మోదీ హోటల్ బిల్ పెండింగ్... హెచ్చరించిన యాజమాన్యం

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా మైసూరులోని ఓ హోటల్ లో బస చేశారు. బిల్లు అక్షరాలా రూ.80 లక్షలు అయింది.

By :  Vanaja
Update: 2024-05-25 14:09 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా మైసూరులోని ఓ హోటల్ లో బస చేశారు. బిల్లు అక్షరాలా రూ.80 లక్షలు అయింది. అధికారులు బిల్ క్లియర్ చేయకపోయేసరికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆ హోటల్ యాజమాన్యం రెడీ అయిపోయింది.

మెల్లగా కట్టేస్తారుగా, ప్రధాని హోటల్ బిల్ కట్టలేదని యాక్షన్ తీసుకుంటారా? అని అభిమానులు కోపడతారేమో. మెల్లగా కట్టడానికి ఆయన పర్యటన పూర్తయి ఇప్పటికే ఏడాది కావస్తోంది. పోనీ లక్షా, రెండు లక్షలా వదిలేసి ఉరుకోడానికి. రూ.ఎనభై లక్షలు. చూస్తూ చూస్తూ మన ప్రధాని కదా అని అంత డబ్బుని వదులుకోలేరు కదా.. అందుకే నయానో భయానో డబ్బులు వసూలు చేసుకుందామని ఫిక్స్ అయ్యారు.

అసలు విషయం ఏంటంటే... నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం ఏప్రిల్ 2023 లో కర్ణాటకలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే 3 కోట్ల వ్యయంతో ఏప్రిల్ 9 నుండి 11 వరకు కార్యక్రమాన్ని రూ.3 కోట్ల బడ్జెట్ తో నిర్వహించాలని, 100% కేంద్రం నిధులు అందజేస్తుందని రాష్ట్ర అటవీ శాఖకు ఎంఓఈఎఫ్, NTCA హామీ ఇచ్చింది. కానీ ఈవెంట్ మొత్తం ఖర్చు రూ.6.33 కోట్లకు చేరుకుంది. కేంద్రం హామీ ఇచ్చిన రూ.3 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ.3.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

కాగా, NTCA అధికారులు అందించిన సూచనలు, ప్రధాన మంత్రి కార్యక్రమ అవసరాల ప్రకారం, కొన్ని అదనపు కార్యకలాపాల కోసం బడ్జెట్ పెరిగిపోయింది. దీంతో ప్రోగ్రామ్ అవుట్‌సోర్స్ తీసుకున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, సవరించిన కొటేషన్‌ను అధికారులకు ఇచ్చింది.

కర్నాటక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) సెప్టెంబర్ 29, 2023న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్-జనరల్, NTCA, న్యూఢిల్లీకి బకాయిలను గుర్తు చేస్తూ లేఖ రాశారు. అయితే మైసూరులోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధానమంత్రి బృందం బసకు సంబంధించిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని NTCA ఫిబ్రవరి 12, 2024న తిరిగి లేఖ రాసింది.

మార్చి 22, 2024 న మోదీ బస చేసిన రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో అది ఇప్పటికి రూ. 80.6 లక్షలు అయిందని, బిల్లు క్లియర్ చేయాలంటూ ప్రస్తుత పిసిసిఎఫ్ సుభాష్ కె. మల్ఖేడే NTCAకి గుర్తు చేస్తూ మరో లేఖను రాశారు. దానిపై ఇప్పటివరకు సమాధానం లేదు.

ఈలోగా, రాడిసన్ బ్లూ ప్లాజా జనరల్ మేనేజర్, ఫైనాన్స్, మే 21, 2024న డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బసవరాజుకు లేఖ రాస్తూ, “మా హోటల్ సేవలు వినియోగించుకుని 12 నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదని, వీలైనంత త్వరగా చెల్లించాలని” గుర్తు చేశారు. అంతేకాదు జూన్ 1, 2024లోపు బకాయిలు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం హెచ్చరించింది.

Tags:    

Similar News