ఎమోషనల్ ఫిల్మే కానీ .. 3BHK సినిమా రివ్యూ !

ఈ కథ నిజంగా ఓ ఇంటి గురించేనా? లేక వేరేదైమైనానా? '3BHK' తాళం తీసి చూద్దాం.;

Update: 2025-07-07 03:28 GMT

 "3BHK" అనే టైటిల్‌ వినగానే... ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ హౌస్ గురించి ఎమోషనల్ డ్రామా అని అర్దమైపోతుంది. కానీ హీరోగా సిద్ధార్థ్ చేసారనగానే అంతకు మించిన సమ్ థింగ్ ఏదో స్పెషల్ ఉండే ఉంటుందనిపిస్తుంది. "బోయ్స్" నుండి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వరకు అతని సినిమాల్లో ఓ ఎమోషన్, ఓ rebel vibe ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన ‘చిన్నా’ తో తన రూట్ మార్చాడు. మరి ఇప్పుడు "3BHK" లో ఏం కొత్తగా చెప్పబోతున్నాడు? ఈ కథ నిజంగా ఓ ఇంటి గురించేనా? లేక వేరేదైమైనానా? '3BHK' తాళం తీసి చూద్దాం.

స్టోరీ లైన్

చెన్నై శివార్లలో నివసించే ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాసుదేవ్ (శరత్‌కుమార్) — ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తూ, తన జీవితపు ఏకైక కలను నెరవేర్చేందుకు శ్రమిస్తుంటాడు. ఆ కల మరేదో కాదు ఒక 3BHK సొంత ఇల్లు. తన భార్య శాంతి (దేవయాని), కొడుకు ప్రభు (సిద్ధార్థ్), కూతురు ఆర్తి (మీతా రఘునాథ్)తో కలిసి సాదాసీదాగా కనిపించే జీవితం వెనుక, ఒక నిశ్శబ్దమైన కల సాగుతూనే ఉంటుంది.

చాలా సంవత్సరాలుగా కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బుతో చివరికి ఓ ఇంటికి అడ్వాన్స్‌ కూడా చెల్లిస్తాడు. కానీ అదే సమయంలో అతడి కొడుకు ప్రభుకు ఓ ప్రతిష్ఠాత్మక కాలేజీలో సీటు వస్తుంది — ఫీజు కట్టకపోతే అవకాశం పోతుంది. కుటుంబం ఎటూ తేలని స్థితిలో నిలబడుతుంది. చివరికి తండ్రి తన కలను పక్కనబెట్టి కొడుకు భవిష్యత్తును ఎంచుకుంటాడు.

ఇక అక్కడినుంచే ప్రారంభమవుతుంది అసలైన ప్రయాణం — ప్రభు చదువు పూర్తయ్యిందా? ఉద్యోగం వచ్చిందా? తన తండ్రి త్యాగాన్ని గుర్తించి ఆ కలను తీర్చేందుకు ప్రయత్నించాడా? లేదా జీవితానికి మరో పత్యామ్నాయం ఎంచుకున్నాడా?

‘3BHK’ అనేది కేవలం గదుల గణాంకం కాదు. అది ప్రతి మధ్యతరగతి మనిషి గుండెల్లో నాటుకున్న ఓ లక్ష్యం. ఈ సినిమా — ఒక తండ్రి త్యాగం, కొడుకు బాధ్యత, కలలు కలిసి నిర్మించిన భావోద్వేగ గృహం. దాన్ని చూడాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కథ డైరక్ట్ గా ఓ కుటుంబం ఓ 3BHK కలతో మొదలవుతుంది. ఈ కథలో విలన్ ఎవ్వరూ కాదు… కానీ ప్రతి ఒక్కరికీ జీవితమే ఓ పరీక్ష అన్నట్లు కథ,కథనం నడుస్తుంది. అయితే ఈ కథను దర్శకుడు పూర్తిగా రియలిస్టిక్ గా చెప్పాలనే తాపత్రయంలో సాధారణ ప్రేక్షకుడుకి కావాల్సిన మినిమం ఎంటర్నైన్మనెంట్ ని పూర్తిగా ప్రక్కన పెట్టేసాడు. దాంతో ఎంగేజింగ్ గా అనిపించదు.అలాగే తెలిసిన విషయమే కావటంతో కొత్తగా ఎక్కడా అనిపించదు, ముందుకు వెళ్ళే కొలిది, ఆ కుటుంబ కష్టాలు చూసేకొలిదీ ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. దానికి తోడు నేరేషన్ టెంపో టీవీ సీరియల్ వైబ్ తో నడుస్తుంది.

నిజానికి సినిమా ప్రారంభం ఏదో రియలిస్టిక్ సినిమా చూస్తున్నామనే ఫీల్ కలగ చేసింది. మొదటి పది నిమిషాల్లోనే మనం వాసుదేవ్ ఫ్యామిలీకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాం. కానీ నెమ్మదిగా సాగే నారేషన్ వల్ల ఆసక్తి తగ్గుతుంది. Realism అంటే బోర్‌ కొట్టించటం కాదు కదా. ఫస్టాఫ్ కథ..సెటప్, క్యారక్టర్స్ ఇంట్రడక్షన్ , సమస్య గురించి చెప్పటం వల్ల ఇలా అయ్యింది అనుకుంటే సెకండాఫ్ కూడా ఇంకో రకం కష్టాలు చూపెడుతూ కథనం నడుపుతూంటారు.

సిద్దార్ద్ ఉద్యోగం, చెల్లి పెళ్లి, ప్రేమికురాలి ట్రాక్… ఇవన్నీ వేరుగా ఉన్న ఎపిసోడ్లలా కనిపిస్తాయి. ఇవన్నీ middle-class life లో ఉండే ఎమోషనల్ వాస్తవాలు అయినా, screenplay సరిగ్గా లేకపోవటం వల్ల చాలాసార్లు విడదీసిన chaptersలా అనిపిస్తాయి.

అయితే ప్రీక్లైమాక్స్‌లో ప్రభు తీసుకునే నిర్ణయం, అతడి ప్రయాణం సినిమా మొత్తానికి లైఫ్ ఇస్తుంది. చివరికి "శుభం" కార్డు కనిపించేటప్పుడు ఓ భావోద్వేగ సంతృప్తి కలుగుతుంది. కొందరికి హమ్మయ్య ఇప్పటికి అయ్యింది అనిపించవచ్చు. డైరెక్టర్ ...నేను కమర్షియల్ హంగులు లేకుండా, ఓ కుటుంబం కలలను నెరవేర్చుకునే విషయాన్ని స్లైస్ ఆఫ్ లైఫ్ అందించడానికి చేసిన ప్రయత్నించాను అనుకున్నరేమో కానీ కథలో స్పీడు లేకుండా ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉన్నట్లు కదలిక లేని కథను, ప్రెడిక్టబులిటీ ఉన్న ఇలాంటి సీన్స్ ను చూడటం కొంతమేరకు ఇబ్బందే.

మారుతున్న ప్రేక్షకుడుకి కథలో కన్నీరు ఉన్నా, స్క్రీన్ మీద దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూపించగలగాలి. రీసెంట్ గా వచ్చిన కుటుంబస్దాన్ చిత్రం అందుకు చక్కటి ఉదాహరణ.

టెక్నికల్ గా..

నిజాయితీ కథ రాసుకున్నా ఎగ్జిక్యూషన్ గ్రిప్పింగ్ గా లేకపోవటం, స్క్రీన్ ప్లే ప్లాట్ గా ఉండటం, ప్రజెంటేషన్ డ్రై గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక దినేశ్, జితిన్‌ల కెమెరా వర్క్ నీట్ గా బాగుంది. అమృత్‌ రామ్‌నాథ్‌ సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా స్పెషల్ గా కనిపిస్తుంది. తెలుగు డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో దర్శకుడే తన సినిమా పేస్ ఇలా ఉండాలని చెప్పి చేయించుకున్నట్లున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

సిద్ధార్థ్, శరత్‌ కుమార్‌ నటన బాగా చేసారు. ఆర్తి పాత్రలో మీతా రఘునాథ్ నటన చాలా నేచురల్ గా చేసింది. యోగిబాబుది గెస్ట్ రోల్.

ఫైనల్ థాట్

‘3BHK’ బలమైన కథేమీ కాదు.ఓ నిజాయితీతో కూడిన ప్రయత్నం అంతే. స్లైస్ ఆఫ్ లైఫ్ తరహా చిత్రాలు చూసే అలవాటు, ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది. మిగతా వారికి ఎంతకీ పూర్తికాని టీవి సీరియల్ ఫీల్ కలిగిస్తుంది.

Tags:    

Similar News