“సంతాన ప్రాప్తిరస్తు” రివ్యూ
థీమ్ బోల్డ్… హాస్యం హాఫ్… ఎమోషన్ ఎక్కడ?
హైదరాబాద్ ఐటీ వరల్డ్‌లో తనదైన ప్రపంచంలో నిశ్శబ్దంగా బ్రతుకుతూంటాడు చైతన్య (విక్రాంత్)… చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతనికి జీవితం మొత్తం ‘సైలెంట్ మోడ్’. మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. అమ్మాయిలంటే? – హార్ట్‌బీట్ ఎర్రర్!! అలాంటి ఈ ఇంట్రోవర్ట్ గై జీవితంలో, ఓ ప్రభుత్వ పరీక్ష కోసం నగరానికి వచ్చిన కల్యాణి (చాందిని చౌదరి) ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తుంది. ఒక చూపు… ఒక క్షణం… చైతన్య గుండె హ్యాంగ్ అయిపోతుంది. ముందు అపార్థం… తర్వాత అర్థం. ముందు దూరం… తర్వాత దగ్గర. చైతన్య మంచితనం కల్యాణిని తనవైపు లాగేసుకుంటుంది.
కానీ స్టోరీలో అసలైన విలన్? కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్). “సాఫ్ట్‌వేర్ వాళ్లూ స్టేబుల్ కాదు… నా అమ్మాయకీ గవర్నమెంట్ జాబ్ అబ్బాయే కావాలి!” అన్న ఫిక్స్‌లైన్‌తో ఈ ప్రేమకథకు పెద్ద బ్లాక్. అమ్మాయి తండ్రి ‘నో’ అన్నా… ప్రేమ ‘యెస్’ అంటుంది. జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటుంది.
ఇక్కడే కథ ఇంటెన్స్‌కి మారుతుంది. చైతన్య ఒక నిర్ణయం తీసుకుంటాడు— “మనల్ని కుటుంబం తిరిగి అంగీకరించాలంటే… బిడ్డ పుడితే చాలు.” కానీ అదృష్టం కూడా సినిమాలో సీన్స్ లాగే ఆగిపోయింది. అక్కడక్కడే తిరుగుతోంది… ఎన్నో ప్రయత్నాలు — ఫలితం జీరో. చివరకు సంతాన సాఫల్య కేంద్రం. పరీక్షలు. రిపోర్ట్. షాక్.
చైతన్య స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ. తనమనసు విరిగిపోతుంది… కానీ కల్యాణికి చెప్పలేడు. ఆమె కల “తల్లి అవ్వాలి”… అతని భయం “నేను అసలు విషయం చెప్పితే ఆమె ఏమవుతుందో?”
అదే సమయంలో తిరిగి రంగంలోకి వస్తాడు ఈశ్వరరావు… ఈ సారి మాటలతో కాదు, ఛాలెంజ్‌తో. “100 రోజుల్లో మీ ఇద్దర్నీ విడగొట్టి తీరతా!”
అంటూ బాంబు పేలుస్తాడు. అప్పుడు ఏమౌతుంది. ఈ ప్రేమజంట తాము కోరుకున్నట్టుగా తల్లిదండ్రులవుతారా? లేక వంద రోజుల్లోనే విడిపోయే జంటల లిస్టులో చేరిపోతారా? అనేది తెలియాలంటే ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ కథ బోల్డ్-కామెడీ + ఎమోషనల్ డ్రామా అనే రెండు ట్రాక్‌లు కలిపి నడిచే జానర్. ఈ జానర్ చాలా tricky. ఎందుకంటే: బోల్డ్ కాన్సెప్ట్ అంటే హాస్యం, స్వేచ్ఛ అవసరం. సంతాన సమస్య అంటే భావోద్వేగం, నిశ్శబ్దం, మనిషి నిగ్గు తేలే సన్నివేశాలు అవసరం. ఈ రెండు ఒకేసారి బ్యాలెన్స్ చేయడం కష్టం. డైరెక్టర్ ప్రయత్నించాడు… కానీ టోన్ ని సరిగా లాక్ చేయలేకపోయాడు.
ఉదాహరణకు:
“Vicky Donor” ఒకే టోన్: quirky, unapologetic comedy.
“Badhaai Ho” మరో టోన్: realistic family emotion.
కానీ “సంతాన ప్రాప్తిరస్తు” లో టోన్ ఇలా మారుతుంది: ప్రారంభంలో quirky, మధ్యలో రొటీన్ రొమాంటిక్ కామెడీ, తరువాత సీరియస్, మళ్లీ కామెడీ, క్లైమాక్స్ లో సెంటిమెంట్, ఇలా టోన్ consistency లేకపోవడం వల్ల కథ వెయిట్, ఫన్ రెండూ సరిగ్గా సింక్ అవ్వలేదు. సినిమా మొదటి 30 నిమిషాల్లో ప్రామిస్ చేసిన unique flavour… మిగిలిన 60 నిమిషాల్లో కనిపించలేదు.
INCITING INCIDENT — హీరో సమస్య (low sperm count) చాలా late గా రావడం ఈ కథలో ప్రధాన సమస్య. Screenplay పాఠంలో ఒక లైన్ ఉంది: “Core conflict should arrive before the audience settles into comfort.” ఇక్కడ 50% సినిమా అయిపోయిన తర్వాతే అసలు కాన్సెప్ట్ బయటికొస్తుంది. ఈ లేటు వల్ల రెండు సమస్యలు క్రియేట్ అయ్యాయి: ప్రేక్షకుడు ముందే "థీమ్" అంచనా వేసి వస్తాడు కాబట్టి ఆసక్తి తగ్గుతుంది. అసలు కాంప్లిక్ట్స్ ఎక్సప్లోర్ చెయ్యడానికి డైరక్టర్ కి స్క్రీన్ టైమ్ తక్కువగా మిగిలింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం పాత్ర లు పనిచేసాయి కానీ… వాటిని సన్నివేశాలు క్యారీ చేశాయి, స్క్రీన్‌ప్లే కాదు. ఓవరాల్ గా ఒక "bold idea" కి సరిపోయేంత "bold writing" రాలేదు.
టెక్నికల్ గా..
విక్రాంత్ కి అద్బుతం కాదు కానీ బాగా చేసాడు. చాందిని చౌదరి ఫెరఫెక్ట్. తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ ఎప్పటిలాగా బాగా చేసారు. వెన్నెల కిషోర్ కామెడీ కొద్దిగా నవ్వించింది. తరుణ్ భాస్కర్ బాగా చేసాడు ..కానీ కథకు పెద్దగా ఉపయోగపడినట్లు అనిపించలేదు.
మిగతా విభాగాల్లో పాటలు జస్ట్ ఓకే. రైటింగ్ సోసోగా ఉంది. కామెడీ డోస్ సరిపోలేదు. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ చేయచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్దాయికి తగినట్లు ఉంది.
ఫైనల్ థాట్
ఇది ఒక బోల్డ్, అవసరమైన, సొసైటీకి రెలవెంట్ కథ. పురుషుల fertility సమస్య గురించి కామెడీ–ఎమోషన్‌తో మాట్లాడటానికి సాహసించిన సినిమా ఇది. కానీ… ఎంత బలమైన పాయింట్ ఉన్నా, అది పనిచేయాలంటే అదే బలం ఉన్న రైటింగ్ కావాలి. ఇక్కడ కాన్సెప్ట్‌కు ఉన్న దమ్ము — స్క్రీన్‌ప్లే ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా రాలేదు.
సినిమా చూసాక ఇలా అనిపిస్తుంది: “డైరక్టర్ కు మనసులో చెప్పాలనుకున్నది చాలా ఉంది ; కానీ తెరపై చెప్పడానికి వెనుకాడినట్టు అనిపించింది.”