'నరివెట్ట' ఓటిటి మూవీ రివ్యూ!
ఒక దాచిపెట్టిన చరిత్ర మన ముందుకు తెరపైకి తెచ్చే ప్రయత్నం ఇది.;
వర్గీస్ పీటర్ అనే ఒక సాధారణ యువకుడి జీవితం ఎలా రాజకీయంగా, మానసికంగా మలచబడిందన్నదే కథ. అతని దృష్టికోణం ద్వారా, ఒక దాచిపెట్టిన చరిత్ర మన ముందుకు తెరపైకి తెచ్చే ప్రయత్నం ఇది.
2003 లో కుట్టనాడ్‌కి చెందిన యువకుడు వర్గీస్ పీటర్ (టోవినోథామస్) తనకు నచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక అతనికి ఇష్టం లేకపోయినా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరేందుకు దారితీస్తాయి .అక్కడే అతనికి బషీర్ (సూరజ్ వెంజరమూడు) పరిచయమవుతాడు.
శిక్షణ పూర్తైన వెంటనే, వర్గీస్‌ను వయనాడ్‌కు పంపిస్తారు — అక్కడ ఆదివాసీలు తమ భూముల కోసం నెలలుగా ఆందోళన చేస్తుంటారు. వయనాడ్ లో జరుగుతున్న ఆదివాసీల పోరాటాన్ని అణచివేసే డ్యూటీ పడుతుంది. దాంతో బషీర్ టీమ్ తో కలిసి వర్గీస్ కూడా వెళతాడు. మొదటిసారిగా అతను ఆదివాసీలు భూమి కోసం చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూస్తాడు.
మరో ఆదివాసీల వెనుక మావోయిస్టులు చేరి ఈ పోరాటం చేయిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తూంటాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రఘురామ్ (చేరన్) కి ఉంటుంది. మరో ప్రక్క ఎలాగైనా ఉద్యమాన్ని అణిచివేయాలనేది ప్రభుత్వ పెద్దల పట్టుదల. వాళ్లు పోలీస్ లపై ప్రెజర్ పెడుతూంటారు. ఈ క్రమంలో పై అధికారి ఆదేశం మేరకు మావోయిస్టుల జాడ కనిపెట్టడానికి వెళ్లినవారిలో బషీర్ మిస్సవుతాడు.
బషీర్ ను వెతుకుతూ వెళ్లిన వర్గీస్ కి కొన్ని కలలో అయినా ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి, ఈ ఉద్యమ అణిచివేత కుట్రలో కొన్ని అమానుషాలు జరుగుతున్నాయని అర్దం చేసుకుంటాడు. అతని కళ్ల ముందే నిజ జీవితపు అసహ్యం, అణచివేత, రాష్ట్ర హింస అతని స్వాభావాన్ని ప్రశ్నించడం ప్రారంభమవుతుంది.అప్పుడు వర్గీస్ ఏం చేస్తాడు? ఆదివాసీలను కట్టడి చేయడానికి వచ్చిన అతను, వాళ్లకి అండగా ఎందుకు నిలబడతాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ
"అధికారానికి వ్యతిరేకంగా మనిషి పోరాటం అంటే, మరిచిపోవడానికి వ్యతిరేకంగా జ్ఞాపకాల పోరాటం."
నరివెట్ట సినిమా ప్రారంభంలోనే మిలాన్ కుందేరా చెప్పిన ఈ మాటలు తెరపై కనిపిస్తాయి — ఇలాంటి వాక్యం తో సినిమా మొదలవ్వడం చూసిన వెంటనే — “సినిమా సైద్దాంతికంగా ఏదో చెప్పబోతోంది. కాస్త స్ట్రాంగ్ గానే ఉండబోతుంది” అనే ఆశను కలిగిస్తుంది. 2003లో వయనాడ్ మూథంగలో భూమి హక్కుల కోసం ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం… ‘జ్ఞాపకాన్ని’ నిలబెట్టే ఒక ఆత్మగౌరవ గాథగా అనిపిస్తుంది. అతి శక్తిమంతమైన వ్యవస్థల మధ్య తుడిచిపెట్టబడే వాస్తవాల్ని తిరిగి తెరపైకి తేవడమే లక్ష్యంగా కనిపిస్తుంది.
