స్కూళ్లన్నీ ఆ సినిమా చూసి క్లాస్ రూమ్ లను మార్చేస్తున్నాయి

నెల రోజులుగా ఏదో ఒక రోజు పిల్లలు తమ స్కూల్‌కు వెళ్లి తరగతి గదుల్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు. ఎందుకంటే...;

Update: 2025-07-10 11:13 GMT

“సినిమాలు ప్రపంచాన్ని మార్చలేవు కానీ చూసే మనుషులను మాత్రం మార్చగలవు” – ఈ మాటను మనం ఎన్ని సార్లు విన్నా, అలాంటి ఓ మార్పు నిజంగా జరిగితే మాత్రం హృదయం ఆనందంతో పులకరిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇది. ఓ చిన్న సినిమాకు అర్థం చేసుకోగల వారిని కదిలించి, ఒక రాష్ట్రంలోని పాఠశాలల ముఖచిత్రాన్నే మార్చేసింది. అదే ‘శనార్థి శ్రీకుట్టన్‌’ అనే మలయాళ సినిమా.

కేరళలో గత నెల రోజులుగా ఏదో ఒక రోజు పిల్లలు తమ స్కూల్‌కు వెళ్లి తరగతి గదుల్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు. ఎందుకంటే అక్కడ క్లాసుల్లో మామూలుగా ఎప్పటిలాగే ఒకదానికొకటి వెనుకుగా పెట్టిన బెంచీలు కనిపించడం లేదు! అవి ఇప్పుడు చుట్టూ, గుండ్రంగా, సర్కిల్‌లో ఉన్నాయి. కొల్లం జిల్లాలోని R.V.V. స్కూల్‌, అదూర్‌, తూర్పు మంగడ్‌, పాలక్కాడ్‌, పాపినిశ్శేరి స్కూళ్లు — ఇవన్నీ ఇప్పుడు కొత్త లుక్‌లో మారిపోయి ఉన్నాయి.

అది యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఎవరూ పట్టించుకోని ఓ చిన్న సినిమా గత నెలలో 'సైనా ప్లే' అనే OTTలో విడుదలయ్యాక పెద్ద వాళ్లను,చిన్న వాళ్లను, టీచర్లను, తల్లిదండ్రులను ఆలోచనలో పడేసింది,వారిలో ఓ ప్రశ్నను నిలిపింది: "క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్‌లు ఎందుకు ఉండాలి?"

అసలేం ఉంది ఆ సినిమాలో?

తిరువనంతపురంలోని పల్లెటూరి ప్రైమరీ స్కూల్‌ – కె.ఆర్‌.నారాయణన్‌. అక్కడ సెవన్‌ ‘C’ సెక్షన్‌లో చదువుకుంటున్న శ్రికుట్టన్‌ అనే కుర్రాడు కథకు హీరో. ఇంట్లో పరిస్థితుల వల్ల స్కూల్‌కి లేట్‌గా వచ్చే వాడు, తరగతిలో చివరి బెంచ్‌కి పరిమితం అయ్యి ఉంటాడు. అతనికి తోడు ముగ్గురు అల్లరి స్నేహితులు. క్లాస్‌లో ఫ్రంట్‌బెంచ్‌లో కూర్చునేవాళ్లకి వీళ్లు పూర్తిగా అల్లరి గ్యాంగ్‌. ఉపాధ్యాయుడికి అయితే వీళ్ల మీద చిరాకు.

మామూలుగా మనం చెప్పుకునే "వీళ్లేం చదువుకోరు", "వాళ్ల వల్ల క్లాస్‌ కు బాడ్‌నేమ్‌ వస్తుంది" అనే నెగటివ్‌ ట్యాగ్స్‌. కానీ కథ మలుపు తిరుగుతుంది – శ్రీకుట్టన్‌ స్కూల్‌ ఎలక్షన్‌లో పోటీకి నిలుస్తాడు. అతని ఎదుట నిలిచేది ఫ్రంట్‌బెంచ్‌ వాడు అంబడి. ఇప్పుడు గెలుపు ఎవరిది?

అంతే కథ అనిపించొచ్చు. కానీ దర్శకుడు వినేష్‌ విశ్వనాథ్‌ చూపించదలుచుకున్నది వేరే దారిలో ఉంది. క్లాస్‌రూమ్‌లోనే మొదలయ్యే వివక్ష – ఎవరికి ముందు బెంచ్‌, ఎవరికి వెనుక – అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే కీలక విషయం మీద కథనమే ఈ సినిమా.

బ్యాక్‌బెంచ్‌ = బ్యాడ్ స్టూడెంట్? ఎవరు అన్నరు?

