ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మిథున్ చక్రవర్తి
'దాదా' కు దాదా సాహెబ్ వరించిన వేళ కొన్ని ముచ్చట్లు
By : జోశ్యుల సూర్యప్రకాశ్
Update: 2024-10-01 02:56 GMT
"నేను చాలా ఇరిటేటింగ్ యాక్టర్ ని. నేను తృప్తి చెందేదాకా డైరక్టర్ ని ప్రశ్నలతో చెండాడుతాను. నేను చేసే పాత్ర చాలా క్లియర్ కట్ గా ఉండాలనుకుంటాను. అది చాలా మందిని ఇబ్బంది పెడుతోందని తెలుసు. ఈయనేంటి చెప్పింది చేయకుండా కథ,క్యారక్టర్ ఏంటని అడుగుతారు అని నా వెనకాల తిట్టుకోవటం ఎరుగుదును. నా వర్కింగ్ స్టైల్ తెలియని డైరక్టర్ ఖచ్చితంగా పిచ్చిక్కిపోతారు" అంటారు దాదా ...అదే మిథున్ చక్రవర్తి. ఆయన్ను "The Dada of Bollywood" అంటూంటారు. ఇప్పుడు ఆయన్ని దాదా సాహెబ్ అవార్డ్ వరించింది.
అలాగే మీరు ఓ పాత్ర చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేయాలి.నేను అయితే ఒక్క ఇంచ్ కూడా ఆ పాత్ర లోంచి ప్రక్కకు జరగకూడదు అనుకుంటాను. అందుకే నేను నటించే నా పాత్ర పరిధి, విస్తృతి తెలుసుకోవాలనుకుంటాను. సినిమా మొత్తం ఆ పాత్ర ఏక రూపత ఉండాలి అంటారు. అందుకే ఆయన తన తొలి చిత్రం ‘మృగయా’ (1976)కే ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు పొందగలిగారు.
మొదటి ఛాన్స్ రావటం ఇప్పటికి మిథున్ కు ఆశ్చర్యమే
‘‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...’’ వినని, మిథున్ చక్రవర్తి డాన్స్ లకు స్టెప్ లు వేయని భారతీయుడు ఉండడేమో. ఎనభైల్లో ఆయనో సెన్సేషన్. ఇప్పటికి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లో కనిపిస్తే చూద్దామనుకునే ప్రేక్షకులు ఉన్నారు. 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికీ సేవలందిస్తూనే ఉన్నారు. సినిమాల వల్ల ఆయన లబ్ది పొందిన దాని కన్నా ఖచ్చితంగా ఆయన ద్వారా సినిమాలు,నిర్మాతలు, దర్శకులే ఎక్కువ. అసలు ఆయన సినీ కెరీర్ ప్రారంభమే ఆశ్చర్యంగా ఉంటుంది.
మామూలుగా సినిమాల్లో ట్రై చేసే వాళ్లు మూవీ ఆఫీస్ లు చుట్టూ, డైరక్టర్, ప్రొడ్యూసర్స్ చుట్టూ ప్రదక్షణాలు చేస్తూంటారు. కానీ మిథున్ ఎంట్రీ గమ్మత్తు. ఆయన ముంబైకు వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అది దొరక్క నైట్ క్లబ్ లో డాన్సర్ గా చేరటమే జీవితంలో పెద్ద మలుపు. నిజానికి బి.ఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ చేసిన ఆయనకు అది ఇష్టం లేదు. కానీ బ్రతుకు తెరువుకు ఏదైతే ఏంటి అనుకున్నారు. అలా నైట్ క్లబ్ లో డాన్స్ చేస్తూంటే అక్కడికి వచ్చే సినిమావాళ్ల దృష్టిలో పడ్డారు. చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు ఎడ్రస్ లు ఇచ్చి కలవమన్నారు. కాని ఆయన్ని మృణాల్ సేన్ మాత్రమే ఎంచుకున్నారు. తన చిత్రంలో అవకాసం ఇచ్చారు. ఆ అవకాశం తనను వెతుక్కుంటూ రావటం తనకు ఇప్పటికి ఆశ్చర్యమే అంటారు మిథున్.
సూసైడ్ చేసుకుందామనుకున్నాను
ముంబైకి వచ్చిన కొత్తలో తనకు పనేమీ దొరకనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను అంటారు ఆయన. తెల్లారితే భోజనం ఉంటుందా, ఎక్కడ పడుకోవాలో అర్దమయ్యేది కాదు. ఓ టైమ్ లో నేను సూసైడ్ చేసుకుందామనుకున్నాను. పోనీ వెనక్కి తిరిగి కోలకత్తాకు వెళ్దామా అంటే నా రాజకీయ నేపధ్యం నన్ను ఇబ్బంది పెడుతుందని తెలుసు. తాను నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవాడినని తన సోదరుడు మరణంతో అవన్నీ వదిలేసి ముంబై వచ్చాను అంటారు.
రంగు తక్కువని మిథన్ ని దూరం పెట్టిన వేళ...
మృగయా సినిమా కోసం ఆయన నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ శిక్షణ..క్రమశిక్షణ ఇప్పటికి ఆయనలో తొంగిచూస్తూంటుంది. ఆయన సినీ కెరియర్‌లో మొత్తం మూడు నేషనల్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు. ఇక కెరీర్ ప్రారంభం రోజుల్లో తను రంగు తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారు.అయితే పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకుని. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేసానంటారు.
మిథున్ నుంచి వచ్చిన అనేక సినిమాలు భాక్సాపీస్ ని బ్రద్దలు కొట్టాయి. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి సినిమా ప్రియులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ‘బన్సారీ’, ‘అమర్‌దీప్’, ‘సాహాస్’, ‘వాంటెడ్’, ‘బాక్సర్’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్’, ‘దలాల్’, ‘భీష్మ’, ‘సుల్తాన్’, ‘గురు’, ‘కిక్’, ‘బాస్’వంటి ఎన్నో చిత్రాలు ఆయన్ని గుర్తుండిపోయేలా చేసాయి.ఆయన హీరోగా 80, 90 లలో ఒక ఊపు ఊపారు. అలాగే ఆయన కెరీర్ లో మరో రికార్డ్ . బాలీవుడ్‌లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత.. తన కెరియర్‌లో సుమారు 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.
‘ఆ కష్టాలు పడ్డాను కాబట్టే అన్ని జాగ్రత్తలు’
ఆయన ఓ సారి అంటారు... నాకు క్యారక్టర్ ఎంచుకున్న తర్వాత అత్యంత కష్టమైన పని, ఆ పాత్రకు తగినట్లు మేకప్ చేసుకోవటం, ఒప్పించటం అంటారు. అయితే తన స్వేచ్చ డైరక్టర్ ఫైనల్ గా తీసుకునే నిర్ణయం ముందు వరకే అంటారు. ముంబయి వచ్చిన కొత్తల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. పబ్లిక్ పార్కులు, హాస్టల్స్ ఆవరణల్లో పడుకునేవాడిని. కష్టాలు తట్టుకోలేక చనిపోవాలనిపించింది. కాకపోతే ధైర్యంగా నిలబడ్డా. అన్నింటినీ ఎదుర్కొన్నా.అందుకేనేమో అన్ని జాగ్రత్తలు’’ అంటారు మిథున్.
హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు మిథున్ చక్రవర్తి. హీరోగానే కాకుండా సహాయనటుడిగా, విలన్‌గా కూడా ఆయన ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్రం ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మిథున్ చక్రవర్తి ‘‘పద్మభూషణ్’’ అవార్డును కూడా అందుకున్నారు.
మిథున్ కూ అదో బ్యాడ్ పీరియడ్
సినిమాల్లో అవకాశాలు మెల్లిగా తగ్గటం మొదలయ్యాక మిథున్ మోనార్క్ గ్రూప్ పేరుతో హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అది దెబ్బ కొట్టింది. ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందులు కు దారితీసేలా చేసింది. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘ ‘మోనార్క్’ హోటల్ ప్రారంభించినప్పుడు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నా. వాటిని తీర్చడానికి బి-గ్రేడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాను. ’’ అంటారు బాధగా.
అవార్డ్ ల వెనక రాజకీయ కోణం
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మిథున్ చక్రవర్తి 2014లో రాజ్యసభ సభ్యుడిగా వర్క్ చేశారు. 2016లో ఆ పదవికి రాజీనామా చేశారు. 2021లో భాజపాలో చేరి కొనసాగుతున్నారు. అదే ఇప్పుడు విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది. ఒకే ఏడాది రెండు అవార్డులకు ఎంపిక కావడం వెనుక రాజకీయ కోణం ఉందా అనేది సోషల్ మీడియాలో జరుగుతన్న చర్చ. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకే మిథున్ చక్రవర్తికి వరుస అవార్డుల పంట పండిందని కొందరు అప్పుడే కామెంట్స్ మొదలెట్టారు. అయితే అదే సమయంలో మిథున్ మంచి నటుడు అనే విషయం మర్చిపోకూడదు.
ఇక సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke Award) ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి వరించటం సినిమావాళ్లకు ఆనందం కలిగిస్తోంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింనప్పటి నుంచి ఆయన అభిమానులతో పాటు సిని స్టార్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.