ఇది కదా సక్సెస్ అంటే:చైనా మనసు దోచిన ‘మహారాజా’

చిన్న సినిమా 40,000 స్క్రీన్స్ + థియేటర్స్ లో రిలీజ్, 500 కోట్లు టార్గెట్

Update: 2024-11-21 12:03 GMT

సరైన కంటెంట్ పడితే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ రిజల్ట్ ను నమోదు చేస్తాయి. అలాగే సినిమా చేసి ఊరుకోకుండా దాని మార్కెటింగ్ ని సైతం ఫెరఫెక్ట్ గా చేయగలగాలి. అప్పుడే ఆ సినిమా అద్భుతాలు చేస్తుంది. నిర్మాతకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చి సక్సెస్ అయిన మహా రాజా సినిమా సైతం అదే దారిలో ప్రయాణిస్తోంది. విజయ్ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలై ఘన విజయం సాధించింది. పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.

వాస్తవానికి మహారాజా చిత్రం తమిళంకే పరిమితంగా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమాలో ఊహించని ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్‌ సామినాథన్‌ మలవటం కలిసొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడింది. ప్రభాస్ కల్కి సినిమా రాకపోతే ఈ సినిమా రన్ ఇంకా ఉండేది. అయితేనేం ఇప్పుడు జాక్ పాట్ కొట్టింది. ఇతర దేశాలకు వెళ్తోంది. ఒక ఇండియన్‌ చిన్న సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానుండటంతో సినీ అభిమానులు ఆనందం మామూలుగా లేదు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం మామూలు విషయం కాదు.

ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్‌మెంట్ కు చైనా సినీ అభిమానులు కనెక్ట్‌ అవుతారని భావిస్తున్నారు. అదే జరిగితే భారీగా కలెక్షన్స్‌ రావడం గ్యారెంటీ . ఇన్ని థియేటర్స్ లో అక్కడ కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్‌లో సినిమా రన్‌ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేసి చెప్తున్నారు.

విశేషమేమిటంటే, ఇది చైనాలోని సగం స్క్రీన్స్ లో ప్రదర్శన అన్నమాట. 2021 లెక్కల ప్రకారం చైనాలో స్క్రీన్ల సంఖ్య 80 వేలు దాటింది.20121 సెప్టెంబర్ నాటికి చైనాలో 14243 ధియేటర్లు, 80743 స్క్రీన్లు ఉన్నాయి. చైనాలో రోజు రోజుకి వీటికి సంఖ్య పెరుగుతుంది. 2020 నాటి తో పోలిస్తే 2021లో 861 ధియోటర్లు,4862 స్క్రీన్లు పెరిగాయి. రోజుకి చైనాలో 17.8 స్క్రీన్లు పెరుగుతున్నాయని చైనా ఫిల్మ్ న్యూస్ రిపోర్టు పేర్కొంది. ఈ లెక్కన మహారాజ చైనాలోఎంత ఆసక్తిరేకెత్తించిందో అర్థం చేసుకోవచ్చు.

మహారాజా చిత్రం కథ విషయానికి వస్తే ...

బార్బర్ అయిన మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుని తన కూతురు జ్యోతి తో కలిసి జీవిస్తూంటాడు. సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తున్న మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ కు వెళ్తాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌కు కంప్లైంట్ చేస్తాడు. ఇంతకీ మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? అతని కంప్లైంట్ ను స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు ఒప్పుకోలేదు? అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ముగ్గురు వ్య‌క్తులెవ‌రు?వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఏముంది సినిమాలో

అంత‌ర్లీనంగా క‌ర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిప‌డిన ఈ సినిమా ఓ భిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. స్టోరీ లైన్ గా చూస్తే రొటీన్ రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగానే క‌నిపిస్తుంది. కానీ, ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను మొదటి నుంచి చివరి దాకా ఇంటెన్స్ గా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌ ఈ చిత్రాన్ని స్పెషల్ గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. చాలా సింపుల్ పాయింట్‌లా కొద్ది పాటి ఫన్ తో మొద‌లై.. ట్విస్టుల‌తో ఎమోషనల్ గా ముగుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ లు. సేతుప‌తి యాక్ష‌న్ హంగామా బాగా ఆక‌ట్టుకుంటాయి.

సినిమాలో మొదటి నుంచి చివరి దాకా అస‌లు మ‌హారాజాకు జ‌రిగిన అన్యాయ‌మేంటి? ఎన్ని అవ‌మానాలు ఎదురైనా ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ మ‌హారాజా పోలీస్ స్టేష‌న్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు? వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాతో అత‌నికి ఉన్న విరోధ‌మేంటి? అనేది మనకు ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిక్కుముడుల‌న్నింటినీ ఒకొక్క‌టికీ విప్పిన తీరు మనని మెప్పిస్తుంది. త్వరలో చైనా ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందనటంలో సందేహం లేదు.

Tags:    

Similar News