నేను మధ్యలోనే లేచొచ్చేసిన సినిమాల గురించి నాలుగు మాటలు

నేను మానసికంగా కుదుటపడ్డానికి ఓ నెల పై దాకా పట్టేది...;

By :  Admin
Update: 2025-01-02 06:55 GMT

-రామ్. సి

బహుశా శీర్షిక చూసాక నేరుగా సబ్జెక్ట్ లోకి వెళ్లడం శ్రేయస్కరం, ఉపోద్ఘాతం అనవసరం. కానీ, తప్పేటట్లు లేదు..... ఏమనుకోమాకండి.

కొన్నాళ్లుగా నేను ఈ విషయాన్ని అప్పుడప్పుడు తమాషాకి కాకుండా, నాలోని సినిమా అభిమానికి జరిగిన అవమానంగా భావిస్తూ, అలా సినిమా మధ్యలో లేచి చేసిన కొన్ని సందర్భాల గూర్చి చెప్తుంటే, మీరు రాయండి అంటు సలహా పడేస్తూ, పట్టుబట్టిన కొందరు మిత్రులు, శిష్యులే కారణం.

మేము ముగ్గురు పిల్లలు పుట్టేంతవరకు కుదిరినప్పుడంతా, రోజు, వారం, వర్జ్యం అంటూ ఏవి చూడక సినిమాలు చూస్తూ అలవాటుపడ్డ అమ్మానాన్నలు, ఆ జన్యువును భద్రంగా అక్కను తమ్ముడిని కాక నన్నే చేరిందని నేటికీ నమ్ముతాను. నేను ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇలా కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఎవ్వరైనా ఖర్చు పెట్టి చూస్తున్న సినిమాను ఎంత రంపం కోతైనా మధ్యలో వదిలి వెళ్లడానికి ఇష్టపడరు, ఇంకొంచమే కదా అంటూ సర్దుకుపోతారు.కానీ, నాలాంటి సినిమా అభిమానికి, నాకెందుకో ఆ డబ్బు కన్నా , ఆ సినిమా మూలానా నా వెండి ఉత్సహంపై నీళ్లు చల్లినట్టు, ఏదో అవమానం జరిగినట్లు భావించేవాడ్ని, లేచ్చోచేసేవాడ్ని.

బహుశా తొమ్మిది ఏళ్లనుకుంటాను, 'బహుదూరపు బాటసారి' అలాంటి అనుభవానికి నా మొదటిదనుకొంటాను. దాసరి గారు తీరికగా, తోచినది రాసుకుంటూ, తీసినది తీసుకుంటే, ఏమి చేసినా చెల్లుబాటవుతుందని అనుకొన్నారు కాబోలు,ఒకే పదాన్ని తిప్పించి మళ్లించి, కొన్ని పాత సినిమాలకే మసిపూసి మారేడు కాయ చేసి, తిమ్మిని బమ్మిని చేసి, ఇది గొప్ప సినిమా అవుతుందని నటులకు చెప్పుకొని ఒప్పించి నటింపజేసిన చతురుడు ఆయన, అందరూ మంచి వాళ్ళుగా తయారయ్యంత వరకు ముగించకుండా, మధ్యతరగతి మనుషులంటే ఇంత చెత్తగా ఉంటారా అనిపించేలా తీసిన మహానుభావుడు, నా చిన్ని మనసు తట్టుకోలేక,నా బాట నేను థియేటర్ బయటికి వేసుకున్నాను. మారం చేస్తే ,నన్ను బయటకు తీసుకొచ్చి నాతోనే మిగతా సమయమంతా గడిపాడు. ఆ తర్వాత దాసరి నాగేశ్వరరావు ల కలయిక అంటే నాకు కొంచెం బెదురొచ్చింది.

పెరుగుతున్న కొద్దీ, సినిమా అంటే అభిమానం రూపుదిద్దుకొంది. సినిమా కన్నా దర్శకుడు ఎలా తీసుంటాడు, లాజిక్ ఏముంటుంది, సినిమాకు కథ అద్దారా, లేదా కథ సినేమయ్యిందా, నటులు ఖాళీగా ఉన్నారు కనుక తీశారా, ఇలా ఏవేవో ఆలోచనలు, అభిప్రాయాలు నాలోని అభిమానిని మలచుకొనే సాయి. సొంతంగానే సినిమాలకు వెళ్లడం మొదలయ్యాక, ఈ ప్రత్యేకత ఎక్కువవ్వ సాగింది. వెళ్లే సినెమాకు టికెట్ డబ్బు వసూలైయ్యిందా లేదా అన్న పాయింటు ప్రామాణికంగా మారడంతో మిత్రులతో పెద్ద గొడవలు జరిగిపోయేవి. నన్ను చూసి విసుక్కునేవారు, నా నస భరించలేక లేచొచ్చే వాళ్ళం.

