కదిలించి కలవరపెట్టే సినిమా '23'
మూవీ రివ్యూ. ఈ చిత్రం మే నెల 16 న హిందీ, తమిళ భాషలలో కూడా విడుదల కాబోతుంది.;
-శివలక్ష్మి
ఇతివృత్తం: మన కళ్ళముందే జరిగిన మూడు వేర్వేరు సామూహిక హత్యలను ప్రస్తావిస్తూ, ప్రధానంగా చిలకలూరిపేట బస్సు దహనం సంఘటనలో మరణించిన 23 మంది, దానికి కారణమైన వారి వాస్తవ జీవిత నేపథ్యాల నుండి ప్రేరణ పొంది తెలుగులో రూపొందించిన ఒక సోషల్ డ్రామా చిత్రం "23". ఈ చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ. ఈ సినిమాలో తేజ - తన్మయి కథా నాయకా - నాయికలుగా ప్రధాన పాత్రలు పోషించారు. స్టూడియో 99 నుంచి ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.
మీరు చూసిన మూడు సామూహిక హత్యాకాండలు 1991 లో చుండూరు మారణ కాండ, 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 1997 లో జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అంటూ మనలో చాలామందికి చిరపరిచితులైన లాయర్ చంద్రం మాటలు వినిపిస్తాయి. హతులందరి కథా ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా? మన సమాజంలో చట్టం నిందితులందరికీ ఒకేరకంగా అమలవుతుందా? అనే ప్రశ్న వేస్తారు. పోస్టర్ లో కూడా కనిపించే ఈ ప్రశ్నే ఈ చిత్రానికి ఆయువు పట్టు!
అసలు సంఘటన పూర్తి వివరాలకోసం వెతికితే వికీపీడియా ప్రకారం;
చిలకలూరిపేట బస్సు దహనం ఘటన: 1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు మార్చి 8 తెల్లవారు ఝామున నర్సరావుపేటలో ఆగి, 4:10 కి తిరిగి బయలుదేరింది. పట్టణం లోని రైల్వే క్రాసింగు వద్ద సాతులూరి చలపతిరావు, గెంటెల విజయవర్ధనరావు అనే ఇద్దరు వ్యక్తులు బస్సెక్కి చిలకలూరిపేటకు టిక్కెట్టు తీసుకున్నారు. కొంతదూరం ప్రయాణించాక వారిద్దరూ బస్సులో పెట్రోలు విరజిమ్మారు. అది గమనించి బస్సు డ్రైవరు లైట్లు వేసి, బస్సును ఆపాడు. వారిద్దరూ కిందికి దిగిపోతూ అగ్గిపుల్ల వెలిగించి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 32 మందిలో 23 మంది సజీవదహనమై పోయారు. మిగిలినవారు తప్పించుకోగలిగారు. తప్పించుకున్నవారిలో ఇద్దరిని దుండగులు వెంటాడి, వారివద్ద నున్న డబ్బును దోచుకున్నారు. నిందితులిద్దరినీ మార్చి 18 న పోలీసులు పట్టుకున్నారు.
విచారణ, శిక్ష: గుంటూరు సెషన్సు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రెండేళ్ళ విచారణ తరువాత, 1995 సెప్టెంబరు 7 న నిందితులిద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. దోషులు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అది కింది కోర్టు విధించిన శిక్షను ధృ వీకరించింది. దోషులు తిరిగి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోగా, 1997 ఆగస్టు 28 న అక్కడ కూడా శిక్షను ధ్రువీకరించారు. తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ దోషులు రాష్ట్రపతికి విన్నవించుకోగా, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కూడా దాన్ని తిరస్కరించాడు.
ఉమ్మడి రాష్ట్రం లోని న్యాయవాదులు, వివిధ మానవహక్కుల నాయకులు, ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు, పౌరులు, ప్రజాస్వామిక వాదులు చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్షను రద్దు చేయాలని అనేక ఉద్యమాలు చేశారు. గుంటూరు న్యాయవాది చంద్రం గారు చాలా పట్టుదలగా గొప్ప కృషి చేశారు. అవి విఫలమై దోషులకు ఉరిశిక్ష అమలు చేయవలసిందిగా 1998 మార్చి 29 వ తేదీ నిర్ణయించారు.
అయితే ఒక్క రోజు ముందు, మార్చి 28 న, రచయిత్రి మహాశ్వేతాదేవి, రాష్ట్రపతి నుండి జ్ఞానపీఠ పురస్కారం అందుకునే సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పోరాటాలు ఆమెకు తెలిసి ఉండడం వల్ల దోషుల తరపున మరొక క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ వెంటనే, క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నందున, చాలా ఆశ్చర్యకరంగా దానిపై నిర్ణయం వెలువడే వరకు ఉరితీతను ఆపాలని సుప్రీం కోర్టులో ఒక కేసు వేసారు. సుప్రీం కోర్టు వెంటనే దాన్ని విచారించి, ఉరిని ఆపాలని తీర్పునిచ్చింది.
ఆ రాత్రే ఈ తీర్పును జైలు అధికారులకు పంపగా, మరుసటిరోజు తెల్లవారుఝామున అమలు చెయ్యాల్సిన ఉరిని ఆపారు. ఆ తరువాత వచ్చిన రాష్ట్రపతి, కె.ఆర్.నారాయణన్ ఆ క్షమాభిక్ష అభ్యర్థనపై స్పందించి, దోషులిద్దరికీ క్షమాభిక్ష ప్రసాదించారు. దానితో ఉరిశిక్షను యావజ్జీవ జైలుశిక్షగా మార్చారు.(వికీపీడియా కథనానికి నేను తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఉధృతమైన ఉద్యమాలను ప్రస్తావించాను).
చిత్ర కథలో ఇద్దరు స్నేహితులు చలపతి, విజయవర్ధనరావులు పేదరికంతో పనికోసం, బతుకుతెరువు కోసం నిత్యం వెతుకులాడుతుంటారు. ఇందులో చలపతికి ఒక ప్రియురాలుంటుంది. ఆమెకు నా అన్నవాళ్ళెవరూ ఉండరు. తన జీవికకోసం ఆమె కూలికెళ్తూ ఉంటుంది. చలపతి ఒక ఇడ్లీ షాప్ పెట్టుకుందామని పర్మిషన్ ఇప్పిస్తానన్న దళారికి కష్టపడి కూడబెట్టిన వెయ్యి రూపాయలు ఇచ్చి అతను అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అంటూ వాయిదాలేస్తూ ఉంటాడు.
గట్టిగా అడిగితే నీకసలు పర్మిషనే రాదని బెదిరిస్తూ చివరికి మోసం చేస్తాడు. ఇంట్లో చూస్తే కొడుకు సంపాదించడం లేదని, అతన్ని చూడగానే కొడుకు ఎందుకూ చేతగాని వాడంటూ తిట్టిపోస్తుంటాడు తండ్రి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు ఓదార్పుగా ఉండి సేద తీరుతున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి తాను గర్భవతిననే కబురు చెప్తుంది. ఇన్ని దరిద్రాలు చుట్టుముట్టిన సందర్భంలో చలపతి, విజయవర్ధనరావులకి గత్యంతరం లేని పరిస్థితిలో ఈ బస్సు ఆలోచన వస్తుంది. దరిద్రంలో ఉన్నవాళ్ళకి ఒక చిన్న ఆలోచనతో జరిగిన అనుకోని సంఘటన ఒక జీవితకాలపు నరకానికి ఎలా దారితీస్తుందో అనే విషయాన్ని దర్శకుడు చాలా హృద్యంగా దృశ్యీకరించారు.
ఇక జైళ్ళలో ఖైదీల జీవితాల గురించిన కధనాన్ని కూడా మన ఆలోచనల విస్తృతిని ప్రభావితం చేసేలా చిత్రీకరించారు. చలపతి మంచి భావుకుడు. చదవడం, రాయడం అంటే ఇష్టం. అది గమనించిన కొత్తగా వచ్చిన జైలు అధికారి చలపతికి లైబ్రరీ పని అప్పజెబుతాడు. కానీ స్నేహితులిద్దరూ తమ తప్పు తెలుసుకుని 32 సంవత్సరాలుగా పశ్చాత్తాపంతో కుంగిపోతూనే ఉన్నారు. ఇక చలపతి ప్రియురాలు లాయర్ చంద్రం గారి సహాయంతో పాపకు జన్మనిస్తుంది. పెళ్ళి కాని తల్లికి పుట్టిన పాప అని తన పాపను మధ్యతరగతి మనస్తత్వాలతో సమాజం అనరాని మాటలంటుందనే భయంతో దత్తత ఇచ్చేస్తుంది. లాయర్ చంద్రం గారి సహాయంతో తనకిష్టమైన నర్సు కోర్స్ చేసి స్థిరపడుతుంది. జైలుకి వచ్చి ఆమె చలపతిని కలిసిపోతూ ఉంటుంది. ఎంతగానో కృషి చేసిన లాయర్ చంద్రం నేను ఉరిశిక్ష కేస్ నుంచి చలపతి, విజయ వర్ధనరావులను తప్పించలేకపోయానని బాధపడుతూ కేన్సర్ సోకి చనిపోతారు. ఉరిశిక్షకు ముందు రోజు మాత్రం తలిదండ్రులు చూడడానికొస్తారు. నేను బతికుండగా మిమ్మల్ని చూస్తాననుకోలేదు అంటూ కుమిలిపోతాడు చలపతి. వాళ్ళు కూడా దుఃఖపడతారు. చివరి కోరికగా కూతుర్ని చూడాలనుకుంటాడు. జైలు అధికారి పాపను ఆమెను పెంచుతున్న తలిదండ్రులతో జైలుకి పిలిపిస్తాడు. కళ్ళనిండా చూసుకుని, పాప పెద్దయ్యాక రచయితను కావాలనుకుంటున్నానని చెప్పడంతో సంతోషపడతాడు.
జైళ్ళలో కులవ్యవస్థ: ఇక మిగిలింది జైలు జీవితం! జైళ్ళలో కూడా దళితుల పట్ల అధికారుల పెత్తనం ఎంత హీనంగా ఉంటుందో అనే విషయాన్ని పరమ మురికిగా, దుర్గంధ భూయిష్టంగా ఉన్న టాయిలెట్లు కడగమని వీళ్ళిద్దరికీ పురమాయించే దృశ్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మొదట్లో నరకయాతన పడి, నెమ్మదిగా అలవాటు పడతారు.
ధనికుల దౌర్జన్యాలు-పేదల ఆక్రోశాలు: చుండూరు ఘటనలో అయితే ఒక సినిమాహాలులో దళితుడి కాలు పొరపాటున అగ్రకుల అమ్మాయికి తగిలిందనే నెపంతో అతను క్షమాపణ చెప్పినప్పటికీ వెంటాడి, వేధించి, అతన్నే గాకుండా ఆ ఊరి దళితుల్ని ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచులలో వేసి వాటి మూతులు బిగించి కట్టారు. వాళ్ళకు శిక్షలు పడ్డాయో లేదో తెలియదు. ఒకవేళ పడినా అంతా తూ తూ మంత్రపు విచారణలు జరిపి, శిక్షలు పడకుండా విడుదల చేస్తారు. అగ్రకుల అహంకారాలతో మితిమీరిన క్రూరత్వంతో అంతంత ఘాతుకాలను జరిపిన వారికి తగిన కఠినమైన శిక్షలైతే పడవు. బయట కొచ్చి మళ్ళీ మోరలెత్తి దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. జూబ్లీ హీల్స్ బాంబ్ బ్లాస్ట్ నిందితుడికి ప్రతీకగా జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తూ, పరమ దాష్టీకంగా ప్రవర్తిస్తున్న ఒక మదాంధుడిని చూపించారు. అంతెందుకు, మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా హత్రాస్ బాలికను అత్యాచారం చేసినవాళ్ళని “వాళ్ళు బ్రాహ్మణులు, సదాచార సంపన్నులు, వాళ్ళు అలాంటి పనులు చేయరు” అంటూ గౌరవ కోర్టులే తీర్పులు చెప్పాయి. బిల్కిస్ బానోని నడిరోడ్డు మీదే అవమానించి ఆమె కుటుంబ సభ్యులనందరిని హతమార్చినవాళ్ళు విడుదలైన సందర్భంలో నిందితులకి సన్మానాలు, మిఠాయిలు తినిపించడం చూశాం కదా?
కానీ ఈ సినిమాలో నిందితులిద్దరూ మనం 23 మంది చనిపోవడానికి కారణమయ్యాం, చాలా పాపం చేశాం, మనకి నిష్కృతి లేదు అంటూ ప్రతిరోజూ పశ్చాత్తాపంతో దహించుకుపోతుంటారు. ఒక్క పైసా చేతిలో లేని పరిస్థితిలో బస్సులో వాళ్ళని బెదిరించి కాస్త డబ్బు సంపాదించాలనే వాళ్ళ కోరిక తప్ప వాళ్ళకి అగ్గిపుల్ల అంటించే ఆలోచనే ఉండదు. బస్సులోవాళ్ళు తిరగబడడంతో ఆ దిక్కు తోచని పరిస్థితిలో కలిగిన క్షణికోద్రేకం అలా దారి తీస్తుంది. బస్సు దిగిన ఇద్దరి దగ్గర వాళ్ళకు అతి తక్కువ ఏ అవసరానికీ సరిపోని చిల్లర దొరుకుతుంది. బస్సు తగలబడి, అమాయక మనుషులు బలైపోవడం చూసిన ఇద్దరు స్నేహితులూ అంతులేని వేదనతో గుండెలు బాదుకుంటారు. ఆ వేదనలోని నిజాయితీ ప్రేక్షకులకు తెలుస్తుంది!
రాజ్ రాచకొండ దర్శకత్వ ప్రతిభ: ఈ చిత్రం మొదలైన కొన్ని క్షణాల్లోనే దాని సెటప్ మనల్ని తన ప్రపంచం లోకి లాక్కుపోతుంది. గోనె సంచులలో ముక్కలుగా నరకబడిన కొన్ని మృతదేహాలు, గట్టిగా బిగించి కట్టివేయబడిన వాటి నుంచి కారుతున్న రక్తంతో ఎరుపెక్కిన గోనె సంచులు కనిపిస్తాయి. అలాగే, ఒక బస్సు మంటల్లో చిక్కుకోవడం, కొందరు ప్రజలు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేయడం, మరికొందరు పారిపోవడం కనిపించి భరించలేని ఉత్కంఠతో కళ్ళు తెరకి అతుక్కుపోతాయి. అప్రయత్నంగానే కుర్చీల అంచుకు జారిపోతాం. కొన్ని సెకండ్లు ఊపిరితీసుకోవడం ఆగిపోతుంది. అగ్నికి ఆహుతైపోయి అన్యాయంగా మరణించిన అమాయక ప్రజల గురించి దుఃఖం కలుగుతుంది. తర్వాత జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ దృశ్యం కనిపిస్తుంది. కొన్ని సెకండ్లలోనే ఈ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడి కల్పనా చాతుర్యం ప్రేక్షకులను అమితంగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ సంఘటనల గురించిన సమాచారం అంతకుముందు మనకి తెలిసినదే అయినా దృశ్యరూపంలో చూస్తున్నప్పుడు పేగులు కదిలిపోతున్నంత బాధతో తెగ గింజుకుని అల్లాడిపోతాం! ఒక ఇంటర్వ్యూలో చాలా రీసర్చ్ చేసి ఈ సినిమా తీశానన్నారు రాజ్. ప్రొడ్యూసర్ కూడా ఆయనే, టెక్సాస్ నుంచి వచ్చి ఎంతో కృషి చేశారు. 12 సంవత్సరాలుగా జైళ్ళలో పనిచేసిన బీనా అనే ఒక సైకాలజీ ప్రొఫెసర్ మేడమ్ అనుభవాన్నీ, సహకారాన్నీ తీసుకుని జైళ్ళ పరిస్థితిని అర్ధం చేసుకున్నానని చెప్పారు. ఆయన చాలా స్నేహ పూర్వకంగా, మర్యాదగా ఉన్నారు. మమ్మల్ని సినిమాకి తీసికెళ్ళిన మా స్నేహితులు లాయర్ నందిగం కృష్ణారావుగారు సినిమా గురించి కొన్ని సవరణలు, అంటే అది అసలు ఉద్దేశ్య పూర్వకంగా చేయలేదు, దాన్ని హత్యానేరంగా చూడకూడదు అని చెప్తుంటే శ్రద్ధగా విన్నారు. డబ్బున్నవాళ్ళకి విచారణలు చట్టాలు, న్యాయం, శిక్షలు ఒక రకంగా, సామాన్య జనానికి ఇంకో రకంగా బాధ్యత లేకుండా చాలా అన్యాయంగా అసలు పట్టించుకోకుండా, విచారణలే లేకుండా ఏళ్ళకేళ్ళు జైళ్ళలో మగ్గిపోతుండడం ఇప్పుడు చూస్తున్నాం. చట్టాలు, శిక్షలు మనుషులందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని దర్శకుడు రాజ్ రాచకొండ అనడంలో ఆయన ఆవేదన అర్ధమవుతుంది. రాజ్ గారు ఆయన 19, 20 సంవత్సరాల వయసులో ఈ సంఘటన జరిగిందట. ఎంత వేదన పడితే అప్పటినుంచి ఇప్పటివరకు మనసులో ఆ సంఘటన తాలూకూ ఘర్షణని గుర్తుంచుకుని సామాజిక బాధ్యతతో టెక్సాస్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో సాధకబాధకాలకోర్చుకుని సినిమా తీస్తారు? సామాజిక బాధ్యతతో జైళ్ళు పనిచేయాలనీ, ప్రభుత్వం జైళ్ళ సంస్కరణల పట్ల శ్రద్ధ తీసుకోవాలనీ, ఖైదీల మానసిక ప్రవృత్తిలో మార్పు వచ్చినవాళ్ళని తప్పకుండా విడుదల చేయాలనీ, మార్పు రానివాళ్ళను సమాజం మీదకి వదిలితే మరింత ప్రమాదమనీ అన్నారు.చలపతి సహచరి ఆయన కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తోందని చెప్పారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి స్థోమత ఉన్నప్పటికీ బాధితులకోసం ఆలోచిస్తున్న రాజ్ గారు ఎంతైనా ప్రశంసనీయులు!
ఈ ఘటన జరిగి 32 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటీకీ ఇది ప్రాసంగికమే! మనదేశంలో అమలవుతున్న అగ్రకుల దాష్టీకాలు, పేదరికం, నిరుద్యోగం, పని చేయగలిగిన వయసులో ఉన్న యువకులకు పని దొరక్క ఉపాధి లేకపోవడం, ఒకవైపు దౌర్జన్యంతో విర్రవీగే ధనవంతులు, ఇంకొకవైపు పూట గడవని పేదలు, అంతులేని అసమానతల మధ్య కటిక పేదరికంలో ఉన్న మంచి మనుషుల ప్రవర్తన, ఆలోచనలు కూడా ఏ విధంగా నేర ప్రవృత్తి వైపుకి మళ్ళుతాయి అనే విషయాన్ని, మన సమాజ స్వభావాన్ని “23” సినిమాలో పొరలు పొరలుగా మనముందు చర్చకు పెట్టి న్యాయంగా ఆలోచించి, తగిన చర్యలకు ఉద్యమించమని అన్యాపదేశంగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు దర్శకులు రాజ్!
ఈ చిత్ర దర్శకుడి మనస్తత్వాన్ని మనకి అద్దంలో చూపించినట్లు “All are equal, but some are more equal than others” అనే George Orwell Quotation పోస్టర్ మీద కనిపిస్తుంది. “మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ” అని అంటాడు ప్రముఖ సినిమా కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. సినిమా గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, సంగీతం, దృశ్య భ్రమలు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న ఎన్నో సాంకేతికతలతో సినిమాలు అత్యాధునికంగా తయారవుతున్నాయి. ఎంత నూతన విధానాలతో చిత్రీకరించినప్పటికీ సత్యజిత్ రే చెప్పినట్లు అసలు కథలో వాస్తవికత లేకపోతే అది మంచి సినిమా అనిపించుకోదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అరే ఈ సంఘటనలు మనం మన సమాజంలో చూస్తున్నట్లుగానే ఉన్నాయే అనిపించాలి. అలా అనిపించాలంటే దర్శకుడికి మానవీయ విలువలు, కళాత్మకత, మానవ జీవిత భిన్న పార్శ్వాలను, విభిన్న కోణాల్లో ఆవిష్కరించాలనే సదుద్దేశ్యం, నిజాయితీ, బాధితుల పట్ల ఆర్ధ్రతతో కూడిన సామాజిక బాధ్యత ఉండాలి. దోపిడీ, పీడనలను ఎదిరిస్తూ, సమాజంలో జరుగుతున్న అపసవ్య విధానాలను ఎత్తి చూపిస్తూ ఆలోచనలను రేకెత్తించే చైతన్యాన్ని స్ఫురింపజేయగలగాలి! 32 ఏళ్ళక్రితం జరిగిన సంఘటనలతో రోజురోజుకీ ఇంకా ఇంకా నీచంగా, ఘోరంగా, హీనంగా మానవత్వపు జాడలు లేకుండా మనం జీవిస్తున్న అన్యాయపు సమాజాన్ని కళ్ళముందు నిలిపి, “ఇదీ మన సమాజం, ఆలోచించండి” అని విజ్ఞప్తి చేస్తున్న రాజ్ గారికి హెర్బర్ట్ రీడ్ చెప్పినమాటలు వర్తిస్తాయి! అంతేకాదు, చట్టం అందరికీ సమానంగా ఉండాలి అనే అంశం మీద ఇంతవరకెవ్వరూ సినిమా తియ్యలేదు. ఈ అంశం మీద ఆలోచనలు రేకెత్తించినందుకు రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి తెలుగు వారంతా!
ఈ సినిమా ప్రత్యేకతలు: సినిమా నిడివి, నిర్మాణ వ్యయం, బాక్సాఫీసులు బద్దలు కావడం, రికార్డుల మోత వంటి లాభనష్టాలకి సంబంధించిన అంశాలు కాకుండా మానవుల వాస్తవ జీవితాల వ్యధల మీద దృష్టి పెట్టిన చిత్రమిది. దీన్ని నేపధ్యంగా తీసుకుని మన సమాజ స్వభావాన్ని దృశ్యమానం గావిస్తూ కటిక పేదరికం, పేదల ప్రేమకథ, దారుణమైన అసమానతలు, కులవ్యవస్థ, డబ్బు వెదజల్లగల, న్యాయవాదుల్ని నియమించుకోగల ధన్యవంతుల కొకరకమైన న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎంత ఘోరమైన అకృత్యాలు, హత్యలు చేసినప్పటికీ శిక్షల నుంచి తప్పించుకుని బయట దర్జాగా తిరుగుతుంటే, పొట్టగడవక అతి చిన్న నేరాలు, చిల్లర దొంగతనాలతో జైళ్ళపాలైన పేద ఖైదీలు ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. ఈ విషయం ఎంత చిన్న నేరాలతో పేద మహిళలు జైళ్ళలో మగ్గుతున్నారో సుధా భరద్వాజ్ “ఊరి వార్డు నుండి” చదివితే మనకర్ధమవుతుంది. మహిళలే కాదు, ఆదివాసీలు, అంచులకు నెట్టివేయబడుతున్న పురుషులు కూడా వేలల్లో జైళ్ళలో ఉన్నారని, వాళ్ళ కోసం నేను పోరాడతానన్నాడు ప్రొఫెసర్ సాయిబాబా. హింస కేవలం అల్లరి మూకలకు, సాయుధ దుండగులకు సంబంధించినది మాత్రమే కాదు. అది భారతదేశ రాజ్యస్వభావం లోనే ఉంది. ప్రాధమిక అవసరాలు కూడా తీరని ప్రజలు ఉన్నారనే వాస్తవాన్ని పాలకులు గమనించి కుల వ్యతిరేక స్వభావంతో కాకుండా, స్థాయీ బేధాలు లేకుండా మనుషుల్ని మనుషులుగా చూసే సమాజంలో ఇలాంటి హీనమైన అకృత్యాలు జరగవు. ఇలాంటి విషయాలన్నీ ఈ చిత్రం చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు స్ఫురిస్తాయి. అలా పరోక్షంగా స్ఫురింపజేయడమే మంచి సినిమా లక్షణం అంటారు సినీ పండితులు.
ఈ చిత్రం టీమ్ లో ఝాన్సీ మాట్లాడుతూ రాజ్ గారు నిజాయితీగల ఫిల్మ్ మేకర్ అనీ, ఆయన నమ్మే ఆదర్శాలను, తెరపై చూపించాలనేదే రాజ్ గారి ప్రత్యేకత అన్నారు. మంచి సినిమాల పట్ల ఎంతో అభినివేశం, అనుభవం ఉన్న వెంకట్ సిధారెడ్డి గారు, తెలంగాణా గర్వించదగ్గ ఆర్టిస్ట్ లక్ష్మణ్ ఏలే గారు ఈ సినిమాకి పని చేశారనీ, రాజ్ గారు ప్రతి పనికి సరైన రిసోర్స్ పర్సన్స్ ని వెతు క్కుంటారని చెప్పారు. నిజాయితీకి శక్తి, బలాలుంటాయనీ, హైప్ కి ఒత్తిడి, బలహీనతలుంటాయని, వేల కోట్లతో హైప్ తీసుకొస్తే ఆ ప్రెషర్ కి అది ముక్కలవుతుందని అన్నారు. ఎలాంటి హైప్ లు, సెలబ్రిటీలు లేకుండా, గొప్పవాళ్ళెవరూ వచ్చి ఎండార్స్ చెయ్యవలసిన అవసరం లేకుండానే ఇందులో పనిచేసిన టీమ్ సభ్యులం మాత్రమే కలిశామని చెప్పారు. సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మే ప్రేక్షకులే వెతుక్కుని ఈ సినిమా చూస్తారని చెప్పారు!
నటీ-నటులు : సైకాలజీ ప్రొఫెసర్ గా నటించిన ఝాన్సీ తనను తాను మర్చిపోయి పాత్రలో ఒదిగి పోయారు. ఆమె శిష్యుడుగా కొత్తగా వచ్చిన జైళ్ళ అధికారి, లాయర్ చంద్రం పాత్రలలో నటించిన నటులు తమ పాత్రల్ని అద్భుతంగా పోషించారు. ఈ మూడు పాత్రల ప్రవర్తన మానవీయంగా, చాలా ఉదాత్తంగా ఉన్నాయి. మిగిలిన అందరూ నటీ-నటులు కూడా పాత్రల్లో చక్కగా అమిరిపోయారు.
హీరోగా వేసిన తేజా, హీరోయిన్ తన్మయి మధ్య భయానకమైన పేదరికంలోనూ రవ్వంత ఆశను చూడగలిగిన జంటగా, భరించలేని పేదరికం, బాధ, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకరి సమక్షంలో మరొకరు సేద తీర్చుకునే వారుగా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీళ్ళిద్దరికీ మొదటి సినిమా ఇదేనంటే ఆశ్చర్యపోతాం! తేజాని నేను “సినిమాలో మీరు నటించిన పాత్ర చలపతిదా లేక విజయవర్ధనరావుదా?” అని అడిగాను. నాకు తెలియదు అన్నాడు. ఆ పాత్రలు పోషించిన స్నేహితులిద్దరూ పుట్టకముందు జరిగిన సంఘటన ఇది. రాజ్ గారి నడిగితే అది చలపతి పాత్ర అని చెప్పారు.
తేజా చాలా అద్భుతంగా నటించాడు. యువకుడిగా, భావుకుడుగా, పశ్చాత్తాపం కలిగించే విషాదంతో, బాధతో తన్నుకులాడుతున్నట్లుగా కనిపిస్తాడు. ప్రేక్షకులకు కూడా చాలా దుఃఖం కలుగుతుంది. చివరకు ఎక్కడో పెరుగుతున్న తన పాపను చూడాలని తన చివరి కోరికను జైలు అధికారికి చెప్తాడు. 32 సంవత్సరాలలో వయసు పెరిగేకొద్దీ పెంచుకుంటున్న పరిణతిని చూపిస్తూ అద్భుతమైన నటనని చూపించాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగాననీ, తనకి పల్లెలు వాళ్ళ మాండలికం తెలియకపోయినందువల్ల మొదట భయపడ్డాననీ, నటిస్తూ నటిస్తూ అలవాటు పడ్డాననీ చెప్పాడు.
సాంకేతిక బృందంలో సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, అనిల్ ఆలయం ఎడిటింగ్ బాగున్నాయి.
నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో “23” ఈ సినిమా చూశాను. చూసి చాలా రోజులైనా అది నింపిన విషాదాన్నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడెప్పుడో “మనుషులు మారాలి” సినిమా చూసినప్పుడు కలిగినంత దుఃఖం కలిగింది. దాదాపు 30 ఏళ్ళ క్రితం పూర్తిగా తెలిసీ తెలియనితనంతో చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సభలు, ఉద్యమాల్లో పాల్గొన్నాను. A.G’s ఆఫీస్ (Account General’s Office) ముందు, పబ్లిక్ గార్డెన్స్ ముందు వీధి నాటకాలేశాం. అప్పుడంత విషాదం మనసుకి తాకలేదు. ఈ కేస్ కోసం చాలా ఆర్ధ్రతతో, నిబద్ధతగా పనిచేసిన గుంటూర్ లాయర్ చంద్ర గారి సంస్మరణ సభలో పేదరికం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో కొంత అర్ధమైంది. కానీ ఈ సినిమా గుండెల్ని పిండేసింది. కటికపేదరికంలో మనుషులు చిల్లర పైసల కోసం కూడా ఎంతగా పరితపిస్తూ అలమటిస్తారో, ఆ సమయంలో గడ్డు పేదరికం, ఆకలి, దరిద్రాలను తట్టుకోలేని పరిస్థితుల్లో మనుషులు ఎలాంటి పనులకు సిద్దమవుతారో తెలిసొచ్చింది. అదీగాక ఎదుగుతున్న టీనేజిలోని యువతీయువకులలో చెలరేగే భావాలు, దుందుడుకు తనాలు, ఒక తప్పుడు ఆలోచనకు, అనాలోచితంగా చేసిన పనికి జీవితంలో ఎంత పెద్ద మూల్యం చెల్లించ వలసి వచ్చిందో తెలుపుతుందీ సినిమా! రెండవ భాగం చాలా భారంగా ఉంది. బాగా ఏడిపించింది. నిందితులిద్దరిలో పీడించే పశ్చాత్తాపం చాలా దయనీయంగా ఉంది. ఈ తప్పు ఎవరిది? అని ఆలోచింపజేస్తుంది.
ఈ రాజ్ గారి దర్శకత్వంలో మరో రెండు సినిమాలోచ్చాయి ఒకటి మల్లేశం, ఇంకొకటి 8 A M మెట్రో. మొత్తానికి సమాజాన్ని నిశితంగా పరిశీలించి, చాలా జాగ్రత్తగా తీస్తారని, ప్రామిసింగ్ డైరెక్టర్ అని భరోసా, నమ్మకం కలిగాయి. తెలుగు సినిమాలను చూడడం ఎప్పుడో మానేసిన నాకు అప్పుడప్పుడు మెరిసే ఇలాంటి సినిమాలను చూడాలని అర్ధమైంది!
ఈ చిత్రం మే నెల 16 న హిందీ, తమిళ భాషలలో కూడా విడుదల కాబోతుంది