కానీ, ఆ స్థాయి తీవ్రత తెరపై పూర్తిగా అనిపించదు. ఆ స్థానంలో మనకు కనపడేది — కోపంగా, తప్పనిసరి పరిస్దితుల్లో పోలీస్ కానిస్టేబుల్ గా మారిన వర్గీస్ పీటర్ పరిపక్వత సాధించే ప్రయాణం. ఇది నేరుగా ఉద్యమం గురించైతే కాదు… ఆ ఉద్యమం మద్యలో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి మనస్తత్వ మార్పు గురించిన కథగా మలచబడింది. ఒకటే సంఘటన, ఒకటే అన్యాయం , అయితే అది ఎవరి కళ్లలో ఎలా కనిపించిందన్న కోణంలో ఈ సినిమా ప్రయాణిస్తుంది.
వాస్తవానికి ఈ సినిమా చూపించాలనుకునే అసలైన నిజం — కేరళలోని ఆదివాసీ సముదాయాల పీడిత జీవితాలు,వారిపై జరుగుతున్న దాడులు — పెద్ద ఎత్తున జనాలకు పూర్తిగా తెలియని విషయాలనే. వీటిని యాజటీజ్ చెప్తే డాక్యుమెంటరీ అయ్యిపోతుంది. అందుకే రచయిత అబిన్ జోసఫ్ ఓ సినిమాటెక్ నిర్ణయం తీసుకున్నాడు. వర్గీస్ అనే పాత్రను ఇవేమీ తెలియని ప్రేక్షకుడికి ప్రతినిధిగా నిలబెట్టడం. ఆ పాత్ర జర్నీ ద్వారా ప్రేక్షకుడు కూడా కథ నడిచే కొద్దీ ఆ వాస్తవాన్ని గ్రహించాలని ప్రయత్నం. కానీ ఆ సినిమాటెక్ జర్నీ ఎక్కువై వర్గీస్–న్యాన్సీ మధ్య ప్రేమకథపై సినిమా ఫస్టాఫ్ లో ఎక్కువ దృష్టి పెడుతుంది. దాంతో “అసలైన నిజమైన కథ ఎప్పుడు మొదలవుతుంది?” అని ఎదురుచూస్తూంటాం.
దాంతో కథలో మూథంగ ఉద్యమం ఒక్కటే సెంటర్‌స్టేజ్ లోకి వచ్చేలా కాకుండా, అది ఓ నేపథ్య హంగుగా మాత్రమే మిగిలిపోవడం కొంచెం అసంతృప్తిని కలిగిస్తుంది. కానీ ఇలాంటి ప్రయత్నం మాత్రం ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు సినిమాపై అమాంతంగా గౌరవం పెరిగిపోతుంది.
అలాగే సినిమా క్లైమాక్స్ దశలో కథ మెల్లగా ఉత్కంఠను కదిలిస్తుంది. ప్రధాన పాత్ర వర్గీస్ ఓ సంక్లిష్టమైన స్థితిలో చిక్కుకుంటాడు — ఒకవైపు అతన్ని వదిలిపెట్టలేని విధి, పోలీసు యూనిఫాం... మరోవైపు అతని మనసు మాత్రం ఆదివాసీల కోసం తండ్రిలా మారిపోతుంది. ఆ ఆంతరంగిక సంఘర్షణే కథను మానవీయ స్థాయిలోకి తీసుకెళ్తుంది.
