గురూ.. షారూఖ్ సినిమా కాపీ కొట్టినా, కలిసి రాలే

విజయ్ ఆంటోని తాజా చిత్రం 'లవ్ గురు' సినిమా చూస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'రబ్ నే బనా ది జోడి' గుర్తుకు వస్తున్నదా?

Update: 2024-04-15 09:48 GMT

(సూర్య ప్రకాశ్ జోొశ్యుల)


కాపీ కొట్టడం కూడా కళే అంటారు అందలో పండిపోయిన కాపీరావులు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో కాపీ కొట్టడం కూడా ఓ క్వాలిఫికేషన్ అని తేల్చేస్తారు కొందరు సీనియర్స్. అయినా కాపీ అంటారేంటి అసహ్యంగా.. ప్రేరణ అనొచ్చగా గౌరవంగా అనేవాళ్లే ఎక్కువ శాతం. కాపీ కేసులు ఫీల్డ్ లో ఎక్కువే.అయినా తగ్గేదేలే..ఎవరు మనని పట్టుకునేది లే ..పట్టుకున్నా పోయేదేముందిలే అన్నట్లు ముందుకు వెళ్లిపోతూంటారు. అందులోనూ ఎప్పుడో వచ్చిన సినిమాని లేపితే గుర్తు పట్టేదెవరు?


సరే ఇప్పుడు ఈ కాపీ పురాణం అంతా ఎందుకూ అంటే...విజయ్ ఆంటోని తాజా చిత్రం 'లవ్ గురు' సినిమా చూస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'రబ్ నే బనా ది జోడి' గుర్తుకు రావటమే కారణం. షారూఖ్ సినిమా ఓ రొమాంటిక్ కామెడీ..దానికి తమిళ అరవ సిస్టర్ సెంటిమెంట్ ని కలిపితే చాలు అని అనుకుని తీసిన చిత్ర రాజం ఇది. దర్శకుడు వైద్యనాధన్ ఈ సినిమాతోనే పరిచయం అయ్యాడు. మొదట సినిమానే ఇలాంటి కాపీ కథను ఎత్తుకోవటం మాత్రం ఆశ్చర్యమే. పాపం పాత కథనే కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది పాత కథలాగానే ఉండిపోయింది. విత్తనం ఒకటి వేస్తే మొక్క మరొకటి మెలుస్తుందా?

‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’వంటి సూపర్ హిట్ ఇచ్చిన ‘ఆదిత్య చోప్రా’గ్యాప్ తీసుకుని చేసిన ‘రబ్‌నే బనాదీ జోడీ’స్టోరీ లైన్ ని ఓ సారి గుర్తు చేసుకుంటే...
సురేందర్ సాహ్ని(షారూఖ్) ఓ అనాథ. ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో పనిచేసే అతను లేటు వయస్సులో అదీ తప్పనిసరి పరిస్దితుల్లో తన మాస్టారు కూతురు తానీని పెళ్లి చేసుకుంటాడు. ఏజ్ గ్యాప్. ఆలోచనలలో అంతరం. అదే వైవాహిక జీవితానికి అంతరాయం అవుతుందని తర్వాత అర్దమవుతుంది.
ఆమె సురేందర్‌ని భర్తగా అంగీకరించదు. వండి పెడుతుంది కానీ ఏ రకంగానూ దగ్గరవదు. కానీ సురేందర్ ఆమె కన్నా ముందు జనరేషన్ వాడు. సహనం జాస్తి. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తాడు.కానీ ఆమెకు ఎలా దగ్గరవ్వాలో అర్దం కాదు. అప్పుడు ఓ విషయం తెలుస్తుంది. తన భార్య తానీకు డాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉందని. దాంతో ఆమెను డాన్స్ ఇనిస్టిట్యూట్ కు వెళ్లమని ఎంకరేజ్ చేసి ..తను లుక్ మార్చుకుని మోడ్రన్ కుర్రాడిగా మారి..డాన్స్ పార్టనర్ గా అదే ఇనిస్టిట్యూట్ లో చేరుతాడు. ఓ ప్రెండ్ లా దగ్గర అవుతాడు. ఆమె ఇష్టాలకు తగినట్లుగా తనను తాను మార్చుకుంటూ దగ్గర అవుతాడు. ఆమె కూడా వేరే ఎవరో అనుకుని బాగానే ఇష్టపడుతుంది. అప్పుడు ఏమౌతుంది..ఆమెకు అసలు నిజం ఎప్పుడు ఎలా తెలుస్తుందనేది అసలు కథ.



 దీన్నే కొంచెం అటూ ఇటూగా పెద్దగా మార్చకుండా ‘లవ్‌ గురు’ని చేసారు. 35 ఏళ్లు వచ్చినా పెళ్లికానీ ముదురు పెళ్లి కొడుకు అరవింద్‌(విజయ్‌ ఆంటోని). మనస్సుకు నచ్చిన అమ్మాయనే చేసుకుందామనుకుంటాడు. ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేసుకుంటాడు. ఇతని అదృష్టం బాగుండి..అతని తల్లితండ్రులు గమనించి..ఆమె పెద్ద వాళ్లతో మాట్లాడి ముడెట్టేస్తారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. సినిమా హీరోయిన్‌ కావాలనేది ఆమె జీవితాశయం. కామీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. దాంతో ఆయన కోపానికి బలవ్వటం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటుంది.


ఇప్పుడు లొకేషన్ హైదరాబాద్ కు షిప్ట్ అవుతుంది. మన హీరో అరవింద్ కు అసలు నిజం తెలుస్తుంది. ఆమె అతన్ని దూరం పెడుతోంది. విడాకులు తీసుకుందామంటోంది. అప్పుడు ఓ ప్లాన్ వేస్తాడు. ఆమె కు ఇష్టమైన దారిలోనే వెళ్లి దగ్గర అవుదామనుకుంటాడు. ఆ క్రమంలో ఆమెకు విక్రమ్ అనే పేరుతో పరిచయం అవుతాడు. తన సొంత డబ్బులతో ఆమెతో సినిమా తియ్యటం మొదలెడతాడు. తనే హీరో అంటాడు. చివరకు ఆమెకు అసలు విషయం ఎప్పుడు ఎలా తెలిసింది అనేది మిగతా కథ.

రెండింటిలోనూ ఒకటే పాయింట్...ముదురు అబ్బాయి..తన కన్నా వయస్సు తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ప్రేమతో ఆమె మనస్సుని ఎలా గెలుచుకున్నాడనేది. ఇది లేటు పెళ్లిళ్లు అవుతున్న ఈ కాలం జనరేషన్ కుర్రాళ్లకు నచ్చచ్చు అనే ఐడియా తో తీసి ఉండవచ్చు. అయితే కథ సహజంగా నడిస్తే బాగుండేదియ అలా కాకుండా మరో క్యారక్టర్ ని క్రియేట్ చేసి సమస్యకు పరిష్కారం వెతకటం సినిమాటెక్ గా కాసేపు బాగుండవచ్చేమో కానీ ప్రాక్టికల్ గా నిజ జీవితంలో అనుసరించటానికి కష్టం అనిపించే ఇలాంటి సొల్యూషన్స్ ఇంకా ఈ రోజుల్లో కోరుకుంటున్నారా..అంటే లేదనే అనిపిస్తుంది.ఎందుకంటే కలెక్షన్స్ పెద్దగా కనపడటం లేదు మరి. కాపీ కథలు కూడా చాలాసార్లు కలిసి రావు మరి.


Tags:    

Similar News