సినిమా తిక్కకు ఒక లెక్కంటూ ఉంటుందా?
సినిమా సక్సెస్ సరే... ఫెయిల్ అయితే!
-శృంగవరపు రచన
ఈ సంవత్సరం ‘కల్కి’ సినిమా కోట్ల రికార్డులు బద్ధలు కొట్టింది...
తెలుగేతర సినిమాలైన ‘లక్కీ భాస్కర్’,’అమరన్’ ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తూనే ఉన్నాయి...
అలాగే ‘క’ యాభై కోట్ల క్లబ్బులో చేరింది...
ఇలా ప్రతి సినిమాకు ఒక కమర్షియల్ లెక్క ఉంటుంది.
సరే, సినిమా ఈ కమర్షియల్ సక్సెస్ సాధిస్తే, అసలు వేరే మాటే ఉండదు!
కానీ ఫెయిల్ అయితే?
దాని లెక్కలు ఏమిటి? బాధ్యత ఎవరూ తీసుకుంటారు? ఎవరు నిందించబడతారు?
సినిమా కమర్షియల్ సక్సెస్ ఎక్కువ శాతం సినిమా తీయడానికి పెట్టిన బడ్జెట్ ను అనుసరించి ఉంటుంది. చిన్న సినిమాల విషయానికి వస్తే వాటి కమర్షియల్ సక్సెస్ కి మౌత్ టాక్, ప్రమోషన్స్ చాలా అవసరం.
మొన్న వచ్చిన ‘పొట్టేల్’ భారీ ప్రమోషన్స్ తో వచ్చింది. అది చిన్న సినిమానే అయినా, దర్శకుడి మొదటి సినిమా అయినా కూడా...జనాల నోళ్లల్లో దాని పేరు నానింది. కానీ ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అలాగే ఇప్పుడు ‘కంగువా’, ‘మట్కా’ కూడా డిజాస్టర్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సినిమాల ఉదంతాలు గమనిస్తే వీటికి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరిగాయి. ప్రమోషన్స్ భారీ స్థాయిలో ఉంటే మొదటి మూడు రోజుల షోలు నడిచినా, సినిమాకు పెట్టిన బడ్జెట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా కీలకం ఈ సక్సెస్ లో. ‘పొట్టేల్’ సినిమా బాలేదని అన్నప్పుడూ ఆ సినిమాలోని నటులు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూవర్లను అసభ్య పదజాలంతో తిట్టి పోశారు. తర్వాత అన్ కండిషనల్ అపాలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా, అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో అసలు సినిమా ఫెయిల్యూర్ ని ఏ కోణాల్లో చూడొచ్చో చూద్దాం.
సినిమాకు కథే కింగ్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో కొత్త కథలే కనిపించడం లేదు. అందుకే ఎంత తనను తాను వైవిధ్యంగా నిరూపించుకుందామని అనుకుని సినిమా రంగంలోకి వచ్చిన వారైనా చివరకు కమర్షియల్ ట్రాక్ మీదే చతికిల పడతారు. ఇలాంటి సందర్భంలో ఆ సినిమాలోని హీరో లేదా దర్శకుని అభిమానుల స్థాయి ఆ సినిమాను సక్సెస్ అయ్యేలా చేయగలదా? అంటే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదనే చెప్పొచ్చు. ప్రేక్షక దేవుళ్ళు అనే మాట ఎందుకన్నా, ఆ దేవుడిని కూడా ఏదో ఒకటి ఆశించి ఆరాధించే జనాలు సినిమా నటులను మాత్రం ఏం ఆశించకుండా ఆరాధిస్తారు. సినిమా నటులు, దర్శకులు అభిమానులకు ఒక పర్సనల్ ఎమోషన్. ఆ తర్వాత సగటు ప్రేక్షకుడికి కూడా అది ఒక ఎమోషన్. అందుకే సినిమా నచ్చితే ఎంత ఆకాశానికి ఎత్తేస్తాడో, నచ్చకపోతే అంతే నిర్మొహమాటంగానూ తేల్చేస్తాడు. ప్రేక్షకుడి ఈ ఎమోషనల్ నేపథ్యం వల్లే సినిమా కోట్ల వ్యాపారం అయ్యింది. ఈ మధ్య అనేకమంది సినిమా వ్యక్తులు సినిమా ఫెయిల్ అయినప్పుడు, ‘ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీరు చూపించండి,అప్పుడు మీకు తెలుస్తుంది సినిమా తీయడం ఎంత కష్టమో. అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా సినిమా బాగోలేదని అనడమే’ అనే కామెంట్స్ చేయడం తరచుగా కనిపిస్తుంది. అవును, అవేమీ రాకపోయినా, పెద్ద సినిమాల పేర్లతో టికెట్ రేట్లు పెంచినా, ఆ టికెట్లు తమ డబ్బుతో కొని చూసేది వాళ్ళే. ఒక సినిమాకు నిర్మాత డబ్బు పెడితే, వాటి వసూళ్ళు చేయడానికి కావాల్సింది ఈ ఏమి తెలియని వాళ్ళే. సినిమా చూడటానికి, బావుందో లేదో తెలియడానికి కావాల్సింది ఏదో ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ నవ రసాల్లో ఏదైనా కావొచ్చు.లేకపోతే కొన్ని సార్లు అనేక ఎమోషన్స్ కలిసి ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. అలాగే , రివ్యూవర్లు కూడా ప్రేక్షకులే. కక్ష కట్టి బాగోలేదని చెప్పేవారూ లేరు.కాకపోతే సినిమా నుండి ప్రతి ప్రేక్షకుడు ఒకే విషయాన్ని ఆశించడు.
