ఉపేంద్ర ‘UI మూవీ’ రివ్యూ
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసిన ఈ సినిమా ఉపేంద్ర అభిమానుల అంచనాలను అందుకుందా ఎలా ఉంది, కథేంటి?
ఉపేంద్ర అనగానే మనకు చాలా సినిమాలు కళ్ల ముందుకు వస్తాయి. దర్శకుడుగా ఆయనకు ఇప్పటికీ తెలుగులో అభిమానులు ఉన్నారు. ‘A’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ష్..’ వంటి సినిమాలను ఇప్పటికీ చూస్తూంటారు. నటుడిగా బిజీ అయ్యాక డైరక్షన్ వైపుకు ఆయన వెళ్ళటం తగ్గించేశారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం. ‘యూఐ). పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసిన ఈ సినిమా ఉపేంద్ర అభిమానుల అంచనాలను అందుకుందా ఎలా ఉంది, కథేంటి?
స్టోరీ లైన్
సత్య(ఉపేంద్ర)కు ప్రపంచాన్ని సత్య కాలానికి తీసుకెళ్లాలనే కోరిక.అందుకోసం అతని చాలా మంచి పనులు చేస్తుంటాడు. చుట్టు ప్రక్కల జనాలకు సాయం చేస్తుంటాడు. అయితే అదే సమయంలో అతని ఆల్టర్ ఇగో కల్కి(ఉపేంద్ర) బయటకు వస్తాడు. కల్కి ఆశయం ప్రపంచాన్ని నాశనం చేసేయాలని. కల్కి వచ్చి సత్యను డామినేట్ చేస్తుంటాడు. మరో ప్రక్క UI అనే ఈ పిక్షన్ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి , జాతులు, మతాల నుంచి జనం ఉంటుంటారు. వాళ్లను వామనరావు (పి.రవిశంకర్)అనే రాజు లాంటి వ్యక్తి పాలిస్తుంటాడు. ఇక సత్యకు, కల్కి కు మధ్య వామనరావు ఇరుక్కుపోతాడు. సత్యను కిడ్నాప్ చేసిన కల్కి ప్రపంచాన్ని నాశనం చేయాలని గుర్రంపై తిరుగుతుంటాడు. అడ్డు వచ్చిన వాళ్లను అంతం చేస్తూంటాడు. సత్య,కల్కి లలో ఎవరు గెలుస్తారు. వామనరావు పరిస్దితి ఏమవుతుంది. సత్య చివరకు ఏమయ్యాడు. కల్కి బారి నుంచి సత్య బయిటపడగలిగాడా వంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతూంటంది.
విశ్లేషణ
ఉపేంద్ర ఈ సినిమాని ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, కరెంట్ సిస్టమ్, టెక్నాలజికి,ఇన్ఫర్మేషన్ కు బానిసలైన జనాలపై సెటైర్ చేయాలనుకున్నారు. ఉపేంద్ర తనే మంచి, చెడు పాత్రలకు ప్రతినిధిగా తెరపై కనపడుతుంటాడు. అయితే సెటైర్ మరీ ఓవర్ డోస్ అవ్వడం, అదీ ఉపేంద్ర స్టైల్ లో సినిమా నడవడంతో అసలు ఏమి తెరపై జరుగుతోందో అర్థం కాని పరిస్థితికి చేరుకుంటుంది. మొదట్లో సినిమా ప్రారంభం కాకముందు ‘మీరు తెలివైన వాళ్లయితే ఇప్పుడే బయటకు వెళ్లిపోండి. మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి’ అంటూ సినిమా ప్రారంభంలో ఓ కార్డ్ వేస్తుంది. దాన్నుంచి తేరుకునే లోగా వెంటనే ‘తెలివైన వాళ్లు మూర్ఖుల్లా కనిపిస్తారని, మూర్ఖులు తెలివైన వాళ్లలా నటిస్తారని’ అని అని అనటంతో ఆసక్తి క్రియేట్ అవుతుంది. అయితే దాన్ని కొద్ది సేపట్లోనే చంపేస్తాడు తన కథనంతో.
కథా ప్రారంభమే ఉపేంద్ర అనే డైరక్టర్ తీసిన సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని చూపెడుతారు. అదే సమయంలో ఆ సినిమా వివాదం సృష్టిస్తుంది. ‘UI మూవీ’ అనే టైటిల్ తో వచ్చిన సినిమా చూసిన జనాలు పిచ్చెక్కిపోతారు. ‘ఫోకస్’ దొరికిందని కొందరు ఆనందంతో గంతులు వేస్తూంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రివ్యూ రైటర్ (మురళి శర్మ)కు ఈ సినిమాకు ఏ రివ్యూ రాయాలో అర్థం కాదు. దాంతో ఈ సినిమాని బాగా పరిశీలించాలని ఆలోచిస్తూ, మళ్లీ మళ్లీ ఆ సినిమానే చూస్తూ తిరుగుతుంటాడు. ఇలా కాదు అని ఉపేంద్ర ని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఇంటి దగ్గర ఉపేంద్ర రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ ని అతని ఊహల్లోంచి మనకు సినిమాగా ఆవిష్కారం చేస్తూ చూపెడతారు.
సినిమాలో ప్రత్యకమైన కథ ఏమి లేకుండా రకరకాల ఇష్యూలపై హీరో తన పాత్ర ద్వారా సెటైర్ వేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఓ రకంగా చూసేవాళ్ల పై దాడి జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఎవరినీ వదలిపెట్టలేదు. చివరకు రివ్యూ రైటర్స్ తో సహా. కొన్ని బ్లాక్ లు అక్కడక్కడా బాగుంటాయి. అయితే సినిమా టెక్ నేరేషన్ కాకపోవటంతో చూసేవాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది. ఫార్ములాకి పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది.
టెక్నికల్ గా ...
సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రిప్టు ఇంకాస్త అర్థమయ్యేలా రాసుకుంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెవీ గా ఉంది. పాటలు లలో చెప్పుకోదగినవి లేదు. ట్రోల్ సాంగ్ మాత్రమే గుర్తుంటుంది. ఉపేంద్ర కాస్ట్యూమ్స్ కొత్తగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నటీనటుల్లో ... ఉపేంద్ర ఎప్పటిలాగే కొత్తగా చేశారు వాయిస్ నుంచి గెటప్,లుక్ అన్ని మార్చేసారు. కొద్దిపాటి నెగిటివ్ పాత్రలో రవిశంకర్ కనిపించారు. ఇందులో ఉపేంద్ర హీరో, విలన్ కాబట్టి తెర మొత్తం ఆయనే ఉంటారు. మురళి శర్మ ఎంతో సేపు లేరు. చెప్పుకోవడానికి ఏమీ లేదు.
చూడచ్చా
అక్కడక్కడా బాగున్నా ఈ సినిమా చేతిలో రిమోట్ లేదా మౌస్ ఉంటేనే ఎపిసోడ్స్ స్క్రిప్ చేస్తూ చూడగలం. ఉపేంద్ర అభిమాని కాని వారికి ఈ సినిమా పెద్ద బ్రహ్మ పదార్దమే.