తెరపై కాశ్మీర్ ప్రయాణం !
తెల్లని మంచు నుంచి తుపాకి పొగ వరకు;
"అవును, భూమిపై స్వర్గం ఎక్కడైనా ఉందంటే, అది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది."
— మొఘల్ చక్రవర్తి జహంగీర్ (కాశ్మీర్ గురించి)
భారతదేశపు ప్రతి గుండె కొసలో... కాశ్మీర్ అనే ఒక కల ఉంది.
ఆ కలను మన గుండెల్లో నాటినది సినిమాలు.
తెల్లటి మంచు పర్వతాల మధ్య ఎగురుతున్న స్కార్ఫులు... పచ్చని లోయల్లో ఆలపించే ప్రేమగీతాలు... మన ఊహలలో, కాశ్మీర్ ఓ అమరమైన స్వర్గంగా నిలిపాయి.
ఒకసారి అయినా అక్కడికి వెళ్లాలని ప్రతి గుండెలో ఆకాంక్ష పుట్టింది.
కాలచక్రం తిరిగింది. స్వర్గంపై మబ్బులు కమ్ముకున్నాయి.
తుపాకుల మ్రోగింపు, బాంబుల దుమ్ము... ఆ పచ్చని లోయలను రక్తసిక్తం చేశాయి.
ఒకప్పుడు ప్రేమ పాటలు పాడిన లోయలు — ఇప్పుడు బాధా హృదయ వేదనలకు వేదిక అయ్యాయి.
ప్రయాణం స్వచ్ఛమైన ప్రేమ నుంచి, ఘర్షణ భరిత వాస్తవికత దాకా ఎలా సాగింది?
తెలుగు సినిమాల్లో కాశ్మీర్ అడుగులు
తెలుగు తెరపై కాశ్మీర్ అందాలను తొలిసారి చూపించిన ఘనత — అక్కినేని నాగేశ్వరరావు కే చెందుతుంది. 1957లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రం కొన్ని భాగాలు కాశ్మీర్‌లో చిత్రీకరించారు.
అలాగే ఎన్టీఆర్ చిత్రాలు కూడా ఎక్కువగా కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకునేవి. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించిన రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రాన్ని కశ్మీర్ అందాలలో చిత్రీకరించారు. అలాగే కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ చిత్రంలో చీకటి వెలుగులు ముఖ్యమైనది.
చిరంజీవి అయితే — "కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో" పాటతో కాశ్మీర్ అందాలను హృదయం గా మలిచాడు. రాక్షసుడు, పసివాడి ప్రాణం వంటి చిత్రాలతో కాశ్మీర్‌లోని స్వర్గాన్ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాడు.
కానీ 1995 తర్వాత — కాశ్మీర్ నిశ్శబ్దమైంది. ఉగ్రవాదం మబ్బులు కమ్మి, దర్శకనిర్మాతలు కాశ్మీర్ వైపు చూడగలగడం మానేశారు.
గడిచిన రెండు దశాబ్దాల తర్వాత — వెంకీ మామ, సరిలేరు నీకెవ్వరు, ఖుషి, అమరన్ లాంటి సినిమాలతో మళ్లీ కాశ్మీర్ తెరపైకి వచ్చింది. అప్పటికీ స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా కాశ్మీర్ రండి.. ఇక్కడ షూటింగ్ చేసి మన అందమైన ప్రదేశాలను ప్రపంచానికి చూపించండి అంటూ ప్రమోట్ చేశారు.
ధైర్యం తెచ్చుకుని దూసుకెళ్లే లోగా... ఇటీవల పహల్గాం ఉగ్రదాడి — మళ్లీ ముసుగేస్తోంది. తడబడిన ఆశలు, చీకటి నీడలు మళ్లీ దూసుకు వస్తున్నాయి.
బాలీవుడ్: కాశ్మీర్‌కు అద్దం
1950ల నుండి — బాలీవుడ్
కాశ్మీర్ ను ప్రేమికుల ప్యారడైజ్‌గా, పసిడి చిరునవ్వులతో చూపించింది.
"జంగ్లీ"లో షమ్మీ కపూర్ స్కార్ఫ్ ఎగరేయించిన తెల్లటి పర్వతాలు.
"కశ్మీర్ కి కలి"లో షర్మిలా టాగూర్ గులాబీ చీర కట్టిన నదీ తీరాలు.
పచ్చని లోయలు. నదీ తీరం గుసగుసలు. తెల్లటి మంచు మీద ప్రేమ ముద్దులు.
1990 తర్వాత — కాశ్మీర్ ముఖ చిత్రం మారిపోయింది.
"రోజా" (1992) — ప్రేమ కథల మధ్య మిలిటెన్సీ భయం ఎలా చొరబడిందో చూపించింది.
"మిషన్ కాశ్మీర్" (2000) — పిల్లల స్వప్నాల్లోనూ బందూకులు ఎలా దూసుకొచ్చాయో నికరంగా చూపింది.
"హైదర్" (2014) — కాశ్మీర్ సమస్యను షేక్‌స్పియర్ తూనికలతో వేదనా భరితంగా ఆవిష్కరించింది.
"LOC Kargil" (2003) — జాతీయ గర్వానికి, జాతి బాధకి కేరాఫ్ గా నిలిచిన గాథ.
ఇవన్నీ కాశ్మీర్‌ను గ్లామర్‌తో కాకుండా, గాయం గాథలా చూపించాయి.
పాటలు కాదు. నాట్యం కాదు. ఇప్పుడు తెరమీద కేవలం — ప్రశ్నలు. పీడలు. పరిపాటి నిషేధాలు.
2019 తర్వాత: నూతన కాశ్మీర్, నూతన కథలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కాశ్మీర్ తెరపైకి మళ్లీ వచ్చింది.
"షేర్షా" (2021) — విక్రమ్ బాత్రా గాథ. మళ్లీ జాతీయ గర్వాన్ని నింపుకుని కాశ్మీరీ నేపథ్యంలో వచ్చింది.
"ది కాశ్మీర్ ఫైల్స్" (2022) — చరిత్రలో మునిగిన గాయాన్ని తెచ్చి తెరపై పెడుతూ దేశవ్యాప్తంగా చర్చలు రేకెత్తించింది.
ఒకప్పుడు పాటలలో పరవశించిన కాశ్మీర్ తోట.
ఇప్పుడు గాయాల గాధ.
ఈ ఉగ్రవాద మబ్బులు పూర్తిగా తొలగి,
కాశ్మీర్ మళ్లీ తెరపై మనసును తాకే నీలి నదిలా ప్రవహించాలంటే కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది.
ఆ రోజు కోసం — వేచి ఉందాం
అప్పుడు మళ్ళీ పాటలు పాడుకుందాం
ప్రస్తుతానికి పహల్గాం ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిద్దాం |