ఈ వదనం.. కొంత ప్రసన్నమే!

సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ప్రసన్న వదనం’. సుహాస్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే..

Update: 2024-05-04 03:37 GMT

(సలీమ్ బాషా)

ఈ సినిమా "ప్రాసొపగ్నోసియా"("praasopagnosia") , అంటే మొహాలను గుర్తు పట్టలేకపోవడం, దాంతోపాటు ”ఫొనగ్నోసియా”(Phonagnosia) (గొంతులను గుర్తుపట్టలేకపోవటం) అనే చిత్రమైన లోపాలకు గురైన వ్యక్తి కథ. అమెరికా లాంటి దేశంలో దాదాపు 30 వేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉన్న వ్యాధి ఇది. ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాలు కొన్ని అరుదైన వ్యాధులను(ఉదా: "హాయ్ నాన్న") సంఘటనలను, కథల నేపథ్యంగా తీసుకోవడం ఒక క్రియేటివ్ పరిణామం. నటుడు సుహాస్ కూడా మొదట్లో చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టి, హిట్2 సినిమాతో విలన్‌గా మారి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగనీతులు లాంటి విభిన్నమైన సినిమాల్లో నటించి కొంత పేరు సంపాదించాడు. తన టాలెంట్‌ని నిరూపించుకున్నాడు.

తెలుగు సినిమా తెరపై ఇంతవరకు రాని సినిమా కథ గురించి చెప్పాలంటే.. రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య(సుహాస్) ఒక యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులు చనిపోగా తను మాత్రం బయట పడతాడు. అయితే తలకు తగిలిన గాయం వల్ల ఇంతకు ముందు చెప్పినట్లు రెండు అరుదైన వ్యాధులకు గురవుతాడు. ఎలాగోలా తన లోపాన్ని మేనేజ్ చేస్తూ స్నేహితుడు విగ్నేష్( హర్ష చెముడు) తో జీవితాన్ని గడుపుతుంటాడు. మధ్యలో ఆధ్యా(పాయల్ రాధాకృష్ణ) తో పరిచయమవుతుంది. ఒకరోజు సూర్య ఇంటికి వెళుతుండగా, ఒక వ్యక్తి అమృత(సాయి శ్వేత) అనే అమ్మాయిని లారీ కింద తోసేయడం చూస్తాడు.

ముఖం సరిగా కనపడదు కాబట్టి, దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె ఇంకా బతికే ఉంటుంది, పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని ఆమెకు నీళ్లు తాపిస్తాడు. తర్వాత ఆమె చనిపోతుంది. కథకు ఈ నీళ్ల బాటిల్ కీలకమవుతుంది. తర్వాత సూర్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా హత్య గురించి హకీంపేట పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడ ఎస్ఐ ఫోన్ చేసిన సూర్యను వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఎలాగోలా అతన్ని పట్టుకుంటాడు. తర్వాత సూర్యనే ఈ హత్య చేసినట్లు ఎస్సై.. సూర్య వెంటపడతాడు. సూర్య తప్పించుకోవడం, ఆ తర్వాత జరిగే సంఘటనలతో కథ నడుస్తుంది. చివరికి ఊహించని ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.

ఈ మధ్యకాలంలో యువ దర్శకులు వైవిధ్యమైన సబ్జెక్టులను ఎన్నుకుంటున్నారు. ఉత్సాహంతో సినిమాలు తీస్తున్నారు. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎన్నుకున్న సబ్జెక్టులను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో చాలా మటుకు విఫలమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పని చేసిన అర్జున్ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్టును ఎన్నుకున్నాడు. ముఖాలను గుర్తుపట్టలేని వ్యాధి తో పాటు, గొంతుని కూడా గుర్తుపట్టలేని రెండు అరుదైన వ్యాధుల కలయికతో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొని, దాన్ని ఒక థ్రిల్లర్‌లాగా తీయాలనుకుని అనుకున్న అర్జున్ కొంతవరకు సినిమాను ఉత్కంఠ భరితంగానే తీసినప్పటికీ, స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవడం వల్ల, రెండో సగంలో సినిమాను సరిగా నడపలేకపోవడంతో ఓ రకంగా నడిపిన మొదటి సగానికి ఉపయోగం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం సినిమాని చాలా స్లోగా నడపడం. పైగా కొన్ని సన్నివేశాలను (బాగున్నాయి గనుక) ఎక్కువసేపు చిత్రీకరించడం. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకు నిడివి ఒక సమస్య అయిపోయింది. అది దీనికి కూడా వర్తిస్తుంది. దాదాపు ఒక అరగంట సినిమా కత్తిరించి ఉంటే సినిమా కొంతవరకు థ్రిల్లింగా ఉండేదేమో.

పైగా ఇలాంటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్(ఈ సినిమా విడుదలకు ముందు సుహాస్ ఈ సినిమా గురించి ఇలానే చెప్పాడు) సినిమాల్లో మెయిన్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సినిమాలో అలా జరగలేదు . ఫుటేజ్ కోసం కొన్ని సన్నివేశాలను ఎక్కువ సేపు చిత్రీకరించడం వల్ల, సినిమా కథనం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లి పలుచబడిపోయింది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఆధ్యాతో చిత్రీకరించిన సన్నివేశాలు. యువతను ఆకర్షించడానికి చేసిన ఈ ప్రయత్నం, సినిమాను థ్రిల్లర్ నుంచి సాధారణ స్థాయికి తీసుకెళ్లింది. పైగా కథలో ఉన్న వివిధ కోణాలను చూపించడానికి చేసిన ప్రయత్నం చాలాసేపు సాగటం వల్ల సినిమా నిడివి పెరగడంతోపాటు, దాన్ని సాధారణ థ్రిల్లర్ సినిమాగా మార్చింది.

అయితే కొత్త రకమైన పాయింట్‌ని తీసుకొని దాన్ని సినిమాగా తీసే ప్రయత్నం కొంతవరకు సఫలమైందని చెప్పవచ్చు. సుహాస్ గతంలో నటించిన సినిమాలు చూస్తే నటుడుగా ప్రతి సినిమాకు మరింత మెరుగవుతున్నాడు. ఈ సినిమాలో కూడా ముఖాలు, గొంతులు గుర్తుంచుకోలేని వ్యాధి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చూపించాడు సుహాస్. నటనపరంగా సుహాస్‌కు మంచి మార్కులే వస్తాయి. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏసీపీ పాత్రలో వేసిన రాశి సింగ్. పాత్రకు ఉన్న డిఫెరెంట్ షేడ్స్‌ని చాలా బాగా చూపించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఈ అమ్మాయే. హర్యానా నుంచి వచ్చిన ఈ అమ్మాయి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉంది. ఆధ్యాగా నటించిన బెంగళూరు భామ పాయల్ రాధాకృష్ణ కూడా కొంతవరకు మెరిసింది. ఇతర పాత్రల్లో ఇదివరకు అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌లో విలన్‌గా వేసిన నితిన్ ప్రసన్న ఈ సినిమాలో కూడా ఎస్సై పాత్రలో విలనిజాన్ని బాగానే పండించాడు. మిగతా నటీనటులందరూ కూడా పర్వాలేదనిపించారు

యువ దర్శకుడు అర్జున్ ప్రతిభావంతుడైన దర్శకుడే. ఈ సినిమాతో పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా ఆక్సిడెంట్‌కు గురైన తర్వాత సుహాస్ అద్దంలో తనని తాను చూసుకునే సన్నివేశం క్రియేటివ్‌గా అనిపిస్తుంది. ఇటువంటి సినిమాకి మ్యూజిక్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ సినిమాలో సంగీతం కొంతవరకు బాగానే ఉంది. ఫోటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ని మెయింటెన్ చేసింది.

చివరగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ పాయింట్‌ను తీసుకొని కొంతవరకు వైవిధ్యంగానే చిత్రీకరించిన సినిమా ‘ప్రసన్న వదనం’. (వదనం అని పేరు పెట్టారంటే, అది ముఖానికి సంబంధించి ఉంటుందని ప్రేక్షకులకు అర్థం అవుతుంది). ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల కంటే ఈ సినిమా కొంచెం బెటర్. థ్రిల్లర్‌లను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మిగతా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని కొంతవరకు ఆస్వాదించవచ్చు.

తారాగణం: సుహాస్, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ, నితిన్ ప్రసన్న, కుశాలినీ పులపా, సాయి శ్వేత, నందు, వైవా హర్ష

రచన , దర్శకత్వం : అర్జున్ వై.కె

సంగీతం : విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: యస్ .చంద్రశేఖరన్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: మణికంఠ జె ఎస్, ప్రసాద్ రెడ్డి టి.ఆర్.

నిర్మాణసంస్థ : లిటిల్ థాట్స్ సినిమాస్

విడుదల తేదీ: మే 3, 2024

Tags:    

Similar News