సు ఫ్రమ్ సో’ సినిమా రివ్యూ
సింపుల్ స్టోరీకి షాకింగ్ మలుపు!";
రీసెంట్ గా కన్నడంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా— ‘సు ఫ్రమ్ సో’. కేవలం రూ.6 కోట్ల మితమైన బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఎలాంటి స్టార్ హైప్ లేకుండానే సైలెంట్ గా విడుదలై… స్టార్స్ లేకపోయినా కేవలం కంటెంట్ పవర్ తోనే బాక్సాఫీస్‌ను కదిలించింది. ఎక్సపెక్టేషన్స్ లేకుండా మొదలైన ఈ ప్రయాణం, కన్నడలో ఇప్పటికే రూ.35 కోట్లకు పైగా వసూలు చేస్తూ, ప్రస్తుత దశలో కంటెంట్ ఈజ్ కింగ్ అనే వాఖ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పుడు, ఈ విజయవంతమైన లోకల్ ఫినామెనన్, భాషా గోడలు దాటి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమానేనా ...ఎలా ఉంది?
స్టోరీ లైన్
కర్ణాటక తీరప్రాంతంలోని ఒక ప్రశాంతమైన ఊరు. అక్కడ రవన్న (షానిల్ గౌతమ్)అంటే అందరిలో భయంతో కలిసిన గౌరవం . అతను చేసేది తాపీ మేస్త్రి పని అయినా ఆ ఊరి పెద్దమనిషే. ఊరిలో పెళ్లి కావొచ్చు, చావు కావొచ్చు — ఏ ముఖ్యమైన వేడుకైనా రవన్నే ముందుండాలి. నలభై దాటినా పెళ్లి కాని రవన్నకు బోలెడు నమ్మకాలు. అందులో మూఢ నమ్మకాలే ఎక్కువ. ముఖ్యంగా, ఆత్మలు, శ్రాద్ధ కర్మ లు అంటే ఇంక చెప్పక్కర్లేదు.
ఇక అదే ఊళ్లో ఉండే అశోక్ (జె.పి. తుమినాడ్) కు రవన్న అంటే పడదు. అలాగని డైరక్ట్ ఫైట్ కాదు. అవకాసం వస్తే దెబ్బ తీయాలనుకుంటాడు. ఇక అశోక్ ఓ రోజు పెళ్లి నుంచి తిరిగి ఇంటికెళ్తూ.. తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి దగ్గర ఆగుతాడు. ఆమె ఆ ఇంటి బాత్రూంలో స్నానం చేస్తోంది అనిపించి దొంగతనంగా ఆమెను చూసే ప్రయత్నం చేస్తాడు. అయితే అశోక్ చేసిన పనిని గమనిస్తారు. వెంటపడి పట్టుకుంటారు. దాంతో వారి నుంచి తప్పించుకోవటం కోసం తనకు దెయ్యం పట్టినట్లు డ్రామా ఆడతాడు. అక్కడదాకా హ్యాపీనే అనుకుంటే తెల్లారేసరికి ఫలానా అశోక్ కి దెయ్యం పట్టిందనే విషయం ఊరంతా తెలిసిపోతుంది. అందరూ అదే డిస్కషన్.
దాంతో ఇప్పుడు ఆ ఊరి వాళ్లు ఆ దెయ్యాన్ని వదిలించాలనుకుంటారు. అందుకోసం ప్రయత్నాలు మొదలెడతారు. కానీ వర్కవుట్ కావు. అప్పుడు ఊరి పెద్దైన రవన్న సీన్ లోకి దిగి సిటీ నుంచి కరుణాజీ స్వామీజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకొస్తాడు. అతను వచ్చాక ఇతనికి పట్టింది మామూలు దెయ్యం కాదని సోమేశ్వరం సులోచన అని ఫిక్స్ చేస్తారు. అక్కడ నుంచి ఆ లేని దెయ్యాన్ని వదిలించటానికి చేసే ప్రయత్నాలు ఏమిటి..అసలు సోమేశ్వరం సులోచన ఎవరు..ఆమెకు ఈ దెయ్యం మేటర్ సంభందం ఏమిటి...చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు జె.పి. తుమినాడ్ తనకు చూసిన ఓ వార్త —“తన కూతురు పెళ్లి చూడటానికి తల్లి ఆత్మగా వచ్చినది” చదివి దీన్ని ఒక సోషల్ హారర్ కామెడీగా మలిచాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఓ సింపుల్ పాయింట్‌ని చక్కటి స్క్రీన్‌ప్లేలో చుట్టి, గ్రామజీవనంలోని ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకుల ముందు ఉంచటం.