'శివ' సినిమా వచ్చి మమ్మల్ని మార్చేసిన తర్వాత, రాంగోపాల్ వర్మ, నాగార్జున అనే పిచ్చి ఎక్కువైయింది.అంత పెద్ద సినిమా తర్వాత 'ప్రేమ యుద్ధం' అన్న సినిమా మమ్మల్ని చావగొట్టి నవరంధ్రాలోను తిక్క కథను చొప్పించిన ఆ కన్నడ దర్శకుడ్ని శపించి పారిపోయాం. ఆ యుద్ధ గాయాలతో బయటపడి మానుపుకొంటున్నామో లేదో, 'శాంతి క్రాంతి' మరో కన్నడ దర్శకుడు మాలోని శాంతిని భూస్థాపితం చేసి ,సినిమా అంటేనే భయాన్ని పరిచయం చేసెళ్లిపోయాడు. నా జీవితంలో అశాంతి తెచ్చిన ఏకైక సినిమా ఇది.దాంతో ఒళ్లే కాదు, మనసు, ఆలోచనలు సాహిత్యం వైపు పరిగెత్తాయి. పుస్తకాల్లో తలదూర్చి విశ్రమించే ప్రయత్నం చేస్తూ, మాకు మేము పునర్జీవం వరాన్ని ఇచ్చుకొన్నాం. చెత్త పుస్తకం చదువు వచ్చేమో కానీ, చెత్త సినిమా మాత్రం చూడలేం అనే స్థితికి వచ్చేసాం.

ఊరికే ఉంటే ఊరా పేరా అన్నట్టు, దర్శకుడు గుర్తులేదు, చిన్నా నటించిన 'పుట్టింటి పట్టుచీర' అనే సినిమా వద్దురా, రానంటే కూడా ,హాస్టల్ లో ఇంకా ఎవరు రాక పోవడంతో, వెళ్లవలసి వచ్చింది. ఓ అరగంటకి నేను మాత్రమే కాదు, అందరూ ఆ తేడాను తట్టుకోలేక పోయాం, అక్క తముళ్లంటే ఇంత బలహీనంగా ఉంటారా, వీరు చేసే పిచ్చి పనులు త్యాగాలంటారా, చిన్న విషయాలకే ఇలా ప్రవర్తిస్తారా అనుకొంటూ, వాళ్ళు ఏడ్చిన ఏడ్పులకు మా బట్టలు తడిసి ముద్దై పోవడంతో, ఆ అనుభూతి విద్వేషంగా మారకముందే , ఇంటర్వెల్ తర్వాత అక్కడి నుంచి తుర్రుమని పారిపోయాం. తిరిగొచ్చి,తడిసిన ఆ బట్టలు పిండుకోవాల్సి వచ్చిందంటే నమ్మాలి మీరు.

అతి వినయం ధూర్త లక్షణం అన్నారు, కానీ సినిమా వాళ్లు చేసే అలాంటిదానికి పేరులేదంటాను నేను. దానికి నిదర్శనమే ఈ రెండు చిత్రాలు. చిరంజీవే నటనకు స్వస్తి చెప్పి, కమర్షియల్ గా ఎదుగుతుంటే, ఓర్వలేక పోయారో ఏంటో, 'నేను నీలోని మహా నటుడ్ని వెలికితీస్తా' అంటూ విశ్వనాధ్ గారు తన పైత్యమంతా ఒలకబోసి ఓ సారి చిరంజీవితో 'ఆపద్భాందవుడు', వెనువెంటనే అనుకొంటా,' స్వాతి కిరణం' అంటూ మమ్ముటినీ మన మీదికి వదిలి దిక్కుమొక్కులేక, ఆ వ్యధ తట్టుకోలేక, ఆ నటనా పాశవికాన్ని ఆ నటులలో చూడలేక, మమ్మల్ని ఆదుకొనే భాంధవుడు కనుచూపు మేరలో కానరాక, మా పై ఏ సత్వం చూపకపొతే,పారిపోయిన కుదుటపడని మేము, హార్స్లీ హిల్స్ కు వెళ్లి ప్రకృతి చికిత్స చేసుకోవలసి వచ్చింది. తమకు కాలం ఇక చెల్లదని తెలిసీ, మన నటులు, దర్శకులు, నాయకులు, క్రీడాకారులు గత కీర్తినే ప్రస్తుతంలో వాడుకొంటూ, ఆ దుర్భిక్ష క్షణాల్లోనే ఉంటూ, మనపై ఏమాత్రం కనికరం చూపకపోవడం, మన అభిమానానికి అంటిన ఓ రొచ్చు మరక వీళ్లు.

