కల్యాణి ప్రియదర్శన్ ' కొత్తలోక చాప్టర్ 1' మూవీ రివ్యూ
జానపదం + సూపర్ పవర్స్;
ఒక చిన్న గిరిజన తండా…
ఒక రాజు అహంకారం…
ఒక అమ్మాయి భవిష్యత్తును శాశ్వతంగా మార్చిన సంఘటన…
ఆమె పేరు నీల (కల్యాణి ప్రియదర్శన్) . రాజు సైన్యం దాడి చేసి తండా మొత్తాన్ని తగలబెడుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబం గుహలోకి పారిపోతుంది. అక్కడ నీల కళ్ళముందు కనిపించింది – తల తెగి పడిన ఒక అమ్మవారి విగ్రహం. అదే క్షణం నుండి నీలలో మార్పు వస్తుంది. ఆమె సాధారణ మనిషి కాదు. ఆమెకు అతింద్రియ శక్తులు వస్తాయి. ఆమె ఇమ్మోర్టల్ అవుతుంది.
కానీ ఒక్కోసారి కొన్ని వరాలు శాపాలు కూడా. తన కూతురు ని రక్తం తాగే యక్షిణి అని గ్రహించిన తల్లి, నీలను తండా నుండి పంపించేస్తుంది. అలా ఆమె వందల ఏళ్లుగా మరణం లేకుండా జీవిస్తూ, తనలాంటి శక్తులు కలిగిన మనుష్యులను వెతుకుతుంది. వారిలో మంచి మనుషులను ఎంచుకుని వారి సాంగత్యంలో , అమాయకులను కాపాడుతూ కాలం గడుపుతుంది.
కాలం మారుతుంది… నాగరికతలు మారుతాయి…
కానీ నీల మాత్రం అలాగే ఉంటుంది.
ప్రస్తుతం ఆమె బెంగళూరులో, ఆమె “చంద్ర” పేరుతో జీవిస్తుంది. బేకరీలో పని చేస్తూ సాధారణ జీవితంలా గడుపుతోంది.ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. మరో ప్రక్క చంద్ర దృష్టి నగరంలో అంతర్గతంగా జరుగుతున్నది ఘోరమైన నేరం పై పడుతుంది.అది మరేదో కాదు రాజకీయ నాయకుల అండతో, పోలీసుల సహకారంతో నడిచే ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియా . అమాయకులను కిడ్నాప్ చేసి, చంపేస్తున్న ఆ నరమృగాలను చూసిన చంద్రలో మరోసారి మంటలు రగులుతాయి.
ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది… సూపర్ పవర్స్ ఉన్న చంద్ర ఈ మాఫియాను ఎలా ఎదుర్కొంది?
ఈ పోరాటంలో ఆమెను ఎదురయ్యే పరీక్షలు ఏమిటి? ఆమెకు శాపంలా మారిన ఇమ్మార్టాలిటీ, ఒక వరమా లేక మళ్లీ శత్రువుల బలహీనతగా మారిందా? మిగతా కథ తెరమీదే చూడాలి…
విశ్లేషణ
“Some legends have an element of truth…” ఈ లైన్ తోనే సినిమా ప్రారంభం అవుతుంది. దాంతో మనం చూసే కథ ఫాంటసీ మాత్రమే కాదు, పురాణాల మీద ఆధారపడి ఉందని అర్దమవుతుంది. దాంతో కొత్త cinematic flavour ఎక్సపీరియన్స్ చేయబోతున్నామని అర్దమవుతుంది. అందుకు తగ్గట్లే స్టోరీ వరల్డ్ బిల్డ్ చేసారు. రెగ్యులర్ గా ఇలాంటి సూపర్ హీరో సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ కి విలన్‌తో కాంప్లిక్ట్స్ పెడతారు. అతని నుంచి ప్రపంచాన్ని రక్షించటమే కథా లక్ష్యమై ఉంటుంది.
అయితే, లోక సినిమాలో ఇలాంటిదేమీ కాకుండా వరల్డ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమా ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను నెలకొల్పే విధంగా మేకర్స్ తీర్చిదిద్దారు. అయితే ఈ క్రమంలో స్ట్రాంగ్ విలన్ కథకు లేకుండా పోయారు. నీలకు ఎదురు నిలిచే నాచియప్ప గౌడ పాత్ర పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది.ఎంతసేపూ యూనివర్స్ బిల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో నెరేషన్ కొంచెం బోరింగ్‌గా అనిపించింది.
ప్రధాన పాత్ర చంద్ర అసలు ఐడెంటిటీ రివీల్ అయ్యే సీక్వెన్స్ ఒక డార్క్ ఫెయిరీటేల్ లా ఉంటుంది. ఈ సీక్వెన్స్ లో ఫోక్‌లొర్ ఎలిమెంట్స్ తీసుకుని, వాటిని సంక్లిష్టమైన మోడ్రన్ మైథ్ గా మలుపు తిప్పడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ విజువల్ గా స్టన్నింగ్ గా తీర్చి దిద్దారు. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్‌ను చాలా బాగుంది.
అయితే కథ ఎంత కొత్తగా అనిపించినా, విజువల్ గా అద్బుతంగా ఉన్నా ఎమోషనల్ ఆర్క్ ఫెరఫెక్ట్ గా ఉంటేనే మన మనస్సుని తాకుతుంది. అదే ఈ సినిమాలో తగ్గిందనిపించింది. అలాగే సెకండ్ పార్ట్ ఉండటంతో చాలా పాత్రలను సెకండాఫ్ లో పరిచయం చేసారు. వాటిని సరిగ్గా వాడలేదు. దాంతో కాస్త కన్ఫూజింగ్ గా అనిపిస్తుంది.
టెక్నికల్ గా ..
డైరక్టర్ డామినిక్ అరుణ్ ..కథకు కొత్త పాయింట్ ని ఎంచుకున్నా రైటింగ్‌లో ఇంకాస్త షార్ప్‌నెస్ ఉంటే బాగుండేది. ఇక జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్ వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో బాగా స్లోగా వెళ్తున్న ఫీల్ ని తగ్గించి ఉంటే బాగుండేది. డబ్బింగ్ బాగుంది.
నటీనటుల్లో ..
చంద్ర పాత్రలో, కళ్యాణి ప్రియదర్శన్ చాలా బాగా చేసింది. ఓ కొత్త లుక్ తో , ఎక్సప్రెషన్స్ తో మనని ఆకట్టుకుంటుంది. అలాగే ఆమెను ప్రేమించే సన్నిగా నస్లెన్ కామిక్ టైమింగ్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది.
ఫైనల్ థాట్:
మనం చిన్నప్పటి నుండి విన్న జాపపద కథలను, అందులోని క్యారెక్టర్లను, కొత్త యాంగిల్‌లో రీ-ఇమాజిన్ చేసి, ఒక సూపర్‌హీరో యూనివర్స్‌గా తీర్చిదిద్దడం బాగుంది. మనకు MCU షేడ్స్ తప్పక గుర్తొస్తాయి, కానీ ఇది బ్లైండ్ కాపీలా అనిపించదు. హ్యాపీస్. అయితే కథకు కీలకంగా సెకండాఫ్ లో వచ్చే ఆర్గాన్ ట్రాఫెకింగ్ సబ్ ప్లాట్, సూపర్ పవర్స్ కలిగిన మిథ్ గ్రాండియర్ తో సరితూగలేదు. క్లైమాక్స్ రష్ మోడ్ లో ఉండటం, ఎమోషనల్ పే ఆఫ్ వీక్ అనిపించటం లేకపోతే ఇంకా బాగుండేది.