'రామం రాఘవం' OTT మూవీ రివ్యూ!
ఈ సినిమా కథేంటి, ఎవరెలా చేసారు వంటి విషయాలు చూద్దాం.;
జబర్థస్త్‌తో పాటు అనేక కామెడీ షోలలో సినిమా కమిడియన్ గా అలరించిన నటుడు ధన్ రాజు. బలగం వేణు నటుడు నుంచి దర్శకుడుగా మారి సక్సెస్ ఇచ్చిన ప్రేరణతో ఇప్పుడు డైరక్టర్ గా మెగాఫోన్ పట్టి సినిమా చేసాడు. అతను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల ఫిబ్రవరి 21న రిలీజైన ఈ చిత్రం థియేటర్ లలో పెద్దగా పోలేదు. దాంతో ఇప్పుడు ఓటిటిలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా కథేంటి, ఎవరెలా చేసారు వంటి విషయాలు చూద్దాం.
స్టోరీలైన్
సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకుంటాడు. తన కొడుకు రాఘవ(ధన్‌రాజ్)ని ప్రాణంగా చూసుకుంటాడు. డాక్టర్‌ని చేయాలని అనుకుంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ బేవర్స్ గా తయారవుతాడు. అంతేకాకుండా ఈజీ మనీ కోసం అనేక తప్పులు,అప్పులు చేస్తుంటాడు. బిజినెస్ చేయడానికి తండ్రి ఇచ్చిన 5 లక్షలను పోగొట్టుకుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. దాంతో తండ్రి మీదే పగ పెంచుకుంటాడు.
స్టేషన్ నుంచి బయిటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన ఆ తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్‌లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది ఎరికి వాళ్లు తెచ్చుకోవాల్సిందే అని డైరక్టర్ చెప్పాలని తాపత్రయంతో చేసిన సినిమా ఇది. చెడు అలవాట్లకు బానిసై కుటుంబాలను, తల్లి,తండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేసే స్దాయికి దిగజారుతున్నారు. రాఘవలాంటి పాత్రలు సమాజంలో కనపడుతూనే ఉంటాయి. అలాగే రామం లాంటి తండ్రులు కూడా గుర్తు వస్తారు. తండ్రి, కొడుకు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఈ కథలో ప్రేక్షకుల వైపు నుంచి తండ్రి హీరో .. కానీ కొడుకు పాత్ర వైపు నుంచి ఆ తండ్రినే విలన్ గా చూపించగలిగారు. ఈ రెండు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది .. దాంతో సినిమాలో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. అయితే అక్కడక్కడా కన్నీళ్లు పెట్టించే సీన్స్ మాత్రం మనస్సుని తడతాయి.
టెక్నికల్ గా
దర్శకుడుగా ధన్ రాజు తొలి చిత్రం అయినా బాగా చేసాడు. అయితే తనే హీరోగా చేయకుండా ఉండి ఉంటే మరింత దృష్టి పెట్టే అవకాసం ఉండేది. ఇక ఈ కథకు అరుణ్ చిల్లివేరు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పెద్దగా ఎక్కవు.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ జస్ట్ ఓకే . ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
నటుడుగా ధన్ రాజ్, సముద్ర ఖని బాగానే చేసినా కమర్షియల్ అప్పీల్ సినిమాకు రాలేదు. సత్య అక్కడక్కడ నవ్వించాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర లెంగ్త్ తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
చూడచ్చా
మరీ తీసిపారేసేది కాదు, అలాగని వెంటనే చూసేయాలి అనిపించేటంత సినిమా కాదు. అయితే ఫ్యామిలీ కో కలిసి చూడవచ్చు.
ఎక్కడ చూడాలి
ఈటీవీ విన్ ఓటిటిలో తెలుగులో ఉంది.