మనకు చిన్ననాటి నుంచే ఒక అభిప్రాయం మనస్సులో నాటుకుపోయి ఉంటుంది – వెనుక కూర్చునేవాడు అల్లరి చేసేవాడు, ముందు కూర్చునేవాడు ఆలోచించేవాడు. కానీ ఇది ఎంత పెద్ద అపోహో చెప్పడానికి దర్శకుడు ఈ సినిమాను ఓ ఆయుధంలా వాడుకున్నాడు. శ్రికుట్టన్‌ లాంటి పిల్లల తెలివితేటలు, చురుకుదనం, నాయకత్వం – ఇవన్నీ స్కూల్‌వాళ్లు మొదట్లో నమ్మరు. కానీ వాళ్లు నమ్మకపోయినా నిజాలు మారవు. చివరికి ఆ ‘బ్యాక్‌బెంచర్‌’నే స్కూల్‌ను మార్చే నాయకుడవుతాడు.

"Labels are for files, not for children."

ఫ్రంట్‌బెంచ్‌, బ్యాక్‌బెంచ్ అన్నవి లేబుల్స్‌ మాత్రమే. పిల్లల ప్రతిభకు వాటితో సంబంధం లేదు.

కేరళ బడుల్లో మార్పు

ఈ సినిమా చూసినవాళ్లు కేవలం ఫీల్‌ అవ్వలేదు, రియాక్ట్‌ అయ్యారు. స్కూల్‌ కరెస్పాండెంట్‌లు, టీచర్లు, తల్లిదండ్రులు ఆలోచనలో పడిపోయారు – బ్యాక్‌బెంచ్‌ అనే అనే విషయాన్నే తీసేస్తే ఎలా ఉంటుందా? ఫలితం? బెంచీలను ఒకదానికొకటి వెనుకగా పెట్టే పద్ధతిని తొలగించి, సర్కిల్‌గా, సమాన దూరంలో పెట్టిన కొత్త స్టైల్‌ బెంచింగ్‌. అందరూ ఒకే దూరంలో ఉపాధ్యాయుడిని చూస్తారు. ఎవరూ వెనుక వాడు వుండడు.

"కనీసం ఆరు స్కూళ్లు ఇప్పటికే ఈ పద్ధతిని మొదలుపెట్టాయి. వాళ్ళు మా ఇన్‌స్టాగ్రామ్ పేజీని ట్యాగ్ చేసాక మాకు ఈ విషయం తెలిసింది" అని వినేష్ విశ్వనాథ్ చెప్పారు.

"Power lies not in where you sit, but in how you think." బ్యాక్‌బెంచ్, ఫ్రంట్‌బెంచ్ అనేది సీటింగ్ మ్యాటర్ కాదు, మైండ్‌సెట్ మ్యాటర్.

ఇది కొత్త విషయం కాదు...

1996లో కేంద్రం సూచించినా “క్లాస్‌రూమ్‌లో సీటింగ్‌ వివక్షకు దారితీయకూడదు” అని కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసినా... అవి పెద్దగా ఫలించలేదు. కానీ ఓ సినిమా చూపించగలిగిన వాస్తవాన్ని ఆ సర్క్యులర్లు చూపలేకపోయాయి. ఇదే సినిమాల శక్తి.

మార్పు తెచ్చే సినిమా

"Cinema is a mirror by which we often see ourselves."

— Alejandro González Iñárritu

ఏదైమైనా "సినిమా చూస్తే క్షణిక ఉత్సాహమే, జీవితంలో ఏమీ మారదు" అనే వాదనను ‘శనార్థి శ్రీకుట్టన్‌’ వదిలించేసింది. ఇది కేవలం కథ కాదు – ఇది ఓ బలమైన ప్రకటన. సమాజాన్ని చిన్న చూపు చూసే కోణాన్ని మార్చాలంటే, చిన్న చిన్న విషయాల నుంచే మొదలు కావాలి అని చెప్పిన సినిమా.

ఇప్పుడీ మార్పు కేరళలో మొదలైంది. ఇంకో అడుగు ముందు వేసి దేశమంతా వ్యాప్తి చెందితే? మన బడుల్లో ఫ్రంట్‌బెంచ్‌, బ్యాక్‌బెంచ్‌ అనే లేబుళ్లు తొలగిపోతే? అప్పుడు నిజంగా "బ్యాచ్‌లో ముందున్నవాడు కాదు, లోపల తెలివిగలవాడే గొప్పవాడు" అనే నిజం గుర్తుకు వస్తుంది.

సినిమాలు మార్పు తెచ్చగలవా? – ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, ‘శనార్థి శ్రీకుట్టన్‌’ ఓటిటీలో చూడండి. తరవాత మీ క్లాస్‌రూమ్‌లో కూడా బెంచీలు ఎక్కడ ఉండాలో మీరు చెప్పగలరేమో చూడండి.

Tags:    

Similar News