ఓటీటీలో నుంచి థియేటర్‌కు!
ఇది అరుదైన 'రివర్స్ రీల్' ప్రయాణం;
సాధారణంగా ఓ సినిమా ముందుగా థియేటర్‌లో విడుదలై, అక్కడ ఓ విజయం సాధించిన తర్వాతే ఓటిటిలోకి ప్రవేశిస్తుంది. కానీ ‘అనగనగా’ అనే ఈ కథ మాత్రం ఆ నియమాలకు మినహాయింపుగా నిలిచింది. ఓటిటిలో ప్రీమియర్ అయిన ఈ భావోద్వేగాత్మక చిత్రానికి ప్రేక్షకుల నుంచి అమూల్యమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో “ఇది మా కథే…” అంటూ వేలాది మంది తమ భావాలను షేర్ చేసుకుంటున్నారు.
ఇది నిజంగా అరుదైన ‘రివర్స్ రీల్’ ప్రయాణం!
150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా... ఇప్పుడు అదే ప్రేమను వెండి తెరపై తిరిగి పొందేందుకు సిద్ధమైంది.
వాస్తవానికి ఓటిటిలో ఓ సినిమా హిట్ కావడం ఒక విశేషం అయితే, ఆ హిట్ థియేటర్‌కు వేదిక కావడం మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే అరుదైన ఘటన. ప్రేక్షకుల మనసుల్లో గాఢంగా నిలిచే కథలు, ఎక్కడ రిలీజ్ అయినా విజయమే సాధిస్తాయని ‘అనగనగా’ మరోసారి నిరూపించేసింది.
“అనగనగా” లో ఏముంది ..ఎందుకింత సక్సెస్ అయ్యింది?
"Cinema is not only about making people dream. It's about changing things and making people think"
--- Nadine Labaki
( వేర్ డు వుయ్ గో నౌ? (2011), కాపెర్నౌమ్ (2018),కారామెల్ (2007) దర్శకురాలు)
ఒక సినిమా మనసుని తాకితే, అది తెరపై నడిచే కథ మాత్రమే కాదు — మన జీవితాలని కూడా మార్చగలుగలిగే శక్తి వంతమైన మీడియం అవుతుంది. అదే “అనగనగా” లో జరిగింది.
విద్య అంటే వెలుగే... కాని ఈరోజుల్లో ఆ వెలుగు కాంతికన్నా కాసుల కాంతికే ఎక్కువ ప్రయారిటీ అన్నట్లు పరిస్దితిలు మారిపోయాయి. ఈ క్రమంలో సమాజంలో విద్యా బోధన పట్ల నెలకొన్న నిరసనలు, ఉద్వేగాల మధ్య – ఈ సినిమా, ప్రశ్నించే ధైర్యాన్ని సున్నితమైన సెటైర్ల రూపంలో తెరపై ఆవిష్కరించింది. ఈ సినిమా కేవలం కథ చెబుతూ వెళ్లలేదు... విద్యావ్యవస్థలోని లోపాలను చూపిస్తూ – ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి మనసులో ఎప్పటినుంచో ఉన్న మౌనంగానో, మనసులోనో దాచుకున్న బాధను తెరపైకి తీసుకొచ్చింది.
కథేంటంటే...
వ్యాస్ (సుమంత్) ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఇతని నమ్మకం సాంప్రదాయ విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకం. "ఎగ్జామ్స్‌లో పాసవ్వొచ్చు… కానీ జీవితంలో ఫెయిలవుతున్నామంటే తప్పకుండా విద్యా వ్యవస్దలోనే ఏదో లోపం ఉంది." అనేది అతని నమ్మకం.
వ్యాస్ తరగతిలో బోధన క్లాసు కాదు… కథ, అనుభవం, భావోద్వేగాల మేళవింపు అన్నట్లుగా ఉంటుంది. పాఠాలను పాఠాల్లా కాక, జీవించదగిన అనుభవాల్లా చెబుతాడు. చిన్నారుల మనసులోకి దూసుకెళ్లి, వారి హృదయాన్ని తాకేలా బోధించడమే అతని పద్ధతి. దాంతో అతని పద్దతికి స్కూల్ మేనేజ్‌మెంట్‌కి మధ్య పెద్ద అడ్డగీత ఉంటుంది.
ఇక భార్య భాగ్య (కాజల్ చౌదరి) అదే స్కూల్‌కు ప్రిన్సిపల్. విద్యని బిజినెస్‌గా మార్చిన యాజమాన్యం వైపు మళ్లిపోయిన ఆమె, భర్త ప్దదతులను నిలదీస్తుంది. వ్యాస్ నిబద్ధతను తప్పుగా అర్థం చేసుకుంటూ, మేనేజ్‌మెంట్ మాటలకు అతడిని బలిగా చేస్తారు.
ఉద్యోగం పోయిన తర్వాత… చదువు పేరుతో ఒత్తిడిలో నలిగిపోతున్న చిన్నారుల పట్ల అతని బాధ్యత ఇంకా పెరుగుతుంది. "చదువు అనేది జీవితాన్ని గెలిపించేదిగా ఉండాలి, ర్యాంక్‌లు తెచ్చేదిగా కాదు" అనే తపనతో, బయటే ఒక పాఠశాలగా మారుతాడు.
వెనుకబడిన విద్యార్థులను టాపర్లుగా ఎలా తీర్చిదిద్దాడు? ఆ పిల్లల జీవితాల్లో వ్యాస్ ఎలా మారిపోయాడు? వివాహ బంధం, బాధ్యతల మధ్య అతను ఎలా నడిచాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం… "అనగనగా" అనే సినిమాలో ఉంది. ఓ పాటలో చెప్పినట్టు — "గురువు అన్నవాడు క్లాస్‌లో కాదు… జీవితంలో మార్పు తెస్తాడు." ఈ సినిమా అలాంటి గురువు గురించి.
The duty of a film director is to focus more on the soul of the spectator
-Ken Loach
ఓ సినిమా దర్శకుడి అసలు బాధ్యత ఏమిటంటే, ప్రేక్షకుల హృదయాలను తాకుతూ, ఆత్మను స్పృశించే కథనాలను తెరపైకి తీసుకురావటం, అదే సమయంలో వారి మనసులోకి చొరబడే సామాజిక సందేశాలను అందించడం. ఈ సినిమా కూడా సరిగ్గా ఆ పని చేసింది. కేవలం ఒక కథ చెప్పడంతో ఆగకుండా, విద్యా వ్యవస్థలోని నిజమైన సమస్యలను లోతుగా, ఆవేదనతో, నిజాయతీతో చిత్రీకరించింది.
ఈ చిత్రం ఏ ఒక ప్రత్యేక విద్యా సంస్థను లక్ష్యంగా పెట్టలేదు, కానీ విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థపై గట్టి ప్రశ్నలు సంధించింది. భావోద్వేగానికి బదులుగా బాధను చూపి, హాస్యానికి బదులుగా వాస్తవాన్ని మాట్లాడింది. మార్కుల చుట్టూ తిరిగే విద్యార్థుల భవిష్యత్తును విమర్శించాల్సిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా గుచ్చుకుంటుంది. అందుకే ఇది ప్రేక్షకుల మన్ననలు, ఆదరణ పొందింది.