'ఓం భీమ్ బుష్' తెలుగు మూవీ రివ్యూ

లాజిక్ లేకపోయినా మ్యాజిక్ చేసిన 'ఓం భీమ్ బుష్'

Update: 2024-04-02 13:48 GMT

ఈ వేసవి ప్రారంభమయ్యే మొదటి శుక్రవారం వచ్చిన మొదటి సినిమా ఇది.సినిమా పేరు లాగానే, సినిమా కూడా "నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్" ట్యాగ్ లైన్తో వచ్చింది. దీనితోపాటు రిలీజ్ కావాల్సిన అల్లరి నరేష్ సినిమా "ఆ ఒక్కటి అడక్కు" ఎందుకో వాయిదా పడింది. ముందుగానే చెప్పాలంటే ఈ ట్యాగ్ లైన్ దానికి సరిగ్గా సరిపోయింది. తెలుగు సినిమాల్లో శ్రీ విష్ణు వైవిధ్యమైన సినిమా కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకు మెచ్చుకోవాలి.అలాంటి మరో ప్రయత్నమే ఇది. మూడు ఫ్లాపుల తర్వాత "సామజ వర గమన" చిత్రంతో నవ్వించి హిట్ కొట్టిన శ్రీ విష్ణు మరోసారి లాజిక్ లేని ఫార్సికల్(ప్రహసనం)కామెడీ సినిమా ఎన్నుకొని మరోసారి ప్రేక్షకులను నవ్వించి హిట్ కొట్టాలనుకున్నాడు.

అర్థం పర్థం లేని కథ అయినా.. నవ్వులు కురిసాయి
ముందే చెప్పినట్లు లాజిక్ లేదు. అయినా ఈ మధ్య చాలా సినిమాల్లో లాజిక్ ఉండడం లేదు, కాబట్టి అది పెద్ద విషయం కాదు. అయితే సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుని నవ్వించిందో ముఖ్యం. ఆ విధంగా చూస్తే ఈ సినిమా చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. అస్సలు లాజిక్ లేని కథ గురించి చెప్పాలంటే, క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) అనే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఏ పని పూర్తిగా చేయని ఈ ముగ్గురు ఏదో ఒకటి చేస్తుంటారు. ఒక ప్రముఖ కాలేజీలో పీహెచ్ డి చేయడానికి చేరి కాలేజ్ ప్రిన్సిపల్ జీవితంతో ఆడుకొని, అతనే వీరి పీహెచ్ డి పూర్తి చేసేలా చేసి, కాలేజ్ నుంచి బయటికి వస్తారు. అలా వస్తూ మధ్యలో డీజిల్ అయిపోవడం వల్ల భైరవపురం అనే ఊర్లో సెటిల్ అవుతారు. " బ్యాంగ్ బ్రోస్" అనే ఒక సంస్థను పెట్టి ఆ ఊర్లో ఉన్న ప్రజల సమస్య ఏదైనా సరే తీరుస్తామని చెప్పి ఏదో చేస్తుంటారు. ఇది ఇంటర్వెల్ వరకు కథ. ఆ తర్వాత కథ ఊరి నుంచి షిఫ్ట్ అయ్యి ' "సంపంగి మహల్" అనే ఒక పాడుబడిన పెద్ద భవంతిలోకి వెళ్తుంది. అక్కడ జరిగే ప్రహసనం కొంతవరకు ముమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాను గుర్తుకు తెస్తుంది. అక్కడ అర్థం పర్థం లేని సన్నివేశాలతో కూడి, చివరకు ఆశ్చర్యకరంగా కొంత లాజిక్ ను సంతరించుకొని ఓబిబి 2(ఓం భీం బుష్2) ఉంటుందన్న సంకేతాలతో ముగుస్తుంది.
డైలాగులు- కౌంటర్లు బాగా పేలాయి
అయితే ఈ సినిమా ట్యాగ్ లైన్ లో చెప్పినట్లుగానే ఒక స్థాయిలో మ్యాజిక్ చేసినట్లే. చాలా చోట్ల థియేటర్లో నవ్వులే నవ్వులు. దీనికి కారణం మూడు ప్రధాన పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు, డైలాగులు, కౌంటర్లు. "దయ్యానికి దేవుడు వరమివ్వడమేంటి?" లాంటి సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ చెప్పిన " గాడ్స్ మస్ట్ బి లేజి", లాంటి డైలాగులు, ప్రియదర్శి చెప్పిన మాటలకి రైమింగ్ తో కూడి ఇచ్చిన కౌంటర్లు థియేటర్లో బాగా పేలాయి. సినిమాలో ఎక్కువ భాగం నవ్వులు కురిపించినవి ఇవే! ఈ విషయంలో ఇది బాగా సక్సెస్ అయింది. యువత దీని ఆస్వాదించే అవకాశం ఉంది.
కొంత బూతు.. మరికొంత బోల్డు
ఎంత లాజిక్ లేని సినిమా అయినా, కొన్నిచోట్ల డైలాగులు బూతుమయమయ్యాయి. మరికొన్ని సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. మరికొన్ని చోట్ల అసభ్యకరంగా ఉన్నాయి. ముగ్గురు మూత్ర విసర్జన చేసే సన్నివేశం అందులో ఒకటి. శ్రీ విష్ణు ప్రిన్సిపాల్ కూతురికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు. మరొకసారి రత్తాలు(ఆయేషా ఖాన్) పరిచయ సన్నివేశం(నిడివి కూడా కొంచెం ఎక్కువే), పిల్లలు పుట్టడానికి వారు చేసిన ట్రీట్మెంట్ హద్దులు దాటింది. ఈ సన్నివేశం థియేటర్లో యువ ప్రేక్షకులు అరుపులు కేకలు పెట్టడానికి కారణమైంది. ఇవన్నీ యువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చేమో గాని, మర్యాదపూర్వకంగా అయితే లేవు. అయినా ఈమధ్య ఓటిటిలలో వచ్చే సినిమాలు సీరిస్ లు చూస్తే ఇవే బెటర్ అనిపిస్తాయి. సినిమాలో సంగీతానికి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే సంపంగి మహల్లో సన్నివేశాలకు సంగీతం బాగానే కుదిరింది. ఫోటోగ్రఫీ కూడా ఇక్కడే కొంత మ్యాజిక్ చేసింది. మహల్లో దయ్యం సన్నివేశాలు ఆకట్టుకునేలా తీయడానికి ఫోటోగ్రఫీ ఉపకరించింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి
యువ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది
నటనాపరంగా ప్రియదర్శికి, రాహుల్ రామకృష్ణకు ఎక్కువ మార్కులు పడతాయి. రచ్చ రవి కొంత వరకు ఆకట్టుకుంటాడు. రెండో భాగంలో శ్రీ విష్ణు కొంత బాగా చేశాడు." ఫ్రస్ట్రేటెడ్ వుమన్" ఛానల్ ద్వారా తన వీడియోలను పాపులర్ చేసుకున్న సునైనా ఈ సినిమాలో మెరిసింది. అఘోర పాత్రలో షాన్ కక్కర్ పర్వాలేదు. ఆదిత్య మీనన్ పాత్ర ఎందుకో? ఇక శ్రీకాంత్ అయ్యంగార్ కు ఇలాంటి పాత్రలు మామూలు అయిపోయాయి. దెయ్యం సంపంగి పాత్రధారి నటన ఆకట్టుకుంటుంది.
కథకే లాజిక్ లేనప్పుడు, కథనానికి లాజిక్ వెతకడం హాస్యాస్పదం. కథ నిడివి తగ్గించి, కథనాన్ని కొంత మెరుగ్గా నడిపించి ఉంటే మరిన్ని నవ్వులు విరబూసేవి. అయితే ఈ సినిమా చాలావరకు ప్రేక్షకుల నుంచి నవ్వులు రాబట్టింది. యువ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. థియేటర్లో యువ ప్రేక్షకుల స్పందనే దీనికి నిదర్శనం. కాలక్రమేణా ఈ సినిమా హిట్ గా మారే అవకాశాలు లేకపోలేదు.


Tags:    

Similar News