60 కోట్ల వివాదం: ట్విస్ట్ ఇచ్చిన PVR Inox..
న్యాయస్థానంలో నిర్మాతకు భారీ షాక్!;
సినిమా ప్రపంచం రిలీజ్ లను ఒక ప్రత్యేక సందర్భంగా భావిస్తుంది. కానీ, ఈ ప్రత్యేక సందర్భం సృష్టించే క్రమంలో రకరకాల ఇబ్బందులు,సమస్యలు వస్తూంటాయి. అలాగే ఇప్పుడు దేశంలో యుద్దం వాతావరణం నేపధ్యంలో థియేటర్ కు వచ్చి చూసే మూడ్ కనపడటం లేదు. దాంతో కొన్ని సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నారు. కానీ హిందీ చిత్రం "భూల్ చుక్ మాఫ్"ఓ అడుగు ముందుకు వేసి థియేటర్ రిలీజ్ తీసేసి, డైరక్ట్ ఓటీటికి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు అదే సమస్యలు తెచ్చిపెడుతోంది. ఏకంగా ఈ రిలీజ్ విషయం కోర్ట్ కు ఎక్కింది.
డైరక్ట్ ఓటిటినే..
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao), వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూల్ చుక్ మాఫ్’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో కరణ్ శర్మ తెరకెక్కించారు. మే9న ఇది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీన్ని థియేటర్‌లో విడుదల చేయడం లేదని టీమ్ ప్రకటించింది.
‘‘దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని మేం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నేరుగా మీ ముందుకు తీసుకువస్తున్నాం. ‘భూల్ చుక్ మాఫ్’ (Bhool Chuk Maaf) మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను థియేటర్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నాం. కానీ.. దేశ స్ఫూర్తికి మేం మొదటి ప్రాధాన్యం ఇస్తాం. జై హింద్’’ అని తెలిపారు. అయితే అక్కడదాకా బాగానే ఉంది. నిర్మాతల నిర్ణయం ఇప్పుడు వివాదానికి కారణమైంది.
నిర్మాతలపై మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ కోర్ట్ కేసు..
మే 9న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా వేలాది మంది టికెట్లు కొనుగోలు చేశారు. ఆ వెంటనే భూల్ చుక్ మాఫ్‌ను ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల చేస్తామని చెప్పడంతో ప్రేక్షకులు షాకయ్యారు. అటు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ .. నిర్మాతల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
'భూల్ చుక్ మాఫ్' సినిమాను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాతలు తమతో ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఓటీటీలో విడుదల చేయడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొంది.
ఢిల్లీ సహా పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని నగరాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని, ప్రేక్షకులు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని, ఈ సినిమా రిలీజ్ కోసం స్క్రీన్స్ అలాట్ చేశామని వివరించింది పివిఆర్ ఐనాక్స్. థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేయడం వల్ల తమకు నష్టాలు వస్తాయని వివరించింది.
కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది..
ఈ కేసులో నిర్మాతలకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి తీర్పు వచ్చింది. జూన్ 16వ తేదీ వరకు సినిమా విడుదల చేయకూడదని బాంబే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఓటీటీ రిలీజ్‌పై స్టే విధించడంతో పాటు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది.
స్టోరీ లైన్ విషయానికి వస్తే...
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఇటీవల ఈ సినిమాలోని ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర టీమ్. బ్యాచిలర్ పార్టీ మోడ్‌లో సాగుతున్న ఈ గీతంలో రాజ్, ధనశ్రీలు వారి స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ పాటకు ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి ఆలపించారు.