‘సత్యం, సుందరం’ మూవీ... ఒక సామాజిక పరిశీలన

ఒక సోషియాలజిస్టు, ఒక సినిమా డైరెక్షన్ నిఫుణుడు ఈ చిత్రం గురించి ఏమంటున్నారంటే...

By :  Admin
Update: 2024-11-14 11:27 GMT

సతీష్ & వంశీ

సత్యం సుందరం... అందరి చేత చప్పట్లు కొట్టించగలిగనప్పుడు దానిని గొప్ప కళ అంటారు. అదే కళ అందరిని ఏడిపిస్తే దానిని కళాఖండం అంటారు. ఈ మధ్య కాలంలో సత్యం సుందరం సినిమా అలాంటి కళాఖండం అని ఖచ్చితంగా చెప్పాలి. Sensationalismకి దూరంగా, ఒక లోతైన భావుకతతో తీసిన సినిమా ఇది. మూడు ఫైట్లు, ఆరు పాటలు, suspense, ఇలాంటి ఫక్తు పార్ములాలు లేకుండా, social media వలన చాలా ఎక్కువగా stimulate అయిన ప్రేక్షకులను రెండున్నర గంటలు సేపు ఏడిపిస్తూ కూచోబెట్టడం దర్శకుడు సాధించిన గొప్ప విజయం. అతనికి సత్యం, సుందరం పాత్రలను పోషించిన అరవిందస్వామి, కార్తీ ఇద్దరు కదకు అవసరమైనంత వరకు మాత్రమే జీవించారు.

మానవ సంబంధాల మీద చాలానే సినిమాలు వచ్చాయి గాని ఆధునిక జీవితాలపైన, తరాల మధ్య ఆలోచనలో ఉన్న తేడాలు, గ్రామం పట్టణాల మధ్య rupture, కాలంతో పాటు (వచ్చిన మార్పుల వలన) పరుగులు, stillness లేకపోవడం లాంటి విషయాలపైన సునిశిత పరిశీలనతో (clinical observation) రాయడం, దానిని ద్రశ్యరూపంలో తీసుకురావడం అంత చిన్న విషయమేమికాదు. కానీ దర్శకుడు ప్రేమ్ కుమార్ దానిని అలవోకగా అధిగమించాడు.

కొంచెం ఎక్కువ మాట్లాడితే, ఏందబ్బా, ఈ overaction గాడు, ఏంది మీద మీద పడి మాట్లాడుతున్నాడు అని, జిడ్డుగాడు అని నానారకాల మాటాలంటాము. అంటే అందరికీ వాళ్ళ space కావాలి, my own space. అయితే ఇది వినడానికి బానే ఉంటుంది కాని ఆ processలో అందరికీ దూరంగా మనమెవరమో మనకే తెలియనంత దూరంగా వెళ్ళిపోయాము. నిజానికి, చివరకి మనకు మిగిలేది hallow (బోల) space మాత్రమే.

సత్యం పాత్ర పరివర్తనం చాలా organicగా చూపించారు. అంటే చిన్నతనం లో జరిగిన సంఘటన వల్ల అతనిలో డెవలప్ అయిన cynicism, సినిమా మొదటలో సత్యం ముభావంగా ఉండటం, మనుషులతో తక్కువగా, ఎక్కువగా చిలుకలతో మరియు వేరే పక్షులు, జంతువులతో (ఎనుగు) సంభాషణల రూపంలో చూపించారు. ఆ తర్వాత సుందరం పరిచయం అవడం, తను చూపిన నిష్కలంకమైన ప్రేమ, సత్యాన్ని తన భయాన్ని వదులుకునేలా చేసి నిర్మొహమాటంగా తన మనసులోని మాటలను పంచుకోవడం చేస్తాడు. తనలో ఉన్న అసలు సత్యాన్ని కనుక్కోవడానికి మరొక మనిషి అవసరమెంతైనా ఉంది అని దర్శకుడు చాలా సృష్టంగా తెలియచేసాడు. సుందరం పరిచయం అయిన కొంత సమయం తర్వాత, అతనెవరో, పేరేంటో అప్పటికి తెలియకపోయినా, తన భార్యతో ఫోన్ మాట్లాడుతుంటే అతని భార్య అంటుంది "అప్పుడే భాష కూడా మార్చావు కదా." అని. ఇది సత్యానికి తెలియకుండానే జరిగిన విషయం. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం రోజు మన చుట్టూ ఉండే మనుషులతో ఎంత ఫేక్ గ, ముసుగేసుకొని ఉంటామో అర్థం అవుతుంది. క్రమంగా సత్యం తనది కానిది వదులుకొని నదిలో పారుతున్న నీటి ప్రవాహం మాదిరిగా మారి మాట్లాడే విధానం స్పష్టమవుతుంది.

సత్యం ఇంటికి తిరిగెళ్ళి సుందరంతో phoneలో మాట్లాడుతూ, 'నీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నా గురించి నేను తెలుసుకున్నాను', అని అంటాడు. అదే అతని పరివర్తన పరిణామ ప్రక్రియలో అంతిమ ఘడియల చిహ్నం. మానవ సంభంధాలను ఉల్లిపాయ పొరలను వొలిచినట్లు వొలిస్తే, చివరకు కన్పించే చిన్న గడ్డ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అలాంటి గడ్డ ఒకటి మానవ సంభంధాలలో కూడా ఉంటుంది. అది ఉల్లిపాయ లోపల కనిపించిన గడ్డలాగా కనిపించదు, దానిని అనుభవించాలి. ఆ లోతైన emotionను, అనుభవించాలంటే అహంకారం, స్వార్థం. పొగరు, లాంటి తెరలను పూర్తిగా ఒదులుకోవాలి. ఎంతలా అంటే పేరు తెలియకపోయినా ప్రేమించేటంత. ఈరోజుల్లో అది కష్టం లెండి. అది కష్టము అనే అవగాహనకు రావడమే గొప్ప విషయం, ఆ విషయాన్నే ఈ సినిమాలో ప్రేమ్ కుమార్ చాలా హృద్యంగా చూపించాడు.

ఒక సైకిలుని దేవుళ్లతో సమానంగా ఎందుకు పూజిస్తున్నారు? సైకిలును ఒక వస్తువుగా పూజించడం ఈ తరానికి తెలియని విషయమేమి కాదు. అయితే ఆ సైకిల్ ఇచ్చిన వ్యక్తి మీద ప్రేమ, అది చాలా సంవత్సరాల తర్వాత కూడా ఉండటం అనేది ఈ తరానికి మాత్రం అర్ధం కాని విషయం. అది తెలియని, అర్థం కాని అనుభంధం. Msg నచ్చిందా? అయితే save చేయడానికి swipe right, delete చేయడానికి swipe left, అంత సులభంగా మనుషులను వొదులేసుకుంటున్న ఈ రోజుల్లో ఎప్పుడో ఒక సైకిల్ ఇచ్చిన వ్యక్తి పేరు తనకు పుట్టబోయే బిడ్డకు పెట్టుకోవాలి అనే ఆలోచన, దానికి ఒప్పుకున్న భార్య ఉండటం, ఈతరంలో అయితే కొంచెం కష్టం, అరుదు అనే చెప్పాలి.

వస్తువులను అమితంగా ఆరాధించే (Commodity fetishism) మత్తులో ఉన్న ఈ తరానికి. లేదు, వస్తువులను ప్రేమించడం కాదు, మనుషుల్ని ప్రేమించాలి అని తట్టి మరీ చెప్పింది ఈ సినిమా. తట్టడం అంటే ఏదో భుజం తట్టడం కాకుండా, గుండె, ఎముకలు కదిలేలా ఒళ్ళంతా తట్టి మరీ చెప్పింది. ఒట్టి మనుషులతోనేన ఈ అనుబంధాలు, ఆప్యాయతలు, అంటే కాదు, జీవుడు ఉన్న ప్రతి జీవితో. రోడ్డు దాటుతున్న పాముతో సరదాగా హలో చెప్పడం, చెట్ల ఆకులను పలకరించడం, ఏనుగుతో కన్ను కన్ను కలపడం, ఇలా అన్నిటితో, అందరితో. ఈ సినిమా నిజంగా ఒక అనుబంధాల మాల.

Nostalgia అనే ప్రధాన అంశంగా ఈ సినిమా నడుస్తుంది. గతము, వర్తమానాలు విడదీయలేనంతగా పెనవేసుకుని ఉంటాయి. మనం ఏవి కోల్పోయామో, ఆ కోల్పోయింది పొందినవారు ఎదురొస్తే బాధతో కూడిన దుఃఖం, అలాగే ఎవరి నుండైన ఏదైన పొందిన, వారు ఎదురు పడితే వచ్చే ఆనందంతో కూడిన ధుఖం తన్నుకు వస్తుంది. ఈ రెండు భావాలను దర్శకుడు అలవోకగా రాస్తే, కార్తీ మరియు అరవిందస్వామి జీవించారు

ఊరు అనేది కొందరికి అనుభూతి, తాటాకు చెట్లు, సంపెంగ, జామ, కనకాంబరాల చెట్లు లేని ఇల్లు ఉండేవి కాదు ఊర్లలో, ఇప్పుడు పరిస్థితి మారిందిలెండి, ఊరెళ్ళిపోతా మావ పాటలో చెప్పిన్నట్లు. చదువుకు మరీ ఎక్కువుగ ప్రాముఖ్యతను ఇచ్చి, ఊర్లలోనే ఉండే వృత్తులను చంపేసి, చేతి వృత్తుల గురించి చదువుకున్న పుస్తకాల్లో లేక, చదివిన చదువులకు ఊళ్ళలో ఉద్యోగాల లేక, వ్యవసాయం చేయడానికి భూమి లేక, అసలు వ్యవసాయమే దండగ అనే పరిస్థితిలో దిక్కు తోచక చివరికి పుట్టిన ఊరును, కన్న తల్లితండ్రులను, అన్నింట్లో తోడున్న తోబుట్టువులను, స్నేహితులను విడిచి పొలొ మంటూ మందలు మందలుగా వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఇలానే ఊరుతో disconnect అవ్వడం జరిగింది. 19వ శతాబ్దం మధ్య నుండి British వారి మూలానా కొత్త ఉద్యోగాలు, వాటి కోసం వలసలు, అలా కొత్త పట్టణాలు వెలవడం, ఆ processలో ఊరు ఒక metaphor అయింది. ఈ విషయాలు ఇంతకు ముందు చాలా సినిమాల్లో romanticise చెయ్యడం లేదా commercial కోణంలో చూపించారు. మిగతా సినిమాలకు ఈ సత్యం సుందరం అక్కడే తేడా.

అలాగే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది ఆస్తి మాత్రమే కాదు. తరాల అనుభవాలు, అనుభూతులు, గుర్తులు. అంతర్లీనంగా ఇల్లు కూడా ఈ సినిమాలో ఒక running కారెక్టర్. అరవింద స్వామి చిన్నప్పుడు ఇల్లు ఖాళీ చేయడం, తర్వాత భార్యతో ఇల్లుని కొనుక్కుందాం అని మాట్లాడటం, కార్తీ ఇల్లుని చూపించిన విధానం-అదేదో ప్రకృతి లో మమేకమైనట్టు. (మిధునం సినిమాలోలాగా). ఇల్లుని ఏదో ఒక లొకేషన్ లాగా కాకుండా సినిమాలో ఒక పాత్ర గా చూపించడం చాలా బాగుంది.

చివరిగా, positivity కి toxic positivity కి మధ్య జరుగుతున్న సందిగ్ధతలో ఈ సినిమా వచ్చి ఆ రెండింటి మధ్య ఉన్న సన్నని దారాన్ని లాగేసింది. 'ఆ నలుగురుని క్షమించి వదిలేసేయ్ బావ', 'అంతా ఆ పాపిష్టి డబ్బు వలన వచ్చిన కష్టాలు', ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఆణిముత్యాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సినిమా ఇద్దరు సామాన్యుల కధ. అన్నింటిలో చిన్న చిన్న ఆనందాలు వెతుకుతునే వాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడండి, అలాగే వినడానికి కూడా ప్రయత్నించండి.


(Satish, teaches sociology at Centre for studies in social sciences Kolkata & Gedela Mohana Vamsi (graduated in Film Direction from Satyajit Ray Film Institute, Kolkata)


Tags:    

Similar News