‘ఫూలే’ సినిమా ఎలాంటి కోతలు లేకుండా విడుదల చేయాలి: కంచ ఐలయ్య
సీబీఎఫ్సీ కీలక సన్నివేశాలు, సంభాషణలను తొలగించాలని సూచించడంపై అభ్యంతరం;
By : Praveen Chepyala
Update: 2025-04-11 06:42 GMT
సాంఘిక సంస్కర్త జ్యోతిరావు పూలే- సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన హిందీ చిత్రం ‘‘ఫూలే’’ ను విడుదల సీబీఎఫ్సీ నిలిపివేసింది. ఈ అంశంపై కంచ ఐలయ్య షెఫర్డ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం తాను ఈ వార్త చూసినట్లు ఐలయ్య ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సమాజం దాని చిత్రీకరణ గురించి లేవనెత్తిన ఆందోళనల కారణంగా ఆలస్యం అయిందని అన్నారు.
బ్రాహ్మణ సంఘాలు నుంచి అభ్యంతరాలు తెలపడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) కులానికి సంబంధించి వివాదాస్పద సంభాషణలు, సన్నివేశాలు తొలగించాలని కోరింది.
బ్రాహ్మణ సమాజం వ్యతిరేకత ఆధారంగా గొప్ప సామాజిక సంస్కర్తపై తీసిన చిత్రాన్ని సీబీఎఫ్సీ ఎలా వాయిదా వేయగలదని షెఫర్డ్ తన లేఖలో ప్రశ్నించారు. చిత్రం నుంచి కుల సంబంధిత సూచనలు ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫూలే పోరాటం అతని కాలంలోని కుల, బ్రాహ్మణ వర్గాల అమానవీయ పద్దతులకు వ్యతిరేకంగా జరిగిందని లేఖలో గుర్తు చేశారు. మార్చి 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా భారతరత్న సిఫార్సు చేసిందని ప్రస్తావించారు.
బ్రాహ్మణ కులతత్వానికి వ్యతిరేకంగా ఫూలే దంపతులు చేసిన పోరాటాల చరిత్రే ఈ సినిమా అని వివరించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పూర్తిగా నిజమైన సంఘటనలకు ప్రతిబింబించింది.
మహాత్మాఫూలే బ్రాహ్మణ జీవిత చరిత్ర రచయిత ధనంజయ్ కీర్ స్వయంగా వాస్తవాలను రికార్డు చేశారని పేర్కొన్నారు. భారత్ లో సంస్కరణలను ఇష్టపడే ప్రజలు ముఖ్యంగా శూద్రులు/ఓబీసీలు, దళితులు/ఆదివాసులు, మేధావులు, CBFC ఈ సంస్కరణ వ్యతిరేక చర్యకు వ్యతిరేకంగా పోరాడాలి.
ముందుగా ఆమోదించబడిన వెర్షన్ నుంచి ఎలాంటి కట్ లు లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. భారతదేశం ఈ రకమైన కులతత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కంచ ఐలయ్య షెఫర్డ్ తన లేఖలో కోరారు.