తర్వాత కొంత కాలానికి, నేను సినిమాకు ఆచితూచి వెళ్లడం మొదలయ్యాక, ఆ రూలుకు స్వస్తి చెప్పించి నన్ను మోసుకెళ్లిన సినిమా 'మాతో పెట్టుకోకు'. 'ఒరేయ్ బాలకృష్ణ ముందే చెప్పాడు రా, మనం వినకుండా ఇలా రావడం క్షేమం కాదు' అంటూ, నేను మొత్తుకుంటున్న, నన్ను గేలిచేస్తూ గడిపేశారు. కానీ ఒక బాలకృష్ణనే భరించడం కష్టం, డబల్ రోల్ అయితే, ఇంకేముంది, పచ్చడి కిందకు కొట్టేశారు మమ్మల్ని. హీరోయిన్లు వెగటు పుట్టించే శరీర ప్రదర్శన ఒక వైపైతే, వెకిలి చేష్టలు చేస్తూ సహ నటులు, అతి ఆక్షన్ తట్టుకోలేక, ఇంకెకెప్పుడు నీవైపు రామని, నీ టైటిల్ లోని సూక్ష్మాన్ని గుర్తించి బతికేస్తామని ప్రమాణం చేసి బతుకు జీవుడా అంటూ పారిపోయాం. ఇందులో యాదృచ్చికమో ఏమో తెలియదు విల్లన్ రఘువరన్ తానే ఓ స్త్రీ పై చేస్తున్న దుశ్చర్య పై ఓ మాట అంటాడు 'అయ్యయ్యో, ఈ హింస నేను చూడలేకున్నానే' అంటూ కళ్ళకు నల్లని అద్దాలు పెట్టుకొంటాడు.అప్పుడు నేను కలగచేసుకుని, 'అరేయ్, చూడండి రా, ఇది మన కోసమే అన్నది రా, రండి రా ,ఆ హీరో కన్నా ఈ విలనే ఎంత మేలు, కాపాడుకొందాం' అన్నదానికి అందరు సహకరించడం మరిచిపోలేని సంఘటన.

(నేను సాహిత్యాన్ని, రాజకీయాన్ని ఎంత అభిమానినో, సినిమాకు అంతే అభిమానిని. కానీ, ఏ రచయితలకు, నాయకులకు, సినిమా వాళ్లకు కాదు.వీరందరూ నాకు ఎన్నో నేర్పారు, నన్ను మలిచారు. ఆలోచింపచేసారు .

నాలోని సామాన్యుడిని రూపుదిద్దారు)

నేను ఓ దశాబ్దం కిందటి వరకు, సెకండ్ షోలకు మాత్రమే వెళ్లడం అలవాటు. అప్పుడే నేను సినిమా పార్శ్యాలను సంపూర్ణంగా ఆస్వాదించగలను.

అలాంటి నేను మాట్నీలకు వెళ్లడం అపశకునంగా భావిస్తాను. పెళ్లి కెళ్ళి, తిరిగొస్తూ, ఆ నియమాన్ని మరిచి వెళ్లిన మరో దాసరి గారి అరాచక ముత్యం 'బ్లాక్ టైగర్'. కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరోగా తీసినది, నా మొదటి సినిమా కూడాను. దాసరి గారు కొంచెం ఒళ్ళు దేగ్గరెట్టుకొని తీసుంటారని నమ్మి ఓ పులి బోనులోనికి వెళ్ళాం. ఇంకేముంది, ఓ వంద పాత తెలుగు సినిమాలు కలిపి తీసిన సినిమా అది. న్యాయం, చట్టంకు దొరికిన ఏకైక వ్యక్తి హీరో అన్నట్టు, ఆ వ్యవస్థలు చేసే ఘోరాలు, అతని మీద తప్ప ఎవరి మీద చర్యలు తీసుకోవన్నట్టు రాసుకున్న కథనం, ఆ వెండితెర వేట నుండి తప్పించుకెందుకు ప్రయత్నిస్తూ, అలసిపోయిన మాకు, ఓ సన్నివేశంతో మేము అక్కడి నుండి తప్పించుకొన్నాం. కొడుకు కోసం ఓ పాల డబ్బా తీసుకెడుతూ జరిగిన ఫైట్ కారణంగా ఆ పిల్లాడు చనిపోతే, అప్పటికే మూలుగుతూ, చిక్కి శల్యమైన మేము చావు తప్పి కన్ను లొట్టపోయిన బ్లాక్ టైగర్ ఒక్క గెంతులో బయటపడి, ఆ అంటిన నలుపు తోముకోవడానికి చాలా కాలమే పట్టింది.

అది '95 బెంగళూరుకు ఏదో అలా షికారుకెళ్ళిన రోజులు.ఇలా దిగానో లేదో, అరే ,బ్లాక్ బస్టర్ అంటూ 'ఓం' అనే సినిమాకు వెళ్లాల్సొచ్చింది. అరుపులు, కేకలు, గోలలు డైలాగ్స్ గా, రణగొణ ధ్వని సంగీతంగా, ఓ మిక్సీలో వేసి చూపించినట్టు ఉండటంతో, ముందు నాకు వెగటు పుట్టుకొచ్చింది. తర్వాత ప్రేమంటే భయమేసింది, సినిమాలోని హింస నా పై జరుగుతున్నట్టు తోచి కంపరం పుట్టుకొచ్చింది. ఒక అమ్మాయి మోసం చేసిందని తెలిసి , ఓ తోటి విద్యార్థి తీసుకొనే ప్రతీకారమే పరిష్కారం అంటూ అల్లిన మహా రోత కథ అది. అప్పటికే నేను చేస్తున్న కామెంట్లకు,ఎక్కడ థియేటర్లోని అభిమానులు కొడతారని, నన్ను నోరు మూయించే ప్రయత్నం చేసి విసుగు చెందడం, ఇక కుదరక లే చెల్లి పోదాం అన్న పరిష్కారానికి ఒప్పుకొని బయటకొచ్చాక, నేను ఏదో ప్రశాంతతకు లోనై, మిన్నకుండి పోయి, వద్దన్నా వినకుండా ఆ హింసనెదుర్కొన్న ప్రేక్షుడిగా, గాయాలతో బస్సెక్కి ఊరు చేరుకున్నాను. నేను మానసికంగా కుదుట పడడానికి ఓ నెల పై మాటే అని చెప్పాలి.

ఇలానే మరో సారి మరో మిత్రుడితో కోలార్ కెళ్తే, ఆ ఓం దర్శకుడు ఇప్పుడు నటుడైయ్యాడు, బాగుందట, అంటూ లాక్కెళ్లారు. అదే 'ఉపేంద్ర'. నాకెందుకో ఎడమ కన్ను కొట్టుకుంటుంది రా, అంటే నవ్వుకొన్నారు. వెళ్ళాక అందరికి అన్ని భాగాలకు ఆ వారణాతీత చేరడంతో అప్పుడు తెలిసొచ్చింది, 'ఓం' సినిమాలో మిగిలిపోయిన, చెప్పని తిక్కను ,పిచ్చిని,పైత్యాన్ని కలిపి హంసాత్మకమైన కామెడీ కథగా మలిచి,ఏకంగా సమాజం పైనే సినిమా పేరుతో చేసిన అపహాస్యం, అసహ్యం. ఈ సారి సినిమా నుండే కాదు, అక్కడి నుండి ఒంటరిగానే మళ్లీ ఊరికి చేరుకున్నాను. పిచ్చోడి చేతిలో సినిమా అవకాశం అంటే ఏంటో తెలిసొచ్చింది. నేను భయపడే ఏకైక నటుడు ఉపేంద్ర,ఇప్పటికీను.

ఇలా సాగిపోతున్న ఓ పట్టులేని సమయంలో దొరికిపోయిన , ఎన్టీఆర్ గారి 'మేజర్ చంద్రకాంత్'. అది రాఘవేంద్రగారి ఫక్తు కమర్షియల్ సినిమాలో, ఒక వైపు మొదటి సారి సమాజంలోకి వచ్చినట్టుగా అనిపించే మిలట్రీ వ్యక్తిగా ప్రతి సన్నివేశంలోనూ తెలుగు ప్రేక్షకులకు ఆదర్శాల పై విపరీతమైన లెక్చర్ల్ ఇస్తూ తలనొప్పి తెప్పించేసారు, మరో పక్క మోహన్ బాబు వినోదం ముసుగులో sleaze గా ఉండే సన్నివేశాలతో, ప్రేక్షకులను ఆనందపరచిన ఆ నగ్మాకు దండం పెట్టి, ఇంటర్వెల్ లో సైకిళ్లు కష్టపడి తీసుకొని కుదిరినంత వేగంతో ఇంటికి చేరుకున్నాను.

Tags:    

Similar News