'పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
ఈ చిత్రం ఏ మేరకు నవ్వించింది, మెప్పించిందో రివ్యూలో చూద్దాం..;
మీకు గుర్తుందా, ‘మల్లీశ్వరి లో వెంకటేష్ పేరు ప్రసాద్. ఏజ్ బార్ అయినా.. పెళ్లి కాకపోవడంతో అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. అదెంత పాపులర్ అయ్యిందంటే ఎవరికైనా పెళ్లి కాకుండే ఉండిపోతే పెళ్లి కానీ ప్రసాద్ అని పిలిచేటంత. ఈ టైటిల్ తో గతంలో తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఇపుడు మళ్ళీ గ్యాప్ తర్వాత సప్తగిరి హీరోగా మరో చిత్రం వచ్చింది. అప్పుడు అల్లరి నరేష్ చిత్రం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఏమైంది. ‘పెళ్లి కాని ప్రసాద్’ ఏ మేరకు నవ్వించింది, మెప్పించిందో రివ్యూలో చూద్దాం..
కథేంటి
మలేషియాలో ఓ స్టార్ హోటల్ లో పని చేస్తూండే ప్రసాద్(సప్తగిరి) కి వయస్సు మీద పడినా పెళ్ళి కాదు. వాళ్ల నాన్న(మురళీధర్) కట్నం ఆశ అతన్ని ముంచేస్తుంది. రెండు కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మరో ప్రక్క ప్రియా(ప్రియాంక శర్మ) కి ఎన్నారై పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవ్వాలనే కోరిక. దాంతో ప్రసాద్ ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అయితే అసలు సమస్య అక్కడే వస్తుంది.
ప్రసాద్ కు మళ్లీ మలేషియా వెళ్లి ఉద్యోగం చేయాలని ఉండదు. కానీ ప్రియకు తన ఫ్యామిలీ మొత్తం తన భర్తతో పాటు మలేషియా తీసుకెళ్లాలనే కోరిక. దాంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుంది. ఇది దేనికి దారి తీసి తీసింది. అసలు ప్రసాద్ మళ్లీ ఎందుకు ఫారెన్ ఎందుకు వెళ్ల కూడదనకున్నాడు. ప్రియ జీవితాశయం వదలుకోవటానికి ఇష్టపడిందా, చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
పెళ్లి విషయంలో ఈ జనరేషన్ అబ్బాయిల, అమ్మాయిల ఆలోచనలు ప్రతిబింబించే పాయింటే ఇది. అయితే పైపైనే ఈ పాయింట్ ని డీల్ చేసారు. సప్తగిరి హీరో, కామెడీ సినిమా అనగానే అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేయం. అయినా ఏదో ఒక కొత్త పాయింట్ లేనప్పుడు, ఉన్నా దాన్ని సరిగ్గా డీల్ చేయనప్పుడు చూసేటప్పుడు ఉత్సాహం ఏముంటుంది. అదే జరిగింది ఈ సినిమాకు. ఫస్టాఫ్ తండ్రి కట్నం ఆశ, అలాగే అమ్మాయి ఫారిన్ సంబంధం ఆలోచన ఈ రెండు సింక్ చేస్తూ కథ నడుస్తూంటే బాగానే ఉందనిపిస్తుంది. అయితే పెళ్లి తర్వాత కథను ఎటు వైపు తిప్పాలో డైరెక్టర్ కు అర్ధం కాలేదు. దాంతో రొటీన్ గా సీన్స్ వేసుకుంటే ముగింపుకు తీసుకెళ్ళాడు.
హీరో పెళ్లి కాకుండా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసే సీన్స్ బాగానే పండాయి. అలాగే మ్యారేజ్ చేసుకొని ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకున్న అమ్మాయికి అతను ఫారెన్ వెళ్ళాడు అని తెలియడం ట్విస్ట్ గా బాగుంది. అయితే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసిందనేది క్లియర్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. మెసేజ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కంటెంట్ బలంగా ఉండాలి. అలాగే ఇలాంటి కథకు ముగింపు బలంగా లేకపోతే తేలిపోతుంది. అదే జరిగింది. క్లైమాక్స్ చాలా క్యాజువల్ గా లాగేసారు.
టెక్నికల్ గా చూస్తే...
సినిమా ఓ కామెడి చిన్న సినిమాకు తగినట్లే అన్ని డిపార్టమెంట్ పనిచేస్తాయి. డైరెక్టర్ కు కామెడీ మీద పట్టు ఉన్నా సాగతీత సెకండాఫ్ ని ఇబ్బందుల్లో పడేసింది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని నార్మల్ సీన్స్ కు కూడా మంచి హై ఇచ్చింది. సెకండాఫ్ లో విసిగించే కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ల కపోయినా రిచ్ లుక్ తెచ్చిపెట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కామెడీ సినిమాలకు అవసరమైన డైలాగులు అక్కడక్కడ బాగానే పడ్డాయి.
ఇక సప్తగిరికు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన టైప్ మ్యానరిజం తో కొన్ని సీన్స్ లో బాగానే నవ్వించాడు. అలాగే తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ కామెడీ బాగానే నవ్వించింది. హీరోయిన్ ప్రియాంక్ శర్మ కు నటనపరంగా చేయటానికి ఏమీ లేదు. అన్నపూర్ణ, ప్రమోదిని, భాషా, మీసాల లక్ష్మణ్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్, జెన్ని, నాగ మహేశ్ వంటి ఆర్టిస్ట్ లు తమ పాత్రలు బాగానే చేసుకుంటూ వెళ్లారు.
చూడచ్చా
కామెడీ అంటున్నారు కదా, తెగ నవ్వేసుకుందాం అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లకపోతే బాగానే ఉందనిపిస్తుంది. ఓ సారి చూడచ్చు.
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, వడ్లమాని శ్రీనివాస్, మురళీ గౌడ్, ప్రమోదిని, రోహిణి, తదితరులు..
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల