40 యేళ్ల నాటి మధుర గీతాల హిందీ ‘మసూమ్’ మళ్లీ వస్తాంది...
'మాసూమ్' కి 42 ఏళ్లు, ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కపూర్ జీవితంలో ఆ మూడు రోజులు ఇప్పటికీ ప్రశ్నార్దకమే
ఇళయరాజా ఓ కాన్సర్ట్ లో ఓ మాట అన్నారు. మనం విన్న ప్రతి పాట మన హృదయంలో ఉండిపోతుంది, ఎన్నో ఏళ్ల తర్వాత ఆ పాటను విన్నప్పుడు ఆ సందర్భం, లేదా ఆ సినిమా లేదా ఆ రోజు, ఆ క్షణాలు, అప్పుడు మనతో ఉన్న మనుషులు అన్ని గుర్తుకు వస్తాయని , అలా పాట మన జీవితంలో భాగం అని చెప్పుకొచ్చారు. అదే విధంగా సినిమా కూడాను. మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్న... కొన్ని సంఘటనలు, సినిమాలు, సంతోషాలు, బాధపడిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవి ఆ సినిమా ప్రస్తావన, పాటో, టైటిల్ లేదా చివరకు ఆర్టికల్ వచ్చినప్పుడల్లా అవి బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా తాము వయస్సులో ఉన్నప్పుడు చూసిన సినిమా లు గుర్తుకు వస్తే ఆ క్షణాలు కళ్ల ముందు ఉంటాయి. ఎంతో ఆనందం వేస్తుంది. అలా చాలా మంది జీవితాల్లో మర్చిపోకుండా తాజాగా ఉన్న జ్ఞాపకం 'మాసూమ్' (Masoom).
ఎరిక్ సెగల్( Erich Segal) పాపులర్ నవల మ్యాన్ ఉమెన్ & చైల్డ్ (Man, Woman and Child) కి అనుసరణగా 'మాసూమ్' (1983) రూపొందింది. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. యువ ప్రేక్షకులను తనతో పాటే తీసుకెళ్లింది. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ కు మొదటి సినిమా. అప్పటికి ఆయన ఏ సినిమాలో పనిచేయలేదు. ఇన్నాళ్ల తర్వాత మనం ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ..ఓ కల్ట్ క్లాసిక్ అంటున్నాం. అయితే రిలీజైన నాటి రోజుల నాటి పరిస్థితి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. శేఖర్ కపూర్ ఇంకా ఈ సినిమా తర్వాత ఇంకేమీ చెయ్యలేను ఫెయిల్యూర్ అనుకున్నారట.
రీసెంట్ గా ఓ ఇనిస్ట్రా స్టోరీలో ఆ విషయం గుర్తు చేస్తూ శేఖర్ కపూర్...మేము సినిమా షూట్ పూర్తి చేసి అందరికీ షోలు వేసాము. అప్పట్లో సినిమాలు బిజినెస్ చేసే ముందు డిస్ట్రిబ్యూటర్స్ కు చూపెట్టడం ఆనవాయితీ. అవొక ఆనందకరమైన క్షణాలు కూడా. డిస్ట్రిబ్యూటర్స్ నా మొదటి సినిమాను చూశారు. మధ్యలో డైరక్ట్ చేసిన నా వంక అబ్బురంగానూ చూశారు. సినిమాని బాగా రిలీజ్ చేశారు. కానీ చిత్రం ఏమిటంటే నాకు,డిస్ట్రిబ్యూటర్స్ కు తప్పించి ఎవరికీ నచ్చినట్లు లేదు. హాల్స్ అన్ని ఖాళీ. నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ డే ఫస్ట్ షోకు నేను వెళ్లాను ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకుందామని . సినిమా హాలు దాదాపు ఖాళీ..నేను ఓ పక్కన , చీకట్లో మరొ పక్కన ఓ జంట . ఆ క్షణం నాకు సినిమాపై ఆసక్తి మొత్తం చచ్చిపోయింది. శుక్రవారం, ఆ తర్వాత శనివారం, సోమవారం, మంగళవారం ఇలా ప్రతి రోజు ఖాళీ థియేటర్స్ నన్ను వెక్కిరించేవి.
డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచి..సినిమాని తీసేస్తున్నాం అని చెప్పారు. నిజంగా ఇది గొప్ప సినిమానే కానీ వెరీ సారి... థియేటర్స్ వాళ్లు జనం లేనిదే షోలు వేయలేమని చెబుతున్నారు అని అన్నారు. చాలా పెద్ద ఫిల్మ్ మేకర్ అవుదామనుకున్న ఆలోచనలు మొత్తం ఆగిపోయాయి. అసలు నిజం చెప్పాలంటే ఏ ఆలోచనలు లేవు. అక్కడే హిల్ రోడ్ లో చాట్ తింటూ ఉండేవాడ్ని. అంతకు మించి చేసేదేమీ లేదు. అయితే ఆ మరుసటి రోజు మ్యాజిక్ జరిగింది. మా అంకుల్ ప్రముఖ దర్శకుడు విజయ్ ఆనంద్ ఫోన్ చేసి..హే శేఖర్...మాకు టిక్కెట్లు రెండు కావాలి ఎరేంజ్ చేస్తావా...హౌస్ ఫుల్, టిక్కెట్లు దొరకడం లేదు అన్నారు.
నాకు ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. నేను థియేటర్ దగ్గరకు దాదాపు పరుగెత్తుకుంటూ వెళ్లాను. అక్కడ లైన్ లో జనం టిక్కెట్ ల కోసం వెయిట్ చేస్తూ... ఏం జరిగింది..ఒక్క రోజులో ఏం మార్పు వచ్చిందో తెలియలేదు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ కోసం ఎవరినీ అడగాల్సిన పని లేకపోయింది. ఆ తర్వాత జరిగింది అంతా హిస్టరీ... ఇప్పటికీ నాకు ఆ మంగళవారం, బుధవారం ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా మౌత్ టాక్ ఎలా స్ప్రెడ్ అయ్యిందో తెలియదు.. నిజంగా అప్పుడు అలా జరగకపోయి ఉంటే 'మాసూమ్' ని ఎప్పుడో మర్చిపోదుము, నేను సినిమాలు వదిలేసి ఛార్లెట్ ఎక్కౌంటెంట్ గా వెళ్ళిపోదును అంటారు ఆయన ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.
సర్లేండి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు 'మాసూమ్' ని 42 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ శేఖర్ కపూర్ ఇంటర్వ్యూలో సీక్వెల్ గురించి చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసించే 80 ఏళ్ల వృద్ధ జంట చుట్టూ తన సీక్వెల్ సినిమా తిరుగుతుంది అన్నారు. "మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారు మొదట చెప్పేది తమ ఆస్తి గురించి, అది స్థిరాస్తి అయిన ఇల్లు గురించే అంటే నమ్ముతారా.
అలాగే ఆ తర్వాత మాట... ఆ స్దిరాస్ది విలువ ఏమిటనేది. ఆ ఇంటి రియల్ ఎస్టేట్ విలువ గురించే చెప్తూంటారు. అయితే ఇల్లు అంటే ఏమిటి - పెరుగుతున్న వ్యక్తులు, గోడలకు జ్ఞాపకాలు, అంతెందుకు మీరు కూర్చున్న సోఫా ఒక జ్ఞాపకం . ప్రతిదీ ఒక జ్ఞాపకం కాబట్టి నేను నా సీక్వెల్ సినిమాకు ఇంటి గురించి బేసిక్ ఐడియాను ను తీసుకుంటున్నాను అన్నారు. మసూమ్ నిజమైన మానవ భావోద్వేగాలు గల కథ అని, అలాంటిదే ఈ సీక్వెల్ అని కపూర్ చెప్పారు. త్వరలోనే ఆయన చెప్పబోయే ఇంటి జ్ఞాపకాలను చూద్దాం. అలాగే ఈ లోగా 'మాసూమ్' జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.
ఇక మరో మాట . 'మాసూమ్' లో పాటలన్నీ సూపర్ హిట్. ఆర్.డి బర్మన్ స్వరపరిచిన సంగీతం ఈ తరాన్ని కూడా మురిపిస్తుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన గుల్జార్ పాటలన్నీ రాశారు. అందుకే అవన్నీ సినిమాలో , మన జీవితంలో భాగమైపోయాయి. ఈ సినిమాకు బర్మన్..బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినందుకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు. సినిమాకూ బోలెడు అవార్డ్ లు వచ్చాయి. కమర్షియల్ గానూ హై సక్సెస్ అయ్యింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా అందరూ ఎదురుచూసేదే. ఏమంటారు.