మరో పక్కగా ఇంకో ట్రాక్ కూడా నడుస్తుంది — వర్గీస్ మెల్లగా తన డిపార్టమెంట్ గురించి గ్రహిస్తున్న వాస్తవం. మౌనంగా జరిగే కుట్రలు, అధికారం వెనుక దాగిన అమానవీయతలన్నీ అతని కళ్ల ముందు నెమ్మదిగా తెరలేస్తాయి. సినిమా ప్రారంభంలో హీరో characterization పట్ల కొంత అసంతృప్తిగా ఉన్న నా లోపలి ప్రేక్షకుడే... ఆ యాక్షన్ బ్లాక్‌లో మాత్రం నిశ్శబ్దంగా తలవంచక తప్పనిసరి పరిస్దితి.
వాస్తవానికి ఈ సినిమాలో మనం చూడాలనుకున్నది ఒక చరిత్ర – కానీ మనకు చూపించిందొక వ్యక్తిగత ప్రయాణం. ఆ గ్యాప్ లో మిస్ అయిన నిజాలు మనల్ని ఇంకా వెంటాడతాయి.
టెక్నికల్ గానే...
సినిమాటోగ్రాఫర్ విజయ్ విజువల్స్ సినిమా పూర్తయ్యాక కూడా గుర్తిండిపోతాయి. ప్రత్యేకంగా, ఆదివాసీల ఆందోళన సన్నివేశాల్లో చూపించిన రా విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. అలాగే, విచారణ సన్నివేశాల్లో లైటింగ్, షాడోలతో సీరియస్ మూడ్‌ను బాగా క్యాప్చర్ చేశారు.
జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్. కథకు అద్దం పట్టేలా, ఎమోషన్లకు బలం చేకూర్చేలా మ్యాజిక్ చేస్తుంది. సౌండ్ డిజైన్ గురించి చెప్పుకుంటే రంగనాథ్ రవీ పేరు తప్పక చెప్పాలి. అడవి సన్నివేశాల్లో వినిపించే నిస్సబ్దత, ప్రకృతి శబ్దాలు చాలా రియలిస్టిక్‌గా ఫీలయ్యేలా చేశారు.
నటీనటుల్లో వర్గీస్ గాచేసిన టోవినో థామస్ పర్ఫామెన్స్ క్యారక్టర్ కు తగినట్లు జీవించాడు. నెగిటివ్ పాత్రలో తమిళ దర్శకుడు,నటుడు అయిన చేరన్ చాలా బాగా చేసారు. ఇక టోటల్ స్క్రీన్ టైం పరంగా తక్కువగా కనిపించినా, అందరికంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన నటుడు మాత్రం సురాజ్ వెంజారముడ్. బషీర్ గా గుర్తుండిపోయే పాత్ర చేసారు.
ఫైనల్ థాట్:
ఇందులో కొన్ని రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉండచ్చు కానీ ఈ సినిమా పూర్తిగా కమర్షియాల్టి కోసం కదిలే కథ కాదు — ఇది ఇప్పుడు కూడా ఆధారంలేని భూమిపై, తలదాచుకోలేని గుడిసెలో బతుకుతున్న ఆదివాసీ సమాజం కోసం రాసిన ఆవేదన. ఈ కథ లో చూపించిన ఫిక్షనల్ ముగింపు — వాస్తవంగా జరగాల్సింది కూడా అదే కావచ్చు. రెండు దశాబ్దాల క్రితం మూతంగలో జరిగిన ఘోరమైన పోలీసు దౌర్జన్యాన్ని మరోసారి తెరపైకి తీసుకురావాలన్న మానవీయ ప్రయత్నమే నరివెట్ట. అది అన్ని విధాలా పరిపూర్ణంగా ఉండకపోయినా, చెప్పదలచుకున్న విషయం మాత్రం విలువైనదే.
ఇది సినిమా కంటే ముందు, ఓ గుర్తు. ఓ శబ్దమయ్యే ప్రయత్నం. బలహీనులని చరిత్ర మరిచిపోకూడదన్న బలమైన కోరిక.
ఎక్కడ చూడచ్చు?
సోనీ లివ్ లో తెలుగులో ఉంది