కథలో కీ క్యారక్టర్ అశోక్ (జె.పి. తుమినాడ్, ఇతనే డైరక్టర్ కూడా), ఒక చిన్న తప్పు నుంచి తప్పించుకునేందుకు “దెయ్యం పట్టింది” అన్న డ్రామా మొదలుపెడతాడు. కానీ ఆ సరదా అబద్ధం ఊరంతా నిజమని నమ్మేలా మారిపోతుంది. “ఇదిగో తోక అంటే అదిగో పులి” అన్నట్టు, ఆ రూమర్ లాంటి వార్త వ్యాప్తి చెందడంతో,ఆ ఊళ్లో ప్రతి ఒక్కరూ అతని చుట్టూ ఒక వలయం తయారు చేస్తారు.
స్క్రీన్‌ప్లే ఈ దశలో ఫుల్ ఫన్ రైడ్ మోడ్‌లోకి వెళ్తుంది — “ఒక మనిషి భయం, మరొకరి వినోదానికి మూలం అవుతుంది” అన్నట్లుగా సీన్స్ వెళ్తూంటాయి. రవన్న (షానిల్ గౌతమ్) — ఈ మిస్టరీని పరిష్కరించేందుకు రంగంలోకి దిగటంతో కథనం పరుగెడుతుంది. మధ్యలోరకరకాల పాత్రలు వచ్చిపోతూంటాయి. అలా కరుణాజీ స్వామీజీ (రాజ్ బి శెట్టి) ఎంట్రీ — “దెయ్యం పోగొట్టడం అనేది శాస్త్రం కాదు, అది వ్యాపారం” అని చమత్కారంగా గుర్తు చేసేలా ఉంటుంది. అతను ఇచ్చే చిత్రమైన సలహాలు, అశోక్ పడే కష్టాలు — హారర్ కామెడీకి కావలసిన టెంపోను పెంచుతాయి.
కథ మధ్యలో ఒక కీలక మలుపు — సులోచన, సోమేశ్వర గ్రామం నుంచి వస్తుంది. ఇక్కడే సినిమా కామెడీ నుంచి ఎమోషనల్ డ్రామాకు టర్న్ తీసుకుంటుంది. దర్శకుడు తుమినాడ్ ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటాడు — హాస్యాన్ని ఆపకుండా, సమాజంలో అక్కడక్కడ ఎదురౌతున్న ఓ విషయాన్ని ఎత్తి చూపెడుతాడు — ఇలా జరిగినప్పుడు సినిమా డ్రాప్ అయ్యి దెబ్బ తింటుంది. కానీ చిత్రంగా ఈ సినిమా ఇక్కడే బలంగా పనిచేసింది. భాను ట్రాక్ — హారర్, డ్రామా మేళవింపుతో — ప్రేక్షకుల మనసును హత్తుతుంది.
క్లైమాక్స్‌లో అశోక్ సులోచన కూతుర్ని రక్షించేందుకు చేసే యాక్షన్ హంగామా — గ్రామంలోని ఆత్మ, భయం, ధైర్యం అన్నింటినీ ఒకే ఫ్రేమ్‌లో కూర్చుతుంది. ముగింపులో రెండో భాగానికి స్పేస్ ఉంచడం కూడా తెలివైన విషయం.
మన తెలుగువాళ్లకు ఎక్కుతుందా
ఇది కన్నడ సినిమాగా నవ్వించినట్లుగా మన తెలుగు డబ్బింగ్ సినిమాగా అంతంగా అనిపించదు. ముఖ్యంగా కన్నడంలో పెద్ద హిట్టైన సినిమా అని ఎక్సపెక్టేషన్స్ తో చూస్తే పెద్దేమీ ఉన్నట్లు ఉండదు. లైటర్ వీన్ కామెడీ , ముఖ్యంగా డైలాగు కామెడీ, విలేజ్ క్యారక్టర్స్ నచ్చితేనే ఈ సినిమా మనకు ఎక్కుతుంది.
ఫైనల్ థాట్
‘సు ఫ్రమ్ సో’ హారర్ కామెడీ ఫ్రేమ్‌లో నవ్వులు, భయాలు, భావోద్వేగాలు, సామాజిక వ్యాఖ్య — అన్నింటినీ ఒకే తాటిపై నడిపించే చిత్రం. ఇది కేవలం ఒక గ్రామ కథ కాదు, చిన్న ఊరులోని మనష్యుల మనస్తత్వాలు, మానవ సంబంధాలు, సత్యం-అబద్ధం మధ్య ఉండే సన్నని గీత గురించి కూడా.