సినిమా అనే దాన్ని కొంత పర్సనల్ ఎమోషన్ గా భావించే నేపథ్యంలో అభిమానులు సినిమాల్లో తమ అభిమాన హీరోల, దర్శకుల సినిమా జర్నీని గమనిస్తూనే ఉంటారు. వారి మార్క్ అంటే తప్పక అభిమానులకే ఎక్కువ తెలుస్తుంది. సినిమా విజయం సాధించినా లేదా విఫలమైనా, ఆ మార్క్ ను హీరో లేదా దర్శకుడు నిలుపుకోగలిగితే వారు సినిమా ఫెయిల్ అయినా యాక్టర్ లేదా దర్శకుడిగా ఫెయిల్ కానట్టే.
ఈ నేపథ్యంలో కల్కి దర్శకులు నాగ్ అశ్విన్ ముందు తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాల స్థాయి వేరు. వీటిని బట్టి అతనూ ఎంతో గొప్ప దర్శకుడు సినిమా కథ, ప్రెజెంటేషన్ పరంగా ఎంతో వినూత్నంగా ఉండబోతాడు అన్న అంచనా చాలామంది విశ్లేషకులకు,అలాగే ఆయన జర్నీ గమనించిన అందరికీ స్పష్టం అయ్యింది. అదే దర్శకుడు కల్కి విషయంలో పూర్తిగా ట్రాక్ మార్చాడు. పూర్తి కమర్షియల్ ఫార్ములా. ఎన్నో హాలీవుడ్ ఛాయలు, పిల్లలకు నచ్చే వీడియో గేమ్ మోడల్, పెద్ద స్టార్స్ ని కామియో రోల్స్ లో ఉంచడం; అన్నిటికి మించి భారతీయులు ఎప్పటికీ అభిమానించే భారతాన్ని తీసుకోవడం; అవును, నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా ట్రాక్ తప్పినా, సక్సెస్ ట్రాక్ తప్పలేదు. తన డైరెక్షన్ మార్క్ మార్చుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.డైరెక్టర్ తన మార్క్ లో మార్పులు చేసుకున్నా, సక్సెస్ అయితే మాత్రం దానికి క్రెడిట్టే వస్తుంది. కనుక అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు.
కానీ ఇదే కమర్షియల్ ట్రాక్ లోకి మారే క్రమంలో ఆ ఫార్ములా తెలియకుండా వస్తే మాత్రం డైరెక్టర్ లేదా హీరోని నమ్మి చూసే ప్రేక్షకులు తప్పక తమ నమ్మకం ఒమ్మైందని గట్టిగానే చెప్తారు. దానికి కారణం వాళ్ళకు ఆ డైరెక్టర్ లేదా హీరో మీద ఉన్న నమ్మకం. అది పర్సనల్ ఎటాక్ కాదు. వాళ్ళకు సినిమా అంటే తమ జీవితంలో ఉన్న ఒక పర్సనల్ స్పేస్ అన్న భావన నుండి వచ్చే ప్రతిస్పందన. దీనిని గౌరవించే హుందాతనం ఉన్నవారిని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు; తీవ్ర అసహనం ప్రదర్శించిన వారిని కూడా గుర్తు పెట్టుకుంటారు. అలాగే ప్రేక్షకులు ఎక్కువ కనక్ట్ అయ్యేది కూడా హీరోలు,దర్శకులతోనే. మిగిలిన టీంకు అభిమానులు ఉన్నా,అరుదైన సందర్భాల్లో తప్ప వీరితో పోలిస్తే ఆ అభిమానం తక్కువ స్థాయిలోనే ఉంటుంది ఫైనల్ గా, అభిమానులైనా ప్రేక్షకులైనా సినిమాల్లో నటుల,దర్శకుల మార్క్స్ ని గమనిస్తునే ఉంటారు. తమ అభిప్రాయాలనూ చెప్తునే ఉంటారు!
సినిమా సక్సెస్ ను అంగీకరించడం చాలా సులభం. కానీ వైఫల్యాన్ని అంగీకరించడం అంత సులువు కాదు. అందుకే సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కొంత స్వేచ్చ లేదనో లేక ఇతరుల ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైందనో సినిమా దర్శకులు కామెంట్ చేయడం గమనిస్తాం. కానీ సక్సెస్ కి మాత్రం క్రెడిట్ ఆ ఇన్వాల్వ్ అయిన వారికి రాదు అన్నది కూడా అంతే గట్టిగా ఒప్పుకోవాల్సిన నిజం. ఆ హుందాతనాన్ని గుర్తించే సెన్సిబిల్ నటులను, దర్శకులను ఎప్పటికీ గౌరవాన్ని కోల్పోరు. ఆ హుందాతనం, కొంత సంయమనం కోల్పోని వారు వైఫల్యం అంగీకరించినా, సక్సెస్ అయినట్టే.