావన ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.
4. వృద్ధాప్యంతో ఆరోగ్యం తగ్గే అవకాశం ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల పనితీరు తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా శారీరక శ్రమ అవసరమైన ఉద్యోగాల్లో ఇది పెద్ద సవాలు కావచ్చు.
5. పదవీ విరమణ వయసు పెరిగినప్పటికీ, వేతనాలు, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇది నిరుద్యోగ యువత పాలిట శాపంగా మారవచ్చు.
6. నిపుణుల అంచనా ప్రకారం, ఈ నిర్ణయం వల్ల ఆర్థిక అసమతుల్యత లేదా వ్యవస్థాపక లోపాలు ఏర్పడే అవకాశముంది.
7. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పరిశోధన వంటి రంగాల్లో పైస్థాయి అధికారులు పాతుకుపోవడం వల్ల కొత్తతరం నూతన ఆవిష్కరణలకు కష్టమవుతుంది.
8. వయసు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగులు కొత్త సమస్యల పరిష్కారానికి సరైన విధానాలను అనుసరించలేరనే భావన ఉంది.
ఏది ఏమైనా, ఈ నిర్ణయం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు గాని నిరుద్యోగ యువత నుంచి నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. యువత కోసం ప్రత్యేక అవకాశాలను అన్వేషించకుండా పాత ఉద్యోగుల్ని కొనసాగిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